
- బయటి నుంచి వాటర్ బాటిల్స్ అనుమతించకపోతే.. మీరే తాగునీటి సౌకర్యం కల్పించాలి
- మద్రాస్ హైకోర్టు ఆదేశం
చెన్నై: సినిమా థియేటర్లలోకి బయటి నుంచి తాగునీటి బాటిల్స్ తెచ్చుకోవడాన్ని అనుమతించకపోతే.. థియేటర్ల నిర్వాహకులే ప్రేక్షకులకు ఉచిత తాగునీరు అందించాలని మద్రాస్ హైకోర్టు ఆదేశాలిచ్చింది. బయటి నుంచి వాటర్ బాటిళ్లు తీసుకురాకుండా నిషేధించే హక్కు థియేటర్ యాజమాన్యానికి ఉంటుందని తేల్చి చెప్పిన హైకోర్టు.. అలా నిషేధిస్తే మాత్రం యాజమాన్యమే ఉచితంగా తాగునీటి సౌకర్యం కల్పించాలని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది.
ప్రేక్షకులు థియేటర్లోకి వాటర్ బాటిల్ పేరుతో తెచ్చే బాటిళ్లలో ఆల్కహాల్ లేదా.. ఇతర ప్రమాదకర రసాయనాలు.. బాటిల్ బాంబులు వంటివి తీసుకువచ్చే అవకాశం ఉందన్న థియేటర్ల యాజమాన్యాల ఆందోళన సరైనదేనని మద్రాస్ హైకోర్టు అభిప్రాయపడింది. బయటి నుంచి తాగునీటి బాటిళ్లను నిషేథించాలనుకుంటే సినిమా హాళ్లలో వాటర్ కూలర్లను ఏర్పాటు చేసి ప్రేక్షకులకు ఉచిత తాగునీటి సౌకర్యం కల్పించాలని జస్టిస్ ఎస్‌ఎం సుబ్రమణ్యం స్పష్టం చేశారు. ఏదో మాట వరసకు తాగునీటి సౌకర్యం కల్పించాలనుకుంటే కుదరదని.. ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా శుద్ధి చేసిన తాగునీటిని సినిమా హాల్స్ లోపల అందుబాటులో ఉంచాలని మద్రాస్ హైకోర్టు తేల్చి చెప్పింది. సినిమా థియేటర్ తెరిచిపెట్టినంత సేపు వచ్చిన ప్రేక్షకులకు ఉచిత తాగునీటి సౌకర్యం అందుబాటులో ఉండాలని మద్రాస్ హైకోర్టు ఆదేశాలిచ్చింది.