మణిపూర్‌లో మళ్లీ హింస.. ఇళ్లకు నిప్పుపెట్టిన ఆందోళనకారులు

మణిపూర్‌లో మళ్లీ హింస.. ఇళ్లకు నిప్పుపెట్టిన ఆందోళనకారులు

ఇంఫాల్‌ : మణిపూర్‌ లో మరోసారి ఘర్షణలు చెలరేగాయి. తాజాగా ఓ స్థలం విషయంలో మెయిటీ, కుకీ తెగల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. రాజధాని ఇంఫాల్‌లోని న్యూ చెకాన్‌ ప్రాంతంలో పలు ఇళ్లకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. దాంతో వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం.. భద్రతా బలగాలను మోహరించింది. మంటలు అంటుకున్న ఇళ్లల్లో చిక్కుకున్నవారిని కాపాడేందుకు సహాయక చర్యలు ప్రారంభించింది. హింసాత్మక ఘటనలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించకుండా కర్ఫ్యూ విధించింది. ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. ఏప్రిల్ నెలలో ఆందోళనలు కొనసాగడంతో రాష్ర్టంలో భద్రతా బలగాలను మోహరింప చేశారు. 

మణిపూర్‌ లో ప్రస్తుతం చెలరేగిన అల్లర్లకు మూలం కొన్ని దశాబ్దాలుగా ఇక్కడి జాతుల మధ్య నెలకొన్న వైరమే కారణం అని అంటున్నరు. రాష్ట్రంలో మెజారిటీలుగా ఉన్న మెయిటీలకు గిరిజనుల(ఎస్టీ) హోదా కట్టబెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై గిరిజన సంస్థలు ఆందోళనలను ఉధృతం చేశాయి. అవి నిర్వహించిన సంఘీభావయాత్ర హింసాత్మక ఘటనలకు దారితీసింది. కొన్నిరోజుల పాటు రాష్ట్రంలో నిరసనలు, ఆందోళనలు కొనసాగాయి. ఆ ఘటనల్లో దాదాపు 70 మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు. ఆర్మీ, పారామిలిటరీ, పోలీసులను మోహరించి, కొద్దిరోజుల తర్వాత పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కానీ...  మళ్లీ అక్కడి వాతావరణం మొదటికొచ్చేలా కనిపిస్తోంది.

ఇంతకుముందు మణిపూర్‌ లో రెండో అతిపెద్ద పట్టణమైన చురాచాంద్‌పుర్‌ ఈ ఘర్షణలకు కేంద్ర బిందువుగా మారింది. కొద్దిరోజుల క్రితం ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ పాల్గొనాల్సిన సభావేదికను ఆ ప్రాంతంలో నిరసనకారులు దహనం చేసిన విషయం తెలిసిందే.