ఆధ్యాత్మికం: పుణ్యం అంటే ఏమిటి.. దానిని ఎలా పొందాలి..

ఆధ్యాత్మికం: పుణ్యం అంటే ఏమిటి.. దానిని  ఎలా పొందాలి..

కరుణ, దయ మన జీవితాన్ని ఏ మార్గంలో నడిపిస్తాయి? అవి ఎలాంటి పాత్ర పోషిస్తాయి? మన ప్రేమను ప్రేరేపించడంలో ఉనికిని ప్రశ్నిస్తూ.. ఎలా మన సంతోషానికి కారణమవుతాయి? దీని గురించి ప్రముఖ అధ్యాత్మిక గురువు గౌర్ గోపాల్ దాస్ అద్భుతంగా వివరించారు. ఇప్పుడు దానిని తెలుసుకుందాం. . . .

ఆ రోజు చాలా చల్లగా ఉంది. అమెరికాలోని న్యూయార్క్ లో  ఒక చిన్న అబ్బాయి... వయసు పదేళ్లు ఉంటాయి. కాళ్లకు చెప్పులు లేవు. దుమ్ము కొట్టుకుపోయిన పాదాలతో నడుచుకుంటూ వెళ్లి.. చెప్పుల షాపు ముందు నిలుచున్నాడు. ఆ పిలగాడు చలికి గజగజ వణుకుతున్నాడు.. రెప్ప కూడా వేయకుండా అతని కళ్లు ఆ షాపువైపే చూస్తున్నాయి.

డిస్ ప్లే విండోలో కనపడుతున్న రకరకాల షూస్ ను  స్కానింగ్ చేస్తున్నాడు. ఇదంతా గమనించిన ఒక యువతి ఆ అబ్బాయి దగ్గరికి వచ్చింది. 'చాలా చల్లగా ఉంది. నువ్వు వణికిపోతున్నావు. కానీ, నువ్వు ఆ కిటికీ వైపే చూస్తూ... దేని గురించో లోతుగా ఆలోచిస్తున్నావు....  దేని గురించి ఆలోచిస్తున్నావు బాబు?' అని అడిగింది. "నాకొక జత షూ ఇవ్వగలడేమోనని..ఆ దేవుడ్ని అడుగుతున్నాను" అన్నాడు దీనంగా.

 వెంటనే ఆ యువతి ఆ పిల్లాడి చేయి పట్టుకుని, స్టోర్ లోకి నడిచింది. ఈ అబ్బాయి కాలి సైజుకి... అరడజన్ సాక్సులు ఇవ్వండి' అని స్టోర్ మేనేజర్ ను  అడిగింది. తర్వాత 'ఒక బేసిన్ నీళ్లు తీసుకొస్తారా ప్లీజ్' అని స్టోర్ మేనేజర్ ను  రిక్వెస్ట్ చేసింది. వేగంగా లోపలికెళ్లి ఒక బేసిన్  లో నీళ్లు తీసుకొచ్చి ఆమెకిచ్చాడు. ఆమె మోకాళ్లపై కూర్చుంది. తన చేతికున్న గ్లోవ్స్ తీసింది. 

ALSO READ : జ్యోతిష్యం: అప్పుల బాధలు.. ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయా.. పరిష్కార మార్గాలు ఇవే !

తర్వాత ఆ పిలగాడి పాదాల్ని నీళ్లతో శుభ్రంగా కడిగింది. తన దగ్గరున్న టవల్ తో తడి లేకుండా కాళ్లను తుడిచింది. ప్యాకెట్ నుంచి ఒక జత సాక్సులు తీసి అతని పాదాలకు తొడిగింది. ఒక జత షూ కూడా కొన్నది. మిగిలిన ఐదు జతల సాక్స్ లు కూడా అతనికిచ్చేసింది. వాళ్లు స్టోర్ నుంచి బయటికెళ్లాక... ఇప్పుడు నువ్వు కంఫర్ట్ గా నడుస్తావు బాబు' అని నవ్వుతూ బై చెప్తూ వెనక్కి తిరిగింది. 

నాలుగు అడుగులు వేసిందో లేదో.. వెంటనే ఆ పిలగాడు వచ్చి ఆమె చేతులు పట్టుకున్నాడు. ఆమె ముఖాన్ని చూశాడు. అతని కళ్లలోంచి కృతజ్ఞతతో కూడిన కన్నీళ్లు కారుతున్నాయి. 'నువ్వు దేవుడి భార్యవా?" అని అమాయకంగా అడిగాడు.దీన్నే సానుభూతి అంటారు. ఇదే సున్నితత్వం.. ఇదే ప్రేమ కూడా. ఇవన్నీ దయ, కరుణ చూపించడం వల్ల పుట్టే చర్యలు. 

ఇవే నిజమైన ఆధ్యాత్మికతకు పునాదిరాళ్లు. ఇవే మన విశ్వాసాన్ని మళ్లీ మళ్లీ నిలబెడతాయి. మానవత్వం చూపించడమే పుణ్యం. ఇవే ఈ ప్రపంచంలో సకల బాధలనుంచి విముక్తి కలిగిస్తాయి. ఏ పని చేయడానికైనా ఇవే ప్రేరణ అందిస్తాయి. ఇలా జీవించినప్పుడు... దేవుడు అంటే ఎవరో తెలియని వాళ్లకు కూడా నీవెవరో తెలుస్తుంది!"