
చిరంజీవి లాంటి మాస్ హీరో మూవీ నుంచి ఫస్ట్ లుక్ వస్తోందంటే అభిమానులకు అంతకు మించిన పండుగ మరేముంటుంది. ఆ ఫస్ట్ లుక్ ఫెస్టివల్ సీజన్‌లో వస్తే ఆ హ్యాపీనెస్ డబుల్ అవుతుంది. శివరాత్రికి అలాంటి డబుల్ ఫీస్ట్ అందించబోతున్నారు మెగాస్టార్. ఆయన హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘భోళా శంకర్’. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. కీలక సన్నివేశాలు తీస్తున్నారు. టైటిల్‌లోనే శివుడు ఉన్నాడు కనుక మహాశివరాత్రి సందర్భంగా రేపు ఉదయం 9.05 నిమిషాలకు ఫస్ట్ లుక్‌ను విడుదల చేస్తున్నారు. సిస్టర్ సెంటిమెంట్‌తో రూపొందుతున్న ఈ మాస్ ఎంటర్‌టైనర్‌లో చిరంజీవికి చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తోంది. తమన్నా హీరోయిన్. రఘు బాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీ ముఖి, రష్మీ గౌతమ్, సత్య ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. క్రియేటివ్ కమర్షియల్స్ సంస్థతో కలిసి రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.