మిల్లర్ల తీరుపై సివిల్​ సప్లై ఆఫీర్లు సీరియస్

మిల్లర్ల తీరుపై సివిల్​ సప్లై ఆఫీర్లు సీరియస్
  • ఈనెలాఖరులోగా ఇవ్వాలని డెడ్​ లైన్
  •  గత ఖరీఫ్ లో 18 వేల మెట్రిక్  టన్నుల బకాయిలు 
  • యాసంగి బియ్యం 75,549 వేల మెట్రిక్ టన్నులు మిల్లర్ల వద్దనే..

సంగారెడ్డి, వెలుగు : సంగారెడ్డి జిల్లాలో కస్టం మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) రికవరీ సరిగా జరగడం లేదు. గతేడాది ఖరీఫ్, మొన్నటి యాసంగికి సంబంధించిన బియ్యం స్టాక్​ ఇవ్వకపోవడంతో  మిల్లర్ల తీరుపై పౌరసరఫరాల శాఖ ఆఫీసర్లు సీరియస్ గా ఉన్నారు. 2020-21, 2021-22కు సంబంధించిన బియ్యాన్ని ఈ నెలాఖరులోగా ఇవ్వాలని మిల్లర్లకు నోటీసులు జారీ చేశారు. సేకరించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చేందుకు జిల్లాలో ఉన్న 60 రైస్ మిల్లులకు అప్పగించారు. ఇందులో 15 బాయిల్డ్ రైస్ మిల్లులు, 45 రా రైస్ మిల్లులు ఉన్నాయి. 

2020-21 ఖరీఫ్ లో...

గత ఖరీఫ్ లోని 1.06 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మిల్లర్లు ప్రభుత్వానికి అప్పగించాలి. ఇందులో 88 వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వగా, ఇంకా 18 వేల మెట్రిక్ టన్నుల బకాయి ఉంది.  వీటి విలువ దాదాపు రూ.54 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. 20 రైస్ మిల్లుల నుంచి బియ్యం రావాల్సి ఉందని వెల్లడించారు.  నిర్దేశించిన సమయంలో బియ్యం ఇవ్వకుంటే మిల్లర్లపై తదుపరి చర్యలు తీసుకోవాలని సివిల్ సప్లై ఉన్నతాధికారులు ఆదేశించారు. 

యాసంగిలో...

మొన్నటి యాసంగిలో బాయిల్డ్ రైస్ సేకరణపై వివాదం నెలకొనడంతో సేకరించిన ధాన్యం మొత్తం మిల్లులోనే ఉండిపోయింది. సంగారెడ్డి జిల్లాలో 73,730 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించగా, మెదక్ జిల్లా నుంచి అదనంగా 1,819 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సంగారెడ్డికి పంపించారు. దీంతో మొత్తం 75,549 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 28 రైస్ మిల్లులకు అప్పగించారు. ఇందులో 17 బాయిల్డ్ రైస్ మిల్లులు, 11 రా రైస్ మిల్లులు ఉన్నాయి. వీటి విలువ దాదాపు రూ.148 కోట్లు ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు.

ఎఫ్ సీఐకి 7 వేల మెట్రిక్ టన్నులు

రైస్ మిల్లుల నుంచి రావాల్సిన సీఎంఆర్ లో భారత ఆహార సంస్థ (ఎఫ్ సీఐ)కు 7 వేల మెట్రిక్ టన్నులు పంపాలని జిల్లా పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఎఫ్ సీఐ గోడౌన్​లకు కొద్దికొద్దిగా ధాన్యాన్ని తరలిస్తున్నారు. మిగతా బియ్యాన్ని పౌర సరఫరాల గోడౌన్​లకు తరలిస్తారు. కాగా రెండు సీజన్​లకు సంబంధించిన సీఎంఆర్ బియ్యం బకాయిల సేకరణలో పౌరసరఫరాల శాఖ నిర్లక్ష్యం, రైస్ మిల్లర్ల అలసత్వంపై రైతు సంఘాలు మండిపడుతున్నాయి. ఎప్పటి ధాన్యాన్ని అప్పుడు సేకరించి ప్రభుత్వానికి ఇవ్వకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.