భారత 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యు.యు.లలిత్.. !

భారత 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యు.యు.లలిత్.. !

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్ గా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ నియమితులు కానున్నారు. ఆయన పేరును ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సిఫార్సు చేశారు. ఈ మేరకు గురువారం కేంద్ర న్యాయ శాఖకు లెటర్ రాశారు. లేఖ కాపీని జస్టిస్ రమణ స్వయంగా జస్టిస్ లలిత్ కు అందజేశారు. సీజేఐ పంపిన లేఖను న్యాయ శాఖ.. ప్రధానికి పంపించనుంది. ప్రధాని దాన్ని పరిశీలించి రాష్ట్రపతికి పంపిస్తారు. చివరగా రాష్ట్రపతి ఆమోదంతో సీజేఐ నియామకం జరుగుతుంది. 49వ సీజేఐగా జస్టిస్ లలిత్ ఈ నెల 27న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఆయన 3 నెలల కంటే తక్కువ కాలమే ఆ పదవిలో కొనసాగనున్నారు. నవంబర్ 8న రిటైర్ కానున్నారు. డైరెక్టు సుప్రీంకోర్టు జడ్జి అయి సీజేఐగా పదవి చేపట్టనున్న రెండో వ్యక్తి జస్టిస్ లలిత్. ఇంతకుముందు ఇలా జస్టిస్ ఎస్ఎం సిక్రి సీజేఐ అయ్యారు. ఆయన 1971 నుంచి 1973 వరకు సీజేఐగా పని చేశారు. కాగా, జస్టిస్ రమణ.. ఈ నెల 26న రిటైర్ కానున్నారు. ఆయన 16 నెలలకు పైగా పదవిలో ఉన్నారు. తదుపరి సీజేఐ పేరును సిఫార్సు చేయాలని న్యాయ శాఖ కోరగా.. తన తర్వాత అత్యంత సీనియర్ అయిన జస్టిస్ యూయూ లలిత్ పేరును జస్టిస్ రమణ సిఫార్సు చేశారు. 

కీలక కేసుల్లో తీర్పు.. 

జడ్జిగా కీలక కేసుల్లో జస్టిస్ యూయూ లలిత్ తీర్పు ఇచ్చారు. ట్రిపుల్ తలాక్ చెల్లదంటూ తీర్పు ఇచ్చిన ఐదుగురు జడ్జీల బెంచ్​లో లలిత్ ఒకరు. కేరళలోని పద్మనాభస్వామి ఆలయ నిర్వహణ హక్కు అప్పటి రాజకుటుంబానికి ఉంటుందని జస్టిస్ లలిత్ నేతృత్వంలోని బెంచ్ తీర్పు ఇచ్చింది. పిల్లల ప్రైవేట్ పార్టులను తాకడం,  లైంగిక ఉద్దేశంతో వాళ్లను టచ్ చేయడం.. పోక్సో చట్టం కిందికే వస్తుందని జస్టిస్ లలిత్ నేతృత్వంలోని బెంచ్ తీర్పు చెప్పింది.

ఇదీ ప్రస్థానం.. 

1957 నవంబర్ 9న మహారాష్ట్రలో జన్మించిన జస్టిస్ లలిత్.. 1983 జూన్ లో అడ్వొకేట్ గా ఎన్ రోల్ అయ్యారు. 1985 డిసెంబర్ వరకు బాంబే హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. ఆ తర్వాత ఢిల్లీకి షిఫ్ట్ అయ్యారు. 2004 ఏప్రిల్ లో సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ గా నియమితులయ్యారు. 2జీ కుంభకోణం కేసులో సీబీఐ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా వాదించారు. 2014 ఆగస్టు 13న సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. పోయినేడు జూన్ లో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. కాగా, జస్టిస్ లలిత్ తండ్రి యూఆర్ లలిత్ కూడా లాయర్. ఆ తర్వాత ఆయన ఢిల్లీ హైకోర్టు జడ్జిగానూ పని చేశారు.