వడ్ల కమీషన్​ వచ్చింది .. 2022-23 సీజన్లకు..​రూ.9.77 కోట్లు విడుదల

వడ్ల కమీషన్​ వచ్చింది .. 2022-23 సీజన్లకు..​రూ.9.77 కోట్లు విడుదల
  • ఆరింటికి రిలీజ్​చేసిన జిల్లా సహకారశాఖ 
  • మిగతా 15 పీఏసీఎస్​లకు ఇంకా రాలే 

యాదాద్రి, వెలుగు : ఎట్టకేలకు పీఏసీఎస్​లకు వడ్ల కమీషన్ ​వచ్చింది. 2022-–23 నుంచి ఐదు సీజన్లకు సంబంధించిన కమీషన్​రావాల్సి ఉండగా, రెండు సీజన్లకు సంబంధించిన కమీషన్​ను సివిల్​సప్లయ్​డిపార్ట్​మెంట్​రిలీజ్​చేసింది. అయితే వచ్చిన వడ్ల కమీషన్​ను కొన్నింటికి తప్ప అన్ని పీఏసీఎస్​లకు జిల్లా సహకార శాఖ పంపిణీ చేయలేదు. యాదాద్రి జిల్లాలో 21 పీఏసీఎస్​ఉన్నాయి.

వీటి పరిధిలో ప్రతి యాసంగి, ఖరీఫ్​ సీజన్​లో సుమారు 250 వరకు సెంటర్లు ఏర్పాటు చేసి వడ్లను కొనుగోలు చేస్తున్నాయి. దీనికి క్వింటాల్​కు రూ.32 చొప్పున సివిల్​సప్లయ్​డిపార్ట్​మెంట్​కమీషన్​గా చెల్లించాల్సి ఉంటుంది. అయితే 2022–-23, 2023–-24 ఆర్థిక సంవత్సరాల్లోని యాసంగి, వానాకాలం సీజన్లలో కొనుగోలు చేసిన వడ్లకు సంబంధించిన కమీషన్​పీఏసీఎస్​లకు రాలేదు.ఈ కమీషన్​చెల్లింపుల గురించి గత ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. 

రూ. 9.77 కోట్లు విడుదల..

కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల కోడ్​ముగియగానే పీఏసీఎస్​లకు చెల్లించాల్సిన కమీషన్​ను విడుదల చేయడానికి సివిల్​సప్లయ్ ​డిపార్ట్​మెంట్​చర్యలు తీసుకుంది. 2022–-23 ఆర్థిక సంవత్సరంలోని యాసంగి సీజన్​కు సంబంధించి రూ.5,69,84,782, వానాకాలం సీజన్​కు సంబంధించిన రూ.4,07,90,145 కమీషన్ రావాల్సి ఉంది. ఈ రెండు సీజన్ల​కు సంబంధించిన రూ.9,77,74,927ను గత నెలలో విడుదల చేసింది. 

కొన్ని పీఏసీఎలకే రిలీజ్..​

జిల్లాలో 21 పీఏసీఎస్​లు ఉన్నాయి. వచ్చిన రెండు సీజన్ల కమీషన్​డబ్బులను వీటన్నింటికీ జిల్లా సహకారశాఖ రిలీజ్​చేయాల్సి ఉంది. అయితే కేవలం జిల్లాలోని అడ్డగూడూరు, భువనగిరి, మోత్కూరు, తుర్కపల్లి, పోచంపల్లి, బీబీనగర్​పీఏసీఎస్​లకు మాత్రమే గత నెలలో రిలీజ్​చేసిందని తెలిసింది. మిగతా 15 పీఏసీఎస్​లకు ఇంకా రిలీజ్​చేయలేదు. 

రేపు.. మాపు అంటున్నరు-.. 

నాలుగు సీజన్ల నుంచి వడ్ల కొనుగోలుకు సంబంధించిన కమీషన్ డబ్బులు రాలేదు. ఎప్పుడు అడిగినా రేపు, మాపు అంటూ కాలయాపన చేస్తున్నారు. నాలుగు సీజన్లు కలుపుకొని యాదగిరిగుట్ట పీఏసీఎస్ కు దాదాపు రూ.1.20 కోట్ల కమీషన్ డబ్బులు రావాల్సి ఉంది.

ఇమ్మడి రాంరెడ్డి, పీఏసీఎస్​ చైర్మన్, యాదగిరిగుట్ట