కోర్టులో కాల్పుల ఘటనపై CJI ఎన్వీ రమణ సీరియస్

కోర్టులో కాల్పుల ఘటనపై  CJI ఎన్వీ రమణ  సీరియస్

ఢిల్లీలోని రోహిణి కోర్టు దగ్గర నిన్న జరిగిన కాల్పుల ఘటనను సీరియస్ గా తీసుకున్నారు భారత ప్రధాన న్యాయమూర్తి NV రమణ. స్పాట్ ను పరిశీలించాలనుకున్నప్పటికీ... సెక్యూరిటీ కారణాలతో ఆగిపోయారు. ఈ విషయంలో ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ తో మాట్లాడారు రమణ. జార్ఖండ్ లో జడ్జ్ హత్యపై విచారణ జరుగుతుండగానే... నిన్న రోహిణి కోర్టులో ఇలాంటి ఘటన జరగడాన్ని తీవ్రంగా పరిగణించారు చీఫ్ జస్టిస్ రమణ. జడ్జీల భద్రత, కోర్టుల్లో సెక్యూరిటీపై వచ్చేవారమే విచారణ జరపాలని సుప్రీంకోర్టు భావిస్తోంది. 

మరోవైపు రోహిణీ కోర్టు షూటౌట్ కు సంబంధించి కలగజేసుకోవాలని పిటిషన్ దాఖలు చేశారు లాయర్ విశాల్ తివారీ. రోహిణి కోర్టు తరహా ఘటనలు కొత్తేమీ కాదని తెలిపారు. బిజ్నోర్, బర్వానీ, అమృత్ సర్, హిసార్ సహా అనేక ప్రాంతాల్లోని కోర్టుల్లో కాల్పులు జరిగాయన్నారు. ఇలాంటి ఘటనలతో... జడ్జీలు, లాయర్లకు మాత్రమే కాకుండా న్యాయం కోసం కోర్టుకు వచ్చేవారికి కూడా ప్రమాదం ఉందన్నారు. అందుకే కరుడుగట్టిన నేరస్థులను కోర్టులకు తీసుకురాకుండా... వర్చువల్ గా విచారించాలని పిటిషన్ లో కోరారు విశాల్ తివారీ. కిందిస్థాయి కోర్టుల్లో సీసీటీవీలు ఏర్పాటు చేయాలన్నారు. మరోవైపు ఢిల్లీలోని డిస్ట్రిక్ట్ కోర్టుల్లో సేఫ్టీ, సెక్యూరిటీ పెంచేలా ఆర్డర్స్ ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టులోనూ ఓ పిటిషన్ దాఖలైంది.    

ఇక నిన్నటి కాల్పుల ఘటనతో అలర్ట్ అయిన ఢిల్లీ పోలీసులు... రోహిణీ కోర్ట్ దగ్గర సెక్యూరిటీ టైట్ చేశారు. భారీగా బలగాలను మోహరించారు. మరోవైపు నిన్నటి గ్యాంగ్ స్టర్ జితేందర్ మన్ గోగీ హత్య నేపథ్యంలో... జైళ్లలో గ్యాంగ్ వార్ జరగొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే తిహార్, మండోలీ, రోహిణీ జైళ్లలో హైఅలర్ట్ ప్రకటించారు. ఇంకోవైపు ఢిల్లీ బార్ కౌన్సిల్ చైర్మన్ రాకేశ్ షెరావత్ కొందరు అధికారులతో కలసి ఢిల్లీ పోలీస్ కమిషనర్ తో సమావేశమయ్యారు. నిన్నటి ఇష్యూపై చర్చించారు.