ఉత్తరాఖండ్‎లో క్లౌడ్ బరస్ట్.. ఐదుగురు మృతి.. 11 మంది మిస్సింగ్

ఉత్తరాఖండ్‎లో క్లౌడ్ బరస్ట్.. ఐదుగురు మృతి.. 11 మంది మిస్సింగ్

డెహ్రాడూన్: క్లౌడ్ బరస్ట్ కారణంగా ఉత్తరాఖండ్‎ను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. చమోలి, రుద్రప్రయాగ్, తెహ్రి జిల్లాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. భారీ వరదలకు ఐదుగురు చనిపోయారు. పదకొండు మంది గల్లంతయ్యారు. బాగేశ్వర్ జిల్లా పౌసరి గ్రామంలో ఆకస్మిక వరదలకు ఇండ్లు నేలమట్టం అయ్యాయి. 

ఈ గ్రామంలో ఇద్దరు చనిపోయారు. ముగ్గురు గల్లంతయ్యారు. ఇద్దరి డెడ్​బాడీలను రెస్క్యూ సిబ్బంది గుర్తించింది. చమోలి జిల్లా మోపాటా గ్రామంలో ఓ ఇల్లు, పశువుల పాకపై కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పశువుల కొట్టంలో ఉన్న దాదాపు 20 పశువులు జలసమాధి అయ్యాయి.

రుద్రప్రయాగ్ జిల్లాలోని 15 గ్రామాల్లో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ఇదే జిల్లాలోని తల్జామాన్ గ్రామంలో 30 నుంచి 40 కుటుంబాలు వరదలో చిక్కుకుపోయారు. జఖోలి గ్రామంలో ఇల్లు కూలి ఓ మహిళ చనిపోయింది. చెనాగఢ్​లోనూ పలువురు స్థానికులు, నేపాలీలు చిక్కుకుపోయినట్లు రెస్క్యూ సిబ్బంది తెలిపారు.

రోడ్లను మూసేసిన అధికారులు

అలకనంద, మందాకిని నదులు డేంజర్ లెవల్​లో ప్రవహిస్తున్నాయి. రుద్రప్రయాగ్‌‌లోని హనుమాన్ ఆలయం మునిగిపోయింది. కొండచరియలు విరిగిపడటంతో 180కి పైగా రోడ్లను అధికారులు క్లోజ్ చేశారు. కేదార్ నాథ్, లారా గ్రామాన్ని కలిపే బ్రిడ్జి కొట్టుకుపోవడంతో  రాకపోకలు నిలిచిపోయాయి. రుద్రప్రయాగ్, బాగేశ్వర్, చమోలి, హరిద్వార్​తో పాటు పలు జిల్లాలోని స్కూళ్లకు సెలవు ప్రకటించారు.

యూపీలో ఉప్పొంగిన గంగా, వరుణ

యూపీలోనూ భారీ వర్షాలకు గంగా, వరుణ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వారణాసిలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఘాట్లన్నీ వరద నీటిలో మునగడంతో శవాలను మిద్దెలపైనే కాలుస్తున్నారు.

జార్ఖండ్​లో నలుగురు యువకులు మృతి

జార్ఖండ్​లో మినీ గోవాగా పిలిచే డుమ్కా జిల్లా మయూరాక్షి నదిలో స్నానానికి దిగిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. గట్టున ఫోన్లు, బట్టలు కనిపించడంతో గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. గురువారం సాయంత్రం ఈ ఘటన జరగగా.. శుక్రవారం ఉదయం డెడ్​బాడీలను వెలికితీశారు.

మాహారాష్ట్రలో నీట మునిగిన లాతూర్, నాందేడ్ 

మహారాష్ట్రలోని లాతూర్​లో వరదల కారణంగా 50కి పైగా రోడ్లు, వంతెనలను అధికారులు మూసేశారు. ఘర్ని నదిలో చిక్కుకుపోయిన ఐదుగురు కార్మికులను అధికారులు రక్షించారు. నాందేడ్ సిటీలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.