CJI BR Gavai: అదో ముగిసిన అధ్యాయం..బూటు విసిరిన ఘటనపై మౌనం వీడిన సుప్రీంకోర్టు సీజేఐ

CJI BR Gavai: అదో ముగిసిన అధ్యాయం..బూటు విసిరిన ఘటనపై మౌనం వీడిన సుప్రీంకోర్టు సీజేఐ

న్యూఢిల్లీ: కోర్టు విచారణ సందర్భంగా లాయర్ బూటు విసిరిన ఘటనపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ మౌనం విడారు. ఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత మాట్లాడిన సీజేఐ.. అదో ముగిసిన అధ్యాయం అన్నారు. అక్టోబర్ 6న 71ఏళ్ల లాయర్ రాకేష్ కిషోర్ వేదిక దగ్గరకు వచ్చి తన షూను తీసి చీఫ్ జస్టిస్ పై విసిరేందుకు ప్రయత్నించారు. ఈ వివాదంలో రాకేష్ కిషోర్ ను దోషిగా తేల్చిన సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్  అతని  సభ్యత్వాన్ని రద్దు చేసింది. రాకేష్ కిషోర్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బార్ లైసెన్స్‌ను సస్పెండ్ చేసింది.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సుప్రీం కోర్టులో సీజేఐపై దాడి ఘటనను అదేరోజు ప్రధాని మోదీ కూడా ఖండించారు. ఘటనపై తాను సీజేఐ గవాయ్‌తో మాట్లాడానని ప్రధాని తెలిపారు. ‘సుప్రీంకోర్టు ఆవరణలో సీజేఐ గవాయ్‌పై జరిగిన దాడి.. భారతీయులందర్నీ ఆగ్రహానికి గురిచేసింది. ఇలాంటి చర్యలకు మన సమాజంలో చోటులేదన్నారు. ఘటన జరిగినప్పుడు, అటు తర్వాత.. ప్రశాంతతను కాపాడుతూ సీజేఐ స్పందించిన తీరును అభినందించారు.

ఖజురహోలో విష్ణుమూర్తి విగ్రహం పునఃస్థాపనకు సంబంధించిన కేసులో సీజేఐ చేసిన వ్యాఖ్యల వల్ల ఈ దాడి ప్రయత్నం జరిగిందని భావిస్తున్నారు. ఆ కేసును కొట్టేస్తూ వెళ్లి ఆ దేవుడినే ఏదైనా చేయమని అడగండి. మీరు విష్ణు దేవుడికి పరమ భక్తుడినని చెప్తున్నారు కదా. కాబట్టి వెళ్లి ప్రార్థించండి. అది పురావస్తు శాఖ స్థలం. పురావస్తు శాఖ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది’ అని సీజేఐ వ్యాఖ్యానించారు. 

సీజేఐ మత విశ్వాసాలను దెబ్బ తీశారని సోషల్‌ మీడియాలో చాలా మంది ఆరోపించారు. అయితే ఆ తర్వాత దీనిపై సీజేఐ స్పష్టతనిస్తూ తాను అన్ని మతాలను గౌరవిస్తానని చెప్పారు. కాగా, సీజేఐపై దాడిని న్యాయవాదుల సంఘాలు, వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల నేతలు ఖండించారు.