బోగ శ్రావణి రాజీనామా ఆమోదంపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం 

బోగ శ్రావణి రాజీనామా ఆమోదంపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం 

జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ బోగ శ్రావణి రాజీనామా ఆమోదంపై ఇవాళ స్పష్టత రానుంది. ఈనెల 25వ తేదీన మున్సిపల్ చైర్ పర్సన్ పదవికి బోగ శ్రావణి రాజీనామా చేసి, జిల్లా కలెక్టర్ రవికి తన రాజీనామా పత్రాన్ని అందించిన విషయం తెలిసిందే. అయితే.. బోగ శ్రావణి రాజీనామాపై జిల్లా కలెక్టర్ రవి ఇవాళ తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి రాజీనామాపై క్లారిటీ కోసం బోగ శ్రావణిని జిల్లా కలెక్టరేట్ కు పిలిపించారు అధికారులు. 

జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ పదవిని బడా కాంట్రాక్టర్లకు ఇస్తారా..? లేక తెలంగాణ ఉద్యమకారులకు ఇస్తారో వేచి చూడాలని బోగ శ్రావణి చెప్పారు. తాను మున్సిపల్ చైర్ పర్సన్ పదవికే రాజీనామా చేశానని, బీఆర్ఎస్ పార్టీకి మాత్రం కాదని స్పష్టం చేశారు. మరోవైపు.. బోగ శ్రావణి రాజీనామా ఆమోదంపై మరికొన్ని గంటల్లో క్లారిటీ రానుంది. జిల్లా కలెక్టర్ రవి.. శ్రావణి రాజీనామాను ఆమోదిస్తారా..? లేక పెండింగ్ లో పెడుతారా..? అనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 

జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వేధింపులు తట్టుకోలేక పదవికి రాజీనామా చేస్తున్నానంటూ బోగ శ్రావణి రిజైన్ చేసిన విషయం తెలిసిందే. పేరుకే తాను మున్సిపల్ చైర్ పర్సన్ అని, పెత్తనమంతా ఎమ్మెల్యే సంజయ్ నే చలాయించేవారని శ్రావణి ఆరోపించారు. పార్టీ కోసం పని చేస్తున్నా కక్షగట్టి ఇబ్బందులకు గురి చేశారని వ్యాఖ్యానించారు.