ప్రధాని మోదీవి నియంతృత్వ పోకడలు : భూపాల్

ప్రధాని మోదీవి నియంతృత్వ పోకడలు : భూపాల్

షాద్ నగర్,వెలుగు: ప్రధాని మోదీ కార్పొరేట్ శక్తులకు రెడ్ కార్పెట్ పరుస్తూ కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని, నియంతృత్వ పోకడలు పోతున్నారని  సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్  మండిపడ్డారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా శుక్రవారం షాద్ నగర్ టౌన్ లో పాల్గొని ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక విధానాలను అమలు చేస్తూ ప్రజలపై తీవ్ర భారాలను మోపుతుందని ఆరోపించారు.

నిత్యవసరాల ధరల నియంత్రించడంలో ఫెయిలైందని విమర్శించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానాన్ని గాలికి వదిలేశారని మండిపడ్డారు.  రైతులకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంలో హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు. కార్మిక చట్టాలను బలహీనం చేసే నాలుగు రకాల లేబర్ కోడ్ లను సిద్ధం చేసి కార్మికుల ఉద్యోగ భద్రతకు ముప్పు తెచ్చారని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రజా వ్యతిరేకతను రాజకీయంగా ఎదుర్కోలేక రామాలయం ప్రారంభోత్సవాన్ని ముందుకు తెచ్చి హిందుత్వ రాజకీయాలతో ఓటు బ్యాంకు పెంచుకొని తిరిగి అధికారంలోకి రావాలని సిద్ధమవుతున్నారని విమర్శించారు. రైతులు కనీసం మద్దతు ధర, రుణమాఫీ సహా ఇతర వ్యవసాయ సంస్కరణలకు చట్టపరమైన హామీని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ఆందోళన చేస్తుంటే వారిపై కఠినంగా వ్యవహిస్తున్నారన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫారసులను తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మిక సంఘం రాష్ట్ర కన్వీనర్ పినపాక ప్రభాకర్, జిల్లా అధ్యక్షుడు రాజు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీను నాయక్, రాజశేఖర్ పాల్గొన్నారు.