ఫ్రెషర్స్ డే లో స్టూడెంట్స్ ఫైట్

ఫ్రెషర్స్ డే లో స్టూడెంట్స్ ఫైట్
  • సెల్ ఫోన్ విషయంలో తలెత్తిన గొడవ 
  • ఐదుగురు హాస్టల్ విద్యార్థులపై దాడి
  • నలుగురిపై కేసు నమోదు
  • బెల్లంపల్లి పాలిటెక్నిక్ కాలేజీలో ఘటన

బెల్లంపల్లి, వెలుగు: ఫ్రెషర్స్ డేలో జరిగిన గొడవ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.  మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఘటన జరిగింది. ప్రిన్సిపాల్ దేవేందర్, వన్ టౌన్ ఎస్ఐ రమేశ్​తెలిపిన ప్రకారం.. మంగళవారం కాలేజీలో ఫ్రెషర్స్ డే సందర్భంగా మైనింగ్ కోర్సుకు చెందిన ఇద్దరు విద్యార్థుల మధ్య సెల్ ఫోన్ విషయమై గొడవ మొదలై.. రాళ్లు, కర్రలతో కొట్టుకున్నారు. దీంతో స్థానిక విద్యార్థి తన ఫ్రెండ్స్ ను రప్పించి.. కాలేజీ హాస్టల్ లో ఉండే విద్యార్థిపై దాడికి దిగారు.  

గొడవను ఆపేందుకు ప్రయత్నించిన మరో ఐదుగురు విద్యార్థులపై కూడా దాడికి దిగారు. దీంతో మిగతా విద్యార్థులు తీవ్ర భయాందోళ చెందారు. గాయపడిన విద్యార్థులను ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. బుధవారం బాధిత విద్యార్థులు పాలిటెక్నిక్ కాలేజీ ముందు నిరసన తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత విద్యార్థి జోగిందర్ ఫిర్యాదుతో నలుగురుపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.