కాంగ్రెస్​తో లెఫ్ట్ పొత్తులపై ఇయ్యాల క్లారిటీ

కాంగ్రెస్​తో లెఫ్ట్ పొత్తులపై  ఇయ్యాల క్లారిటీ
  • సీట్ల కేటాయింపుపై సీపీఎం, సీపీఐ నేతల్లో అసంతృప్తి
  • నేడు పార్టీ నేతలతో చర్చించనున్న బీవీ రాఘవులు, డి.రాజా

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల పొత్తులపై మంగళవారం స్పష్టత వచ్చే అవకాశముంది. సీపీఐ, సీపీఎంకు కాంగ్రెస్ ప్రతిపాదించిన సీట్లపై ఆ పార్టీలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో పొత్తులు ఉంటాయా? లేదా? అనే అయోమయం కార్యకర్తల్లో నెలకొన్నది. అయితే, సీపీఎంకు ఇచ్చే సీట్లపై మంగళవారం వరకు తేల్చాలని ఆ పార్టీ ఆల్టిమేటం ఇచ్చిన నేపథ్యంలో పొత్తులపై సందిగ్ధం నెలకొన్నది. గతంలో సీపీఐకి కొత్తగూడెం, చెన్నూరు సీట్లు, సీపీఎంకు మిర్యాలగూడ, వైరా ఇస్తామని కాంగ్రెస్ నేతలు ప్రతిపాదించారు. ఈ సీట్లపై భిన్నాభిప్రాయాలు ఉన్నా, లెఫ్ట్ పార్టీలు పొత్తుకు అంగీకరించాయి. కానీ, తాజాగా సీపీఎంకు వైరా, సీపీఐకి చెన్నూరు టికెట్లు ఇవ్వలేమని, హైదరాబాద్​ లో తీసుకోవాలని కొత్త ప్రతిపాదనలు తెచ్చారు. దీనిపై సీపీఎం నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రెండ్రోజుల్లో సీట్లపై స్పష్టత ఇవ్వాలని ఆ పార్టీ స్టేట్ సెక్రటరీ తమ్మినేని వీరభద్రం కాంగ్రెస్​కు అల్టిమేటం ఇచ్చారు. లేకపోతే తమ దారి తాము చూసుకుంటామని హెచ్చరించారు. ఈ క్రమంలోనే మంగళవారం వరకు వేచిచూడాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. మంగళవారం హైదరాబాద్​లోని ఎంబీభవన్​లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం జరగనున్నది. దీనికి సీపీఎం పొలిట్ బ్యూరో మెంబర్  బీవీ రాఘవులు అటెండ్ కానున్నారు. దీంట్లో పొత్తులపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో వచ్చిన  మెజార్టీ నిర్ణయాన్ని, బుధవారం జరిగే ఆ పార్టీ రాష్ట్ర కమిటీలో చర్చకు పెడ్తారు. మరి సీపీఎం అడిగిన సీట్లు కాంగ్రెస్​ఇస్తుందా? లేదా? అనేది మంగళవారం తేలనున్నది.

సీపీఐలోనూ అయోమయం..

సీపీఐకి మునుగోడు ఇవ్వాల్సిందేనని ఆ పార్టీ నేతలు పట్టుపడుతున్నారు. అయితే చెన్నూరు సీటు కష్టమేనని ఆ పార్టీ నేతలకు కాంగ్రెస్​ సూచించడంతో ఆ పార్టీ నేతల్లోనూ అయోమయం నెలకొన్నది. ఇదిలా ఉంటే.. అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు ఎమ్మెల్సీ సీట్లు ఇస్తామని కొత్త ప్రతిపాదనలు తెచ్చినట్టు తెలుస్తోంది. అయితే, మంగళవారం సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా హైదరాబాద్ రానున్నారు. పొత్తులపై రాష్ట్ర నేతలతో చర్చించే అవకాశముంది. బుధవారం ఆ పార్టీ రాష్ట్ర కమిటీతో పాటు స్టేట్ కౌన్సిల్ మీటింగ్​ ఉంది. అయితే, ఓ వర్గం మాత్రం కొత్తగూడెం ఒక సీటు ఇచ్చినా, కాంగ్రెస్​తో కలిసి పోవాలనే యోచనలో ఉండగా, మరోవర్గం మాత్రం లెఫ్ట్ పార్టీలు కలిసి పోటీ చేయాలని పట్టుపడుతున్నాయి.  దీంతో ఆ పార్టీ నేతల్లోనూ పొత్తులపై ఉత్కంఠ నెలకొన్నది.