ప్రతి గింజకూ మద్దతు ధర.. వడ్ల కొనుగోలుకు 7,149 కేంద్రాలు ఏర్పాటు చేసినం: మంత్రి ఉత్తమ్

ప్రతి గింజకూ మద్దతు ధర.. వడ్ల కొనుగోలుకు 7,149 కేంద్రాలు ఏర్పాటు చేసినం: మంత్రి ఉత్తమ్
  • ఇప్పటి వరకు 2,69,999 టన్నుల ధాన్యం కొన్నం.. 
  • తరుగు విషయంలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు

హైదరాబాద్, వెలుగు: ప్రతి గింజను కూడా మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని సివిల్  సప్లయ్​ శాఖ  మంత్రి ఉత్తమ్  కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు లో ప్రతి రైతుకి న్యాయం చేస్తామన్నారు. సోమవారం గాంధీ భవన్ లో ఎమ్మెల్యే మందుల సామేలు, పార్టీ నేతలు సామ రామ్మోహన్ రెడ్డి, బొల్లు కిషన్​తో కలిసి మీడియాతో ఉత్తమ్ మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఇప్పటికే అందుబాటులో ఉంచామని, కొన్ని చోట్ల ట్రేడర్లు కనీస మద్దతు ధర కన్నా ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. 

కొనుగోలు కేంద్రాల నుంచి రైస్  మిల్లులకు వెంటనే ధాన్యం రవాణా చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. రైతులకు ధాన్యం డబ్బులు సకాలంలో చెల్లించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. రైతులు ఒక్క గింజను కూడా ఎంఎస్పీ కన్నా తక్కువకు అమ్ముకోవద్దని మంత్రి సూచించారు. ‘‘నిరుడు ఏప్రిల్ లో గత బీఆర్ఎస్  ప్రభుత్వం వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తే.. ఈ ఏడాది మార్చ్ 23నే మేము స్టార్ట్  చేసినం. గత ఏడాది 7,031 కేంద్రాలు ఉంటే ఈసారి 7,149 కేంద్రాలు ఏర్పాటు చేసినం. ఇప్పటికే 6,919 కేంద్రాలు ప్రారంభించినం. 

గత ఏడాది ఈ సమయానికి 335 ధాన్యం కేంద్రాలు మాత్రమే ప్రారంభించారు. ఆదివారం వరకు రాష్ర్టవ్యాప్తంగా 2,69,699 మెట్రిక్  టన్నుల వడ్లు కొనుగోలు  చేసినం. సిద్దిపేటలో నిరుడు ఈ సమయానికి ఒక్క ధాన్యం కొనుగోలు కేంద్రం కూడా ప్రారంభించలేదు. సోమవారం సిద్దిపేటలో 418 కేంద్రాలు మేము ప్రారంభించినం” అని ఉత్తమ్  పేర్కొన్నారు. గత బీఆర్ఎస్  ప్రభుత్వం ఎక్కువ నిల్వ ఉన్న యాసంగి ధాన్యం కొనుగోలు చేసిందని, ధాన్యం ఖరాబ్  అవుతుందని ఎక్కువగా ఉన్న ధాన్యం క్వింటాకు రూ.1,702కు గత ప్రభుత్వం కొన్నదని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత కమిటీ వేసి అదే ధాన్యాన్ని రూ.2,022 కు టెండర్లు పిలిచి అమ్మామన్నారు. 

గత ప్రభుత్వ హయాంలో సన్న బియ్యం, దొడ్డు బియ్యానికి తేడా లేకుండా వేలంలో అమ్మివేశారని ఆయన విమర్శించారు. ఈసారి ధాన్యం వేలం వేయడం ద్వారా రూ.1,110.05 కోట్లు అదనంగా వచ్చాయని మంత్రి తెలిపారు. ధాన్యం కొనుగోలు పారదర్శకంగా జరుగుతుందన్నారు. ఇంకా ఎన్ని కొనుగోలు కేంద్రాలు అవసరమో అందుకు అనుగుణంగా కేంద్రాలు తెరవాలని అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని మంత్రి వెల్లడించారు. 

రాహుల్ ప్రధాని అవుతరు

లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలిచి అధికారంలోకి వస్తుందని, రాహుల్  గాంధీ ప్రధాన మంత్రి అవుతారని మంత్రి ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు. జూన్  9న ప్రధానిగా రాహుల్  ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన అన్నారు.

వాళ్ల ఆరోపణలు తప్పు

ధాన్యం కొనుగోళ్లు, రేషన్ సరఫరాలో తమ ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తున్నదని మంత్రి ఉత్తమ్  చెప్పారు. ఈ విషయంలో బీఆర్ఎస్, బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. కిషన్ రెడ్డి ఏదో దీక్ష చేశారని ఎద్దేవా చేశారు. గత బీఆర్ఎస్  ప్రభుత్వం సివిల్ సప్లై శాఖ పేరిట రూ.58 వేల కోట్ల అప్పు చేసిందని మంత్రి చెప్పారు. బీఆర్ఎస్  హయాంలో ప్రతి జిల్లాలో రేషన్  మాఫియా ఏర్పడి దందా చేసిందని, ఈ మాఫియాను నియంత్రించామని పేర్కొన్నారు. తరుగు విషయంలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులను ఆయన హెచ్చరించారు.