మెగా గెట్‌ టు గెదర్: 'ది 80స్ స్టార్స్ రీయూనియన్' లో హీరోహీరోయిన్లు.. డ్యాన్సులు!

మెగా గెట్‌ టు గెదర్: 'ది 80స్ స్టార్స్ రీయూనియన్' లో హీరోహీరోయిన్లు.. డ్యాన్సులు!

1980వ దశకంలో దక్షిణాది వెండితెరను ఏలిన అగ్రనటులు, నటీమణులు ప్రతి ఏటా నిర్వహించుకునే 'ది 80స్ స్టార్స్ రీయూనియన్' (The 80s Stars Reunion) వేడుక ఈసారి మరింత ఉల్లాసంగా జరిగింది. 12వ వార్షిక రీయూనియన్ సందర్భంగా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ సహా దక్షిణాది సినీ పరిశ్రమలకు చెందిన దాదాపు 31 మంది తారలు చెన్నై నగరంలో ఒకచోట చేరి పండుగ వాతావరణాన్ని సృష్టించారు.

 

'చిరుత' థీమ్‌తో తారలు

ఈసారి రీయూనియన్ పార్టీకి ఒక ప్రత్యేకమైన థీమ్‌ను ఎంచుకున్నారు. ఉత్సాహభరితమైన 'చిరుత (Cheetah)' థీమ్. అక్టోబర్ 4న కోలీవుడ్ స్టార్ జంట రాజ్‌కుమార్ సేతుపతి, శ్రీప్రియల నివాసంలో జరిగిన ఈ వేడుకలో, నటీనటులంతా చీతా ప్రింట్లు లేదా నలుపు-తెలుపు రంగుల దుస్తుల్లో మెరిసిపోయారు. ఈ వీడియోను లేటెస్ట్ గా టాలీవుడ నటుడు నరేష్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఒకే థీమ్‌లో తళుక్కున మెరిసిన వీరి ఫొటోలు, డ్యాన్స్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

 

మధురానుభూతులు పంచుకున్న స్టార్స్

ఈ సంబరానికి టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్‌, నరేశ్‌, జయసుధ, రమ్యకృష్ణ, సుమలత వంటి అగ్రతారలు హాజరయ్యారు. బాలీవుడ్ నుంచి జాకీ ష్రాఫ్‌ రాగా, కోలీవుడ్, మాలీవుడ్ నుంచి శరత్‌కుమార్‌, నదియ, రాధ, సుహాసిని, ఖుష్బూ, ప్రభు, రేవతి, శోభన సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

చిరంజీవి ఈ సందర్భంగా తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, "80's స్నేహితులతో ప్రతి రీయూనియన్‌ మధుర జ్ఞాపకాల వీధిలో ఒక నడకలా ఉంటుంది. నవ్వులు, ఆప్యాయత, పాత జ్ఞాపకాలతో నిండిన ఈ సమావేశం ఎప్పుడూ మొదటిసారి కలిసినట్టే సంతోషంగా అనిపిస్తుంది" అని పోస్ట్ చేశారు. దశాబ్దాల సినీ ప్రయాణంలో తమకు దక్కిన ఈ స్నేహబంధాన్ని ఈ తారలంతా డ్యాన్సులు, సరదా ఆటలతో మరింత ఉల్లాసంగా జరుపుకున్నారు.