ఎన్నికల వేళ.. ఓటరు నిర్ణయంపై సోషల్‌‌ మీడియా ప్రభావమెంత?

 ఎన్నికల వేళ.. ఓటరు నిర్ణయంపై సోషల్‌‌ మీడియా ప్రభావమెంత?

అంచనాలు, పరికల్పనలు, భావనలు... అన్ని వేళలా నిజమవవు. మారితే అందులో యాదృచ్ఛికమే ఎక్కువ! కొన్నిసార్లవి పాక్షిక నిజాలూ అవ్వొచ్చేమో? రాజకీయ రంగంలో అయితే ఆశలకు, అంచనాలకు వాస్తవాలు సుదూరంగా ఉండే సందర్భాలే ఎక్కువ! ఎన్నికల్లో ఏ గెలుపోటములకు ఏది కారణమంటూ, ఫలితాలు వెల్లడయ్యాక అనుకూలతను బట్టి అన్వయించి చెప్పుకోవచ్చేమో కానీ, అదే కారణం..అవ్వొచ్చు,కాకపోవచ్చు! ప్రతికూలమైతే మౌనాన్ని ఆశ్రయించడం ముఖంచెల్లక దొడ్డిదారి వెతుక్కునే ప్రయాస! ఏదైనా, కడకు శాస్త్రీయ అధ్యయనం, విశ్లేషణ ద్వారా నిజాలు నిగ్గు తేలాల్సిందే! ఎన్నికల వేళ.. ఓటరు నిర్ణయంపై సోషల్‌‌ మీడియా ప్రభావమెంత? మరీ కాసింతే! నమ్మినా, నమ్మకపోయినా.. ఇదే నిజం!

ఎ న్నికలు ముంచుకు వస్తుంటే.. రాజకీయ పార్టీలు ఎన్నెన్ని ఎత్తులు వేస్తాయో? మరెన్ని జిత్తులు పన్నుతాయో! అందుకు బలమైన కారణాలే ఉన్నాయి. ఏమో? ఏ వ్యూహంలో ఎంత అదృష్టం దాగుందో.. దాన్ని భుజానికెత్తుకోకుంటే, ఎక్కడ నష్టపోతామోనన్న బెంగ కొద్దీ అన్ని ప్రయత్నాలూ చేస్తుంటాయి. పార్టీలే కాదు, విడివిడిగా అభ్యర్థులూ అంతే! పెద్ద మొత్తాలు చెల్లించి ఎన్నికల వ్యూహకర్తల్ని ఆశ్రయిస్తారు. సర్వేలు, అధ్యయనాలు చేయిస్తుంటారు. ప్రచార వ్యవస్థల్ని ఏర్పరచుకుంటారు, ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు నిరంతరం వాటిని కొనసాగిస్తారు. ఇటీవలి పరిణామం.. సోషల్‌‌ మీడియా సైన్యాల్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. సైబర్‌‌ ఆర్మీ! ఫేస్‌‌బుక్‌‌, వాట్సాప్‌‌, యూట్యూబ్‌‌, ఇన్‌‌స్టా, ట్విట్టర్‌‌ ఇలా పలు సోషల్ మీడియా వేదికల నుంచి యుద్ధం చేస్తూ ప్రత్యర్థుల మీద పైచేయి కోసం నానా పాట్లూ పడతారు. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జరుగుతున్నదిదే! ఈ మాధ్యమాలు, తద్వారా జరిగే ప్రయత్నం సగటు ఓటరు నిర్ణయాన్ని ఏ మేరకు ప్రభావితం చేస్తాయి? అన్నది పెద్ద ప్రశ్న. సాధారణ జనాభిప్రాయం మాత్రం ‘సోషల్‌‌ మీడియా ప్రభావం చాలా ఉంటుంది, దాని వల్లే ఫలితం తారుమారవుతోంది’ అన్నట్టుంటుంది. దీనికి ఏ శాస్త్రీయ ఆధారమూ లేదు. పైగా, శాస్త్రీయంగా ఓ సంస్థ జరిపిన దేశవ్యాప్త సర్వేలో వెల్లడైన అంశాలు ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. ఓటర్ల నిర్ణయాన్ని ప్రభావితం చేయడంలో సోషల్‌‌ మీడియా పాత్ర అంతంతే! ‘మాకింకేదీ అవసరం లేదు, ఈ కుక్కతోక పట్టుకొని గోదారి ఈదుతూనే గట్టెక్కుతాం’ అనుకోవడం ఒట్టి భ్రమ!

పరిధి పెరిగింది నిజమే!

సోషల్‌‌ మీడియా ప్రపంచ వ్యాప్తంగా బాగా విస్తరించింది. మన దేశంలో మరీ ఎక్కువగా! స్మార్ట్‌‌ ఫోన్‌‌ వాడకం పెరిగి, ఇంటర్నెట్‌‌ చార్జీలు చౌక అయ్యాక సోషల్ మీడియా జనంలోకి బాగా చొచ్చుకుపోయింది. తేలిగ్గా కొత్త విషయాలు తెలుసుకోవడానికి, బహిరంగ అభివ్యక్తి వేదికగా ‘ఫేస్‌‌బుక్‌‌’, వ్యక్తులు -గ్రూప్‌‌ల మధ్య పరస్పర సమాచార, భావ వ్యాప్తికి ‘వాట్సాప్‌‌’లు ఇవాళ గొప్ప సాధనాలయ్యాయి. సమాచారం, జ్ఞానం, వినోదం, కాలక్షేపానికి ‘యూట్యూబ్‌‌’ తేలిగ్గా అందుబాటులో ఉండే వేదికైంది. ఇటీవలి కాలంలో ‘ట్విట్టర్‌‌’, ‘ఇన్‌‌స్టా’ కూడా ఎక్కువగా వాడకంలోకి వచ్చాయి. దేశంలో 32 కోట్ల మంది ఫేస్‌‌బుక్‌‌ వాడుతుంటే, 48 కోట్ల మంది వాట్సాప్‌‌, దాదాపు అంతే మంది యూట్యూబ్‌‌ వాడుతున్నారని తాజా గణాంకాలు చెబుతున్నాయి. నిజాలు, -అబద్ధాలు అనే తేడా లేకుండా సోషల్​మీడియా ద్వారా వచ్చే సమాచారాన్ని పౌరులు ఆస్వాదిస్తున్నారు. పలు రూపాల్లో వారి రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక జీవనాన్ని సోషల్‌‌ మీడియా ప్రభావితం చేస్తోంది. అలవాట్లు, ఆచార వ్యవహారాలు, జీవనశైలిలో మార్పులకు కూడా ఇది కొంత మేర కారణమవుతోంది. దీంతో, తేలిగ్గా ఓటర్లను చేరవచ్చని, ఎన్నికల ప్రచారం చేసుకోవచ్చని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు భావించడంలో ఆశ్చర్యమేమీ లేదు. అందుకే సుమారు దశాబ్దకాలంగా ఈ వాడకం క్రమంగా పెరిగింది. తమ విధానాలు, ఆలోచనలు, కార్యకలాపాలు, చేపట్టిన చర్యలు పౌరులకు తెలిపే వేదికగా సోషల్‌‌ మీడియాను వాడుకోవడమే కాకుండా ప్రత్యర్థులపై వ్యతిరేక ప్రచారానికీ ఉపయోగిస్తున్నారు. చూడటం, వాడటం, సమాచారం తెలుసుకోవడం, స్పందించడం వేరు. ఆ సమాచారం ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం, ప్రభావితులవడం వేరు. ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలి? అనే ఓటరు నిర్ణయాన్ని సోషల్‌‌ మీడియాపెద్దగా ప్రభావితం చేయటం లేదని ‘అభివృద్ధి సమాజాల అధ్యయన కేంద్రం(సీఎస్‌‌డీఎస్‌‌)- లోక్‌‌నీతి’ జరిపిన అధ్యయనంలో తేలింది. ‘పీపుల్స్‌‌ పల్స్‌‌’ సంస్థ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరిపిన ఎన్నికల సర్వేల్లోనూ ఇదే విషయం పలుమార్లు ధ్రువప‌‌డింది. సాధారణ జ్ఞానంతో కొంత విశ్లేషణాత్మకంగా చూసే సామాన్యులకు కూడా ఇదే విషయం కనిపిస్తుంది.

ఈ సంకేతమే ఆధారం

2014కు ముందరి యూపీఏ ప్రభుత్వం బాగోలేకుండిందని సోషల్‌‌ మీడియా అనుబంధం ఉన్న వాళ్ల కన్నా లేని వాళ్లలోనే అత్యధికులు అభిప్రాయపడ్డారు. మతపరమైన విద్వేషాలు, అధిక-అల్ప సంఖ్యాక విభేదాల విషయంలోనూ సోషల్‌‌ మీడియాతో సంబంధమున్న వారిలో ప్రజాస్వామ్య భావనలు క్రమంగా బలపడుతున్నాయి. భారత్‌‌ అన్ని మతాలకు చెందిందని నాలుగింట ముగ్గురు ఓటర్లంటే, ఈ దేశం హిందువులదని ఆరింట ఒకరే అన్నారు. కానీ, ఎన్నికల్లో పార్టీల పరమైన సానుకూలత ఇందుకు భిన్నంగా కనిపించింది. ఇది కూడా, ఓటరు నిర్ణయంపై సోషల్‌‌ మీడియా ప్రభావం లేదనడానికి నిదర్శనం. ఆక్స్‌‌ఫ‌‌ర్డ్‌‌ అధ్యయనం ప్రకారం భారత్‌‌ సోషల్‌‌ మీడియా వాడకందారుల్లో 54 శాతం మంది, తమకు లభించే సమాచారం వాస్తవాల ధ్రువీకరణకు యత్నిస్తారు. ప్రపంచ సగటు 37 శాతం కాగా, అమెరికాలో ఇది 29 శాతమే! ఇన్ని సందేహాల మధ్య భారత ఓటరు సోషల్‌‌ మీడియా సమాచారాన్ని నమ్మి ఓటు వేయడు గాక వేయడు.

ఆ ఖాతాలో వేయలేం!

2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, దాని భాగస్వామ్య పక్షాల విజయానికి సోషల్‌‌ మీడియా ప్రభావమే కారణం అనే అన్వయం, ఉల్లేఖనలు నిజం కావు. సర్వేలో లభించిన డేటా అధ్యయనం, వివిధ వడపోతల తర్వాత.. జరిపిన అన్వయం చూసినపుడు, ఓటరు నిర్ణయంపై సోషల్‌‌ మీడియా ప్రభావం పెద్దగా లేదని, ఉన్నా అది నామమాత్రమేనని తేలింది. సోషల్‌‌ మీడియా వెనుక ఉరుకులు పరుగులు తీస్తున్న పార్టీలు, అభ్యర్థుల ఆశలు, అంచనాలకిది పూర్తి విరుద్ధం. 43 శాతం మందికే ఇంటర్నెట్‌‌ సదుపాయం ఉన్న ఈ దేశంలో ముడింట రెండొంతుల ఓటర్లు అసలు సోషల్‌‌ మీడియా చూడరు. చూసే మూడో వంతు ఓటర్లలో అత్యధికులు ఇతరేతర అవసరాలకు వినియోగిస్తున్నారే తప్ప రాజకీయ సమాచారానికో, అభిప్రాయాలు ఏర్పరచుకునేందుకో కాదు. మొత్తమ్మీద పది శాతం మందే తరచూ సోషల్​ మీడియాను వాడుతున్నారు. రాజకీయ సమాచారం, వార్తల కోసం భారతీయులు ఇప్పటికీ ప్రధానంగా ఆధారపడేది టీవీపైన తర్వాత పత్రికల పైనే! రాజకీయ సమాచారం కోసం సోషల్‌‌ మీడియా చూసేది 3 శాతం ఓటర్లు మాత్రమే! సోషల్‌‌ మీడియా వాడుతున్న ఓటర్లలో నాలుగో వంతు మంది తమ రాజకీయ భావాలు, అభిప్రాయాలను పంచుకోవడానికి అదొక వేదిక అని చెప్పారు. సోషల్‌‌ మీడియా వాడే ఓటర్లలో 50 శాతం మంది, అందులో లభించే రాజకీయ సమాచారాన్ని నమ్మజాలమన్నారు. కొంతవరకు నమ్ముతామని అయిదో వంతు మంది చెబితే, మిగతా వారు ఎటూ చెప్పలేకపోయారు. బీజేపీకి సోషల్‌‌ మీడియా అనుబంధమున్న ఓటర్లలో లభించినంత సానుకూలత అనుబంధం లేని 65 శాతం ఓటర్లలోనూ, కొంచెం అటుఇటుగా లభించింది. సోషల్‌‌ మీడియా అనుబంధం వారిలోనూ బీజేపీ సానుకూలత ఒక్కరీతిలో లేదు. అగ్రవర్ణాలు, నగర – పట్టణ వాసులు, పురుషుల్లో ఉన్నంత దళిత – గిరిజనులు, పల్లెవాసులు, మహిళా ఓటర్లలో లేదు. 2019 నాటికి సోషల్‌‌ మీడియా విస్తృతి గణనీయంగా పెరిగినా, సోషల్‌‌ మీడియా ద్వారా బీజేపీకి లభించిన ఎన్నికల సానుకూలత 2014లో కన్నా 2019 ఎన్నికల్లో తక్కువే అని తేలింది. క్రియాశీల నెటిజన్లలో 43 శాతం, మధ్యేరకం వాళ్లలో 39 శాతం, అరకొరగా చూసే ఓటర్లలో 37 శాతం బీజేపీకి సానుకూలంగా ఉంటే, అసలు సోషల్‌‌ మీడియాకు సంబంధమే లేని వారిలో 36 శాతం మంది సానుకూలత బీజేపీకి లభించింది.
- దిలీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి,పొలిటికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎనలిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పీపుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రీసెర్చ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంస్థ