పోలీస్​ స్టేషన్లలోనే మానవ హక్కులకు ముప్పు

పోలీస్​ స్టేషన్లలోనే మానవ హక్కులకు ముప్పు
  • మానవ హక్కులకు ముప్పు.. పోలీస్​ స్టేషన్లలోనే ఎక్కువ
  • కస్టడీలో హింస, ఇతర వేధింపులు ఇంకా ఉన్నయ్: సీజేఐ ఎన్వీ రమణ
  • నల్సా మొబైల్ యాప్‌ ప్రారంభం

న్యూఢిల్లీ: కస్టడీలో హింస, ఇతర పోలీసు వేధింపులు దేశంలో ఇంకా ఉన్నాయని సీజేఐ ఎన్వీ రమణ అన్నారు. దేశవ్యాప్తంగా పోలీసు ఆఫీసర్ల సెన్సిటైజేషన్‌ను చేపట్టాలని నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా)కి సూచించారు. ‘యాక్సెస్ టు జస్టిస్’ ప్రాజెక్టు ఓ ముగింపులేని మిషన్ అని అన్నారు. రూల్ ఆఫ్ లా ద్వారా పాలన సాగుతున్న సమాజంలో.. న్యాయం పొందేందుకు అట్టడుగు వర్గాలు, ప్రివిలేజ్డ్ వర్గాలకు మధ్య ఉన్న గ్యాప్‌ను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు.  ఆదివారం నల్సా మొబైల్ యాప్‌ను ఆయన ప్రారంభించారు. పేదలు, అవసరంలో ఉన్న వారికి న్యాయ సహాయం కోసం దరఖాస్తు చేసేందుకు, బాధితులు తమకు రావాల్సిన పరిహారం కోసం అప్లికేషన్ పెట్టుకునేందుకు నల్సా యాప్ హెల్ప్ చేస్తుంది. ‘‘మానవ హక్కులకు ముప్పు ఎక్కువగా ఉన్నది పోలీస్ స్టేషన్లలోనే. కస్టోడియల్ టార్చర్, అట్రాసిటీలు వంటివి ఇంకా ఉన్నాయి. రాజ్యాంగపరమైన హక్కులు ఉన్నా.. పోలీసు స్టేషన్లలో అవి అమలు కావడం లేదు. దీంతో అరెస్టయిన వ్యక్తులకు ఎంతో నష్టం జరుగుతోంది” అని సీజేఐ ఆందోళన వ్యక్తం చేశారు.

మేం వాళ్ల కోసమే ఉన్నం..
‘‘న్యాయ సహాయం పొందే హక్కు గురించి, ఉచిత న్యాయ సేవల గురించి ప్రచారం చేయాలి. ఇందుకోసం పోలీస్ స్టేషన్లు, జైళ్లలో బోర్డులు ఏర్పాటు చేయాలి” అని సీజే ఎన్వీ రమణ సూచించారు. మన దేశంలో ఉన్న సోషియో ఎకనమిక్ డైవర్సిటీ.. హక్కులు కోల్పోవడానికి కారణం కాకూడదన్నారు. ‘‘ప్రజల నమ్మకాన్ని పొందాలని న్యాయవ్యవస్థ కోరుకుంటోంది. మేం వాళ్ల కోసమే ఉన్నామనే భావన కలిగించాలి. అట్టడుగు వర్గాల వారు చాలా ఏళ్లుగా న్యాయవ్యవస్థకు అవతల బతుకుతున్నారు. గతం.. భవిష్యత్తును నిర్ణయించకూడదు. సమానత్వం తీసుకురావడానికి అందరూ కృషి చేయాలి” అని పిలుపునిచ్చారు.

రూరల్ ఏరియాల్లోనే సమస్య
కనెక్టివిటీ లేకనే రూరల్, రిమోట్ ఏరియాల్లోనే న్యాయ సాయం ఎక్కువగా అందట్లేదని జస్టిస్ ఎన్వీరమణ అన్నారు. దీనిపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశానని సీజేఐ చెప్పారు. ఫ్రీ లీగల్ సర్వీస్ గురించి అవగాహన కల్పించేందుకు పోస్టల్ నెట్ వర్క్‌ను ఉపయోగించుకోవాలని సర్కారుకు సూచించారు.