ఐదేండ్ల నుంచి తీసుకున్న వడ్లు.. ఇచ్చిన సీఎంఆర్ లెక్కలు చెప్పండి

ఐదేండ్ల  నుంచి తీసుకున్న వడ్లు.. ఇచ్చిన సీఎంఆర్ లెక్కలు చెప్పండి
  • ..తీసుకున్న వడ్లు.. ఇచ్చిన సీఎంఆర్​
  • ఎప్పుడు ఎక్కడెక్కడికీ.. ఏసీకేల వారీగా లెక్కలు చెప్పాలన్న సివిల్ సప్లై శాఖ
  • ఎఫ్​ఆర్​కే డిటైల్స్​, గన్నీ బ్యాగుల లెక్కలు కూడా
  • అక్టోబర్​ 10 డెడ్​లైన్..  మిల్లర్లకు సివిల్​ సప్లయ్​ ఆర్డర్స్​

యాదాద్రి, వెలుగు: ఐదేండ్ల నుంచి ఇప్పటివరకూ తీసుకున్న వడ్లు, ఇచ్చిన బియ్యం, పెండింగ్ ​డిటేల్స్ చెప్పాలని మిల్లర్లకు సివిల్​సప్లయ్ శాఖ  ​డెడ్​లైన్ విధించింది. వడ్ల కొనుగోలు.. సీఎంఆర్​ విషయంలో కొందరు మిల్లర్లు తరచూ సివిల్​ సప్లయ్​ డిపార్ట్​మెంట్​ను తరచూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వడ్ల కొనుగోలుపై ఎంత సహకరించినా.. గన్నీలు సరిగా లేవని, వడ్లు మంచిగా లేవంటూ కొర్రీలు పెడుతుంటారు. సీఎంఆర్​ విషయంలో వాయిదాలు పెడుతూనే ఉన్నారు.  దీంతో లెక్కల విషయంలో సివిల్​ సప్లయ్​ డిపార్ట్​మెంట్​కు స్పష్టత లేకుండా పోతోంది. అందుకే పూర్తి స్థాయిలో లెక్కలు వెల్లడించాలని మిల్లర్లను కోరింది. 

ఐదేండ్లు.. 11 సీజన్లు

2019-–20 యాసంగి సీజన్​ నుంచి 2024-–25 యాసంగి సీజన్​ వరకూ పూర్తి స్థాయిలో లెక్కలు వెల్లడించాలని మిల్లర్లను సివిల్​ సప్లయ్​ డిపార్ట్​మెంట్ కోరింది. ఈ లెక్కన మొత్తంగా 11 సీజన్లకు సంబంధించిన లెక్కలను మిల్లర్లు వెల్లడించాల్సి ఉంది.  ప్రతీ సీజన్​లో తీసుకున్న వడ్లు, అప్పగించాల్సిన సీఎంఆర్​తో పాటు ఎఫ్​సీఐకి అందించిన బియ్యం లెక్కలు చెప్పాల్సి ఉంటుంది. ఫోర్టిఫైడ్ రైస్  అందించిన బియ్యంతో పాటు లేకుండా అందించిన లెక్కలు విధిగా వెల్లడించాల్సిందే. ఏసీకే (29 టన్నులు) నెంబర్ల వారీగా మిల్లు నుంచి ఏ గోదాముకు ఎప్పుడు పంపించారో పేర్కొనాల్సి ఉంటుంది.

 పెండింగ్​ ఉన్న సీఎంఆర్​ లెక్కలను కూడా చెప్పాల్సి ఉంటుంది. అదే విధంగా సివిల్​ సప్లయ్​ అందించిన ఎఫ్​ఆర్​కే ఎంత స్టాక్​ ఉందో కూడా లెక్కలు చెప్పాలి. వీటితో పాటు ప్రతీ సీజన్​ కొనుగోలు సమయంలో మిల్లర్లకు లక్షల సంఖ్యలో గన్నీ బ్యాగులను అందించాల్సి ఉంటుంది. ప్రతి సీజన్​లో కొత్త వాటిని కొనుగోలు చేయడం జరుగుతూ ఉంటోంది. అయితే పాత గన్నీ బ్యాగులు ఉన్నయా..?లేవా..? అన్న లెక్కలు సరిగా లేవంటున్నారు. ఇప్పుడు వీటి లెక్కలను కూడా మిల్లర్లను డిపార్ట్​మెంట్​  అడుగుతోంది. 

వచ్చే నెల 10లోగా

జిల్లాలోని 52 మంది మిల్లర్లు తాము తీసుకున్న వడ్లు, ఇవ్వాల్సిన సీఎంఆర్​ లెక్కలను సీజన్ల వారీగా అక్టోబర్​ 10లోగా వెల్లడించాలని డిపార్ట్​మెంట్​ డెడ్​లైన్​ విధించింది. 11 సీజన్లకు సంబంధించిన లెక్కలు కొందరు మిల్లర్ల వద్ద రెడీగా ఉన్నప్పటికీ..మరిరొందరి వద్ద లెక్కలు సరిగా లేవని అంటున్నారు. దీంతో జిల్లాలో రెండు మిల్లులు డిఫాల్టర్లుగా ఉన్నాయి. ఒక మిల్లుపై ఇప్పటికే రెవెన్యూ రికవరి (ఆర్​ఆర్​) యాక్ట్​ పెట్టారు. ఆ మిల్లు ఓనర్​ చనిపోయాడు. బంధువుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. 

మరో మిల్లును సీజ్​ చేశారు. ఈ రెండు మిల్లుల వద్దే రూ. 15 కోట్లకు పైగా పెండింగ్​ ఉన్నాయి. వీటికి సంబంధించిన లెక్కలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మిల్లర్ల నుంచి లెక్కలు తీసుకోవడం వల్ల వడ్లు, బియ్యం ఇచ్చిన విషయంలో మరింత స్పష్టత వస్తుందని సివిల్​ సప్లయ్​ ఆఫీసర్లు భావిస్తున్నారు.