మెడికల్ కాలేజీలో గ్యాంగ్ వార్.. క్లాసురూంలో కొట్టుకున్న స్టూడెంట్స్

మెడికల్ కాలేజీలో గ్యాంగ్ వార్.. క్లాసురూంలో కొట్టుకున్న స్టూడెంట్స్

నేటి బాలలే రేపటి పౌరులు. ప్రాణం విలువను తెలిపే వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు. చదువుకోవాల్సిన వయసులో చెడు అలవాట్లకు బానిసలుగా మారారు. కలిసి మెలిసి ఉండాల్సిన విద్యార్థులు విచక్షణ కోల్పోయి.. ఇంకిత జ్ఞానం లేకుండా పిడి గుద్దులతో ఒకరి పై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఓ విద్యార్థి గాయపడ్డాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. 

వివరాల్లోకి  వెళ్తే..

ఒంగోలు రిమ్స్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. క్లాసు రూములోనే తోటి విద్యార్థులపై గంజాయి బ్యాచ్ ఒకటి దాడులకు పాల్పడింది.గంజాయి సేవిస్తున్నారన్న ఫిర్యాదుతో నాలుగు నెలల క్రితం ఆరుగురు విద్యార్థులను హాస్టల్ నుంచి ప్రిన్సిపల్ బయటకు పంపించడం జరిగింది. తాజాగా సదరు విద్యార్థులు హాస్టల్‌కు తిరిగి వచ్చారు. తమపై ప్రిన్సిపల్‌కి ఫిర్యాదు చేశారని క్లాస్ రూములోనే గంజాయ్ బ్యాచ్ కొందరు విద్యార్థులపై పిడిగుద్దులు కురిపించింది. ఈ ఘటనలో యశ్వంత్ అనే విద్యార్థి తలకు తీవ్ర గాయమైంది.

కళాశాల  ప్రిన్సిపాల్ ఏడుకొండలు విద్యార్థుల ఘర్షణపై విచారణకు ఆదేశించారు.  మూడవ సంవత్సరం విద్యార్థులు గంజాయి సేవిస్తున్నారని యాజమాన్యానికి ఫిర్యాదు అందింది. దీనితో యాజమాన్యం నాలుగు నెలల క్రితం పలువురు విద్యార్థులను హాస్టల్ నుంచి బయటికి పంపించింది. అయినా కాని  ఆ విద్యార్థుల్లో ఎలాంటి మార్పు రాలేదు.

ఆపదలో ఉన్నది శత్రువైన కాపాడాలని వైద్య విద్యను అభ్యసించే విద్యార్థులకు చెప్తారు. అయితే ఈ విద్యార్థులు మాత్రం తోటి విద్యార్థులతోనే ఘర్షణకు దిగడం అత్యంత బాధాకరం.