
- ఈ నెల 13 వరకు ప్రశ్నించనున్న అధికారులు
- నిధుల దుర్వినియోగంలో దేవరాజ్‌ది కీలక పాత్ర
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ క్రికెట్‌అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్ష ఎన్నికలో నిబంధనల ఉల్లంఘన, నిధుల గోల్‌మాల్ వ్యవహారంలో సీఐడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హెచ్‌సీఏ సెక్రటరీ దేవరాజ్ రాంచందర్‌ను 7 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. దేవరాజ్‌ను సీఐడీ అధికారులు జులై 25న అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
సీఐడీ అభ్యర్ధన మేరకు గురువారం నుంచి ఈ నెల 13వ తేదీ దాకా కస్టడీకి అనుమతిస్తూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రెండో రోజు కస్టడీలో భాగంగా శుక్రవారం దేవరాజ్ నుంచి సీఐడీ అధికారులు కీలక సమాచారం సేకరించినట్లు తెలిసింది. ప్రధానంగా అధ్యక్షుడి ఎన్నిక కోసం జగన్‌మోహన్ రావు దాఖలు చేసిన ఫోర్జరీ డాక్యుమెంట్లు సహా బీసీసీఐ నుంచి వచ్చిన గ్రాంట్స్‌ను ఎలా ఖర్చు చేశారు? వాటికి సంబంధించిన ఆర్డర్లు, బిల్స్ సహా హెచ్‌సీఏ అకౌంట్ నుంచి బదిలీ అయిన నగదుకు సంబంధించిన వివరాలతో స్టేట్‌మెంట్ రికార్డ్ చేసినట్లు సమాచారం.
కాగా, సీఐడీ కేసు నమోదు చేసినట్టు తెలియగానే, ఉప్పల్ మాజీ ఇన్‌స్పెక్టర్ ఎలక్షన్‌రెడ్డి ఇచ్చిన ముందస్తు సమాచారంతో దేవరాజ్ రాంచందర్ తప్పించుకు పారిపోయాడు. సీఐడీ నుంచి 17 రోజుల పాటు తప్పించుకు తిరిగిన దేవరాజ్‌ను మహారాష్ట్ర పూణేలోని ఓ త్రీ స్టార్ హోటల్‌లో జులై 25న సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. తన వద్ద కీలక సమాచారం ఉండటంతోనే దేవరాజ్ తప్పించుకు పారిపోయాడని సీఐడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు 7 రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. హెచ్‌సీఐ నిధులను దారి మళ్లించడంలో దేవరాజ్ కీలకంగా వ్యవహరించాడని గుర్తించారు. కస్టడీలో భాగంగా శనివారం మరోమారు ప్రశ్నించనున్నారు.