
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో వరుణుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. వరుణుడి ధాటికి గతంలో లేని విధంగా రెండు రోజుల నుంచి రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం (ఆగస్ట్ 29) చమోలి, రుద్రప్రయాగ జిల్లాల్లో క్లౌడ్ బరస్ట్ జరిగింది. క్లౌడ్ బరస్ట్ కారణంగా ఆకస్మిక వరదలు పలు గ్రామాలను ముంచెత్తాయి. భారీ వర్షాలతో ఉత్తరాఖండ్ జలవిలయంలో చిక్కుకుంది.
ఎటు చూసినా వరదలు, కొట్టుకుపోయిన గ్రామాలు, లోయలను తలపిస్తున్న రోడ్లే దర్శనమిస్తున్నాయి. వరదలు ముంచెత్తడంతో గ్రామాలు కొట్టుకుపోతున్నాయి. వరదలతో మూగ జీవాలు, జనాలు నిలువనీడ లేక విలవిలలాడుతున్నారు. చమోలి, రుద్రప్రయాగ జిల్లాల్లో జరిగిన క్లౌడ్ బరస్ట్ వల్ల అనేక కుటుంబాలు వరదల్లో చిక్కుకున్నాయి. చమోలి జిల్లా దేవల్‌లోని మోపాటా ప్రాంతంలో భార్యభర్తలు వరద ఉధృతికి కొట్టుకుపోయారు.
వారి గోశాల కూడా కూలిపోయి దాదాపు 15 నుండి 20 మూగజీవాలు జల సమాధి అయ్యాయి. రుద్రప్రయాగ జిల్లాలో ఆరుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. హనుమాన్ ఆలయం నీట మునిగింది. భారీ వర్షాలతో అలకనంద, మందాకిని నదుల సంగమంలో నీటి మట్టం ప్రమాదకరస్థాయికి చేరుకుంటుంది. వరద నీరు ఇండ్లలోకి చేరుకుంటుండటంతో అధికారులు వరద ప్రభావిత ప్రాంతంలోని ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
వరదల్లో కొందరు గల్లంతు కావడంపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన రియాక్ట్ అయ్యారు. రుద్రప్రయాగ్ జిల్లా బాసుకేదర్ తహసీల్‌లోని బడేత్ దుంగర్ టోక్, చమోలి జిల్లాలోని దేవల్ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ వల్ల కొందరు వరదలో చిక్కుకున్నట్లు తెలిసిందన్నారు.
పరిస్థితిని పరిష్కరించడానికి తక్షణ చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. స్థానిక అధికారులు యుద్ధ ప్రాతిపదికన సహాయ, రక్షణ చర్యలు చేపట్టారని తెలిపారు. సహయక చర్యలపై అధికారులతో ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతున్నానని చెప్పారు. జిల్లా కలెక్టర్‌తో సహాయక చర్యలను సమర్థవంతంగా నిర్వహించడానికి అవసరమైన సూచనలు ఇచ్చానని తెలిపారు.