- మంత్రి వాకిటి శ్రీహరి
మక్తల్, వెలుగు : చిట్యాల– గజరందొడ్డి గ్రామాల మధ్య రూ. 20 కోట్లతో చేపట్టిన బ్రిడ్జి కమ్ బ్యారేజీ నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. గురువారం మక్తల్ మండలం చిట్యాల వద్ద జరుగుతున్న నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.
నాణ్యతపై అధికారులకు పలు సూచనలు చేశారు. వర్షాకాలం ప్రారంభమైతే పనులకు ఆటంకం కలిగే ప్రమాదం ఉందని, వర్షాలకు ముందే పనుల వేగం పెంచి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. నిర్మాణంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నాణ్యత విషయంలో రాజీ పడకూడదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గణేశ్‌కుమార్, ఆనంద్ గౌడ్, శివరాంరెడ్డి, నజీర్ పాషా, బీజేపీ నాయకుడు చిట్యాల లక్ష్మణ్, మాజీ ఎంపీటీసీ మారుతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
