హుస్నాబాద్, వెలుగు: తమ వ్యవసాయ భూముల్లో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేసి, తమ బతుకులను ఆగం చేయొద్దని అక్కన్నపేట మండలం జనగామ, చౌటపల్లి గ్రామాలకు చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం హుస్నాబాద్ ఆర్డీఓ రామ్మూర్తికి వినతిపత్రం సమర్పించారు. తమకు పూర్తి వివరాలు చెప్పకుండా భూములు లాక్కునే ప్రయత్నం చేయవద్దని కోరారు.
చట్టపరంగా తమకు లభించే పరిహారం ఎంత చెల్లిస్తారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. తాము ఇప్పటికే హైకోర్టులో రిట్ పిటిషన్ వేశామని, కోర్టు తీర్పు వచ్చేదాకా తమ భూముల జోలికి రాకుండా చర్యలు తీసుకోవాలని ఆర్డీఓను కోరారు. కార్యక్రమంలో శంకరయ్య, రాజయ్య, రాణి, రాధమ్మ, జ్యోతి, మల్లిక, శంకరయ్య, నాగభూషణం, భూమయ్య, రజనీకాంత్ పాల్గొన్నారు.
