
ప్రధాని మోడీకి చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. తాజాగా.. 2వ తరగతి విద్యార్థి రాసిన లేఖకు ప్రధాని మోడీ రిప్లై ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నిజానికి.. హీరాబెన్ మృతిపై సంతాపం వ్యక్తం చేస్తూ 2వ తరగతి విద్యార్థి ప్రధాని మోడీకి లేఖ రాశాడు. బెంగళూరుకు చెందిన చిన్నారి రాసిన లేఖను బీజేపీ నేత ఖుష్భూ సుందర్ తన ట్విట్టర్లో పోస్టు చేశారు.
ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ గతేడాది డిసెంబర్ 30న కన్నుమూశారు. అదే రోజు 2వ తరగతి చదువుతున్న ఆరుష్ శ్రీవత్స సంతాపం వ్యక్తం చేస్తూ ప్రధాని మోడీకి లేఖ రాశాడు. హీరాబెన్ మరణించారన్న వార్తను టీవీలో చూసి తాను చాలా బాధపడ్డానని చెప్పాడు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ మోడీకి లెటర్ రాశాడు. ఈ లేఖను చూసిన ప్రధాని మోడీ జనవరి 25న ఆ చిన్నారికి రిప్లై ఇచ్చారు. తన తల్లి మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.ఇలాంటివి చూసినప్పుడు తనకు ఇంకా ధైర్యం పెరుగుతుందని చెప్పారు. చిన్న పిల్లవాడి లెటర్ పై మోడీ స్పందించడం గొప్ప విషయమని నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు. మోడీ ప్రతిస్పందనను ప్రశంసిస్తున్నారు. ఖుష్భూ సుందర్ ట్విట్టర్ లో చేసిన ఈ పోస్టుకు ఒక మిలియన్ కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి.