లైంగిక దాడి జరిగితే కచ్చితంగా కేసు పెట్టాలె: సీజేఐ

లైంగిక దాడి జరిగితే కచ్చితంగా కేసు పెట్టాలె: సీజేఐ

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పిల్లలపై లైంగిక వేధింపులు పెరుగుతున్నాయని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్​ ఆందోళన వ్యక్తంచేశారు. చాలా వరకు కేసుల్లో నిందితుడు కుటుంబంలోని వ్యక్తే కావడంతో విషయం బయటికి రావడంలేదన్నారు. అలాంటప్పుడు తమ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్​పైనే ఉంటుందని చెప్పారు. ‘పోక్సో చట్టం’పై ఏర్పాటు చేసిన రెండు రోజుల కార్యక్రమానికి సీజేఐ హాజరై మాట్లాడారు. నిందితుడు ఫ్యామిలీ మెంబర్ అయినా సరే కేసు పెట్టేలా​ ప్రజలకు అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. కొన్ని సందర్భాల్లో న్యాయ వ్యవస్థ వల్ల బాధితులు మానసిక క్షోభకు గురికావడం దురదృష్టకరమన్నారు.

సేఫ్.. అన్​సేఫ్​ టచ్​పై అవగాహన కల్పించాలి

సరైన సమయంలోనే పిల్లలపై లైంగిక వేధింపులను గుర్తించాలని జస్టిస్​ డీవై చంద్రచూడ్​ అన్నారు. దాన్ని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు అవగాహన కల్పించడం ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. సేఫ్​ టచ్, అన్ సేఫ్​ టచ్ ఏదో పిల్లలు గుర్తించేలా పేరెంట్స్ చూడాలన్నారు. అన్నింటికి మించి.. కుటుంబ గౌరవం కంటే పిల్లల భద్రతకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. నిందితుడు ఫ్యామిలీ మెంబర్ అయినప్పుడు చాలా మంది కేసు రిజిస్టర్​ చేయడంలేదన్నారు. ఇది మంచి పద్ధతి కాదని, భవిష్యత్తులో ఇది మరింత ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరించారు. మైనర్ల అంగీకారంతో లైంగికంగా కలిసినా సరే అది నేరమేనని తెలిపారు. దీంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేస్తారన్నారు.