తాతగా గర్వంగా ఉంది..మనవరాలిపై చిరంజీవి ట్వీట్

తాతగా గర్వంగా ఉంది..మనవరాలిపై చిరంజీవి ట్వీట్

మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో సంబరాలు మొదలయ్యాయి.  మెగాపవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. జూన్ 20న ఉదయం జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రిలో ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో మెగా ఫ్యామిలీ ఇంట్లో పండుగ వాతావరణ నెలకొంది.. తన  ఫ్యామిలీలోకి మనవరాలు అడుగుపెట్టడంతో చిరంజీవి సురేఖ దంపతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. తన మనవరాలిని చూడటానికి ఇవాళ ఉదయమే  అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు చిరంజీవి.

 ట్విట్టర్లో తన ఆనందాన్ని వ్యక్తం చేశారు చిరంజీవి. లిటిల్ మెగా ప్రిన్సెస్ కు స్వాగతమంటూ ట్వీట్ చేశారు. తల్లిదండ్రులుగా రామ్ చరణ్- ఉపాసనలకు, తాత అయినందుకు తనకు  గర్వంగా ఉందన్నారు. నీ రాకతో కోట్లాది మంది  మెగా అభిమానుల్లో ఆనందాన్ని నింపావని తెలిపారు.  

ఉపాసన ఆడబిడ్డకు జన్మనివ్వడంతో  మెగా ఫ్యామిలీ మెంబ‌ర్స్‌తో పాటు కామినేని కుటుంబ‌స‌భ్యులు అపోలో ఆసుప‌త్రికి సంద‌ర్శిస్తున్నారు.  త‌మ కుటుంబంలోకి అడుగుపెట్టిన కొత్త ఫ్యామిలీ మెంబ‌ర్‌ను ఆశీర్వదిస్తున్నారు

రామ్ చరణ్, ఉపాసనల పెళ్లి జూన్ 14, 2012న హైదరాబాద్‌లో  వైభవంగా జరిగింది. పెళ్లైన ప‌ద‌కొండేళ్ల త‌ర్వాత త‌ల్లిదండ్రులు అయ్యారు. ఉపాసన అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మనవరాలు, శోభన, అనిల్ కామినేనిల కూతురు.  ప్రస్తుతం ఉపాసన అపోలో చారిటీకి వైస్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నారు.