సివిల్​ సర్వీసెస్​ప్రిలిమ్స్‌‌‌‌ ఫైనల్​ టిప్స్​

సివిల్​ సర్వీసెస్​ప్రిలిమ్స్‌‌‌‌ ఫైనల్​ టిప్స్​

ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌‌‌‌ఎస్‌‌‌‌ సహా మొత్తం 21 సర్వీసులకు యూపీఎస్సీ సివిల్‌‌‌‌ సర్వీసెస్‌‌‌‌ ఎగ్జామ్‌‌‌‌ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. మూడంచెల సెలెక్షన్​ ప్రాసెస్​లో తొలిదశ ప్రిలిమ్స్ మే 28వ తేదీన నిర్వహించనుంది. ఈ సర్వీస్​ కోసం ఫ్రెషర్స్‌‌‌‌ నుంచి సీనియర్​ ఆస్పిరెంట్స్​ వరకు లక్షల మంది పోటీ పడుతుండడంతో పోటీ తీవ్రంగా ఉంటుంది. పరీక్ష తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రిలిమ్స్‌‌‌‌లో  ఎలా సక్సెస్​ అవ్వాలో తెలుసుకుందాం..

సివిల్‌‌‌‌ సర్వీసెస్‌‌‌‌-2023 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1105 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. తొలి దశ ప్రిలిమ్స్‌‌‌‌కు దేశవ్యాప్తంగా దాదాపు ఐదు లక్షల మంది పోటీ పడే అవకాశముంది.  ప్రిలిమ్స్‌‌‌‌లో క్వాలిఫై అయితేనే మెయిన్స్‌‌‌‌కు అర్హత లభిస్తుంది. ఒక్కో పోస్ట్‌‌‌‌కు 1:12.5 నిష్పత్తిలో మెయిన్స్‌‌‌‌కు ఎంపిక చేస్తారు.

ప్రాక్టీస్​.. రివిజన్​

ప్రిలిమ్స్‌‌‌‌ మే 28న నిర్వహించనుండడంతో అభ్యర్థులకు అందుబాటులో 22 రోజులు సమయం ఉంది. విలువైన ఈ సమయంలో అభ్యర్థులు విశ్లేషణాత్మక అధ్యయనం, రివిజన్​, సమయ పాలన, ప్రాక్టీస్‌‌‌‌ తో నిరంతరం ప్రిపరేషన్‌‌‌‌ చేయాలి. పేపర్‌‌‌‌-1 జనరల్‌‌‌‌ స్టడీస్‌‌‌‌ సిలబస్‌‌‌‌లోని అన్ని అంశాలను నిత్యం చదివేలా టైమ్‌‌‌‌ ప్లాన్‌‌‌‌ చేసుకోవాలి. ప్రతి రోజు కనీసం ఎనిమిది నుంచి పది గంటలు ప్రిపరేషన్‌‌‌‌కు కేటాయించాలి. ప్రతి వారం ప్రిపరేషన్‌‌‌‌  పూర్తయ్యాక సెల్ఫ్‌‌‌‌ టెస్ట్‌‌‌‌లు, మాక్‌‌‌‌ టెస్ట్‌‌‌‌లు రాస్తే ఉపయోగం ఉంటుంది.

రివిజన్​పై ఫోకస్​ : సబ్జెక్ట్‌‌‌‌ వారీగా ముఖ్యాంశాలను గుర్తించి వాటి­పై ఫోకస్​ చేయాలి. ఇప్పటికే సిద్ధం చేసుకున్న సొంతనోట్స్‌‌‌‌ ద్వారా రివిజన్​కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. గత నాలుగైదేళ్ల ప్రీవియస్​ పేపర్స్​ పరిశీలించాలి. వాటిల్లో ఆయా సబ్జెక్ట్‌‌‌‌ల నుంచి ఎలాంటి ప్ర­శ్నలు అడుగుతున్నారు.. ఏ అంశాలకు అధిక ప్రాధాన్యం లభిస్తుందో తెలుసుకొని ప్రిపరేషన్​ సాగించాలి. అంతర్జాతీయ పరిణామాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రిలిమ్స్‌‌‌‌ ప్రిపరేషన్‌‌‌‌ ఇప్పటికే పూర్తి చేసుకుని ఉండడంతో ఇక నుంచి పూర్తిగా రివిజన్‌‌‌‌పై ఫోకస్​ చేయాలి.

సినాప్సిస్, కాన్సెప్ట్‌‌‌‌ చదవాలి: ప్రిపరేషన్‌‌‌‌ సమయంలో అభ్యర్థులు క్లిష్టంగా భావించిన అంశాలను తర్వాత చదవచ్చనే ధోరణితో విస్మరిస్తారు. ఇలా వదిలేసిన టాపిక్స్‌‌‌‌కు సంబంధించి ఇప్పుడు కొత్తగా ప్రిపరేషన్‌‌‌‌ ప్రారంభించడం సరికాదని సబ్జెక్ట్‌‌‌‌ నిపుణుల అభిప్రాయం. ప్రస్తుత సమయంలో ఇప్పటికే పట్టు సాధించిన అంశాలపై మరింత లోతైన అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో కొత్త అంశాలను చదవాల్సి వస్తే.. వాటికి సంబంధించి సినాప్సిస్, కాన్సెప్ట్‌‌‌‌లపై దృష్టిపెట్టాలని పేర్కొంటున్నారు.

ప్రీవియస్​ పేపర్స్​ ప్రాక్టీస్​:  ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో ప్రిలిమ్స్‌‌‌‌ అభ్యర్థులకు ఉపకరించే మరో సాధనం.. గత ప్రశ్న పత్రాలను ప్రాక్టీస్‌‌‌‌ చేయడం. ఇప్పటి నుంచి పరీక్ష ముందు రోజు వరకు ప్రతి రోజు ఒక ప్రీవియస్‌‌‌‌ పేపర్‌‌‌‌ ప్రాక్టీస్‌‌‌‌ చేసేలా సమయం కేటాయించుకోవాలి. దీని ద్వారా తమ బలాలు, బలహీనతలపై అవగాహన ఏర్పడుతుంది.

పేపర్‌‌‌‌-2ను తక్కువ అంచనా వేయొద్దు:  ప్రిలిమ్స్‌‌‌‌లో పేపర్‌‌‌‌-2ను అర్హత పేపర్‌‌‌‌గానే పేర్కొన్నప్పటికీ.. ఇందులో 33 శాతం మార్కులు సాధిస్తేనే పేపర్‌‌‌‌-1 మూల్యాంకనం చేస్తారు. దాని ఆధారంగానే మెయిన్స్‌‌‌‌కు ఎంపిక చేస్తారు. కాబట్టి పేపర్‌‌‌‌-2లో అర్హత మార్కులు సాధించేందుకు ప్ర ధానంగా మ్యాథమెటిక్స్, లాజికల్‌‌‌‌ రీజనింగ్‌‌‌‌ స్కిల్స్, ఇంగ్లీష్‌‌‌‌ కాంప్రహెన్షన్‌‌‌‌ అంశాలను ప్రాక్టీస్‌‌‌‌ చేయాలి.
గుర్తుంచుకునే టెక్నిక్స్​: సిలబస్‌‌‌‌లోని అంశాలను గుర్తు పెట్టుకోవడానికి వ్యక్తిగత మెమొరీ టిప్స్‌‌‌‌ సెట్​ చేసుకోవాలి. పాయింటర్స్, ఫ్లో చార్ట్స్, విజువలైజేషన్‌‌‌‌ టెక్నిక్స్‌‌‌‌ వంటి వాటిని అనుసరించాలి. ముఖ్యమైన సంవత్సరాలు, గణాంకాలను గుర్తుంచుకునే క్రమంలో వ్యక్తిగతంగా అన్వయించుకోవడం బెటర్​.

ప్రిలిమ్స్‌‌‌‌ ముఖ్యాంశాలు

కరెంట్‌‌‌‌ అఫైర్స్‌‌‌‌: ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమైన ప్రాజెక్ట్‌‌‌‌లు వాటి ఉద్దేశం. బడ్జెట్, ఆర్థిక సర్వే, అంతర్జాతీయ ఒప్పందాలు. జాతీయ ప్రాధాన్యం సంతరించుకున్న అంశాలు.  ఇటీవల కాలంలో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన విధానాలు. గత ఏడాది కాలంలో అమల్లోకి వచ్చిన సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టాలి. 

చరిత్ర: ప్రాచీన, మధ్యయుగ చరిత్రకు సంబంధించి సాహిత్యం, కళలు, మత ఉద్యమాలు, రాజకీయ-సామాజిక- ఆర్థిక చరిత్ర అంశాలు. ఆధునిక చరిత్రలో బ్రిటిష్‌‌‌‌ సామ్రాజ్య స్థాపన- పరిపాలన విధానాలు; బ్రిటిష్‌‌‌‌ వ్యతిరేక తిరుగుబాట్లు-–ఉద్యమాలు (ప్రధానంగా స్వాతంత్య్ర పోరాటం), సంస్కరణోద్యమాలు. జాతీయోద్యమంలో నాయకులు చేసిన తిరుగుబాట్లకు సంబంధించిన అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.  

రాజ్యాంగం: రాజ్యాంగ పరిషత్, రాజ్యాంగ సవరణ ప్రక్రియ, పీఠిక, కొత్త రాజ్యాంగ సవరణలు-వాటికి సంబంధించిన ఆర్టికల్స్​. రాజకీయ వ్యవస్థ, పంచాయతీరాజ్​ వ్యవస్థకు సంబంధించిన కమిటీలు, చట్టాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ఇటీవల నెలకొన్న వివాదాల మీద ఫోకస్ చేయాలి. 

ఎకానమీ:  ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాల ప్రగతి(వ్యవసా­య రంగం, పారిశ్రామిక రంగం, సేవారంగం). ఆర్థికాభివృద్ధిలో సహజ వనరుల పాత్ర, పారిశ్రామిక తీర్మానాలు-–వ్యవసాయ విధానం. బ్యాంకింగ్‌‌‌‌- సంస్కరణలు-. తాజా మానవాభివృద్ధి, ప్రపంచ అభివృద్ధి నివేదికలు గుర్తుంచుకోవాలి.

సైన్స్‌‌‌‌ అండ్‌‌‌‌ టెక్నాలజీ:  గతేడాది  కాలంలో ఇస్రో ప్రయోగించిన ఉపగ్రహాలు. ఇటీవల కాలంలో సంభవిస్తున్న వ్యాధులు-–కారకాలు. సైబర్‌‌‌‌ సెక్యూరిటీ యాక్ట్‌‌‌‌. రక్షణ రంగంలో కొత్త మిస్సైల్స్‌‌‌‌ ప్రయోగాలు. పర్యావరణ పరిరక్షణ ఒప్పందాలు, తీసుకున్న చర్యలపై అవగాహన ఉండాలి. 

జాగ్రఫీ:  భౌగోళిక వనరులు, సహజ సంపద. పర్యావరణ సమస్యలు, శిలలు, రుతుపవనాలు, ప్రపంచ పవనాలు, చక్రవాతాలు, భూకంపాలు, సునామీలు.  మన దేశ పరిస్థితుల నేపథ్యంలో నగరీకరణ; ఆదివాసులు; రుతుపవనాలు; నదులు; జలాల పంపిణీ; వివాదాల మీద ఎక్కువ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.

కరెంట్​ అఫైర్స్​తో అనుసంధానం

ప్రస్తుత సమయంలో అభ్యర్థులు సమకాలీన అంశాలపై అవగాహనకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలి. అదేవిధంగా సిలబస్‌‌‌‌లో పేర్కొన్న కోర్‌‌‌‌ టాపిక్స్‌‌‌‌ను కరెంట్‌‌‌‌ అఫైర్స్‌‌‌‌తో అనుసంధానం చేసుకుంటూ చదవాలి. ప్రిలిమ్స్‌‌‌‌లో ప్రశ్నలు కరెంట్‌‌‌‌ అఫైర్స్‌‌‌‌ సమ్మిళితంగా ఉంటున్నాయి. కాబట్టి ఏడాదిన్నర కాలంలోని ముఖ్యమైన కరెంట్‌‌‌‌ ఈవెంట్స్‌‌‌‌పై దృష్టి పెట్టాలి. వాటిని సంబంధిత సబ్జెక్ట్‌‌‌‌ అంశాలతో అనుసంధానం చేసుకుంటూ చదవాలి. సంఘటన నేపథ్యం, ప్రభావం, ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్​ అంచనా వంటి కోణాల్లో విశ్లేషించుకోవాలి. ఈ సమయాన్ని తమకు క్లిష్టంగా భావించే ఇతర అంశాలపై దృష్టి పెట్టేందుకు వినియోగించొచ్చు.

జనార్ధన్​ దండు, ఎస్​ఆర్​ శంకరన్​ ఐఏఎస్​ అకాడమీ హైదరాబాద్​