న్యూఢిల్లీ: క్లౌడ్ ఫ్లేర్ శుక్రవారం మళ్లీ డౌన్ అయింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా పలు కీలక వెబ్ సైట్ల సేవలకు అంతరాయం కలిగింది. చాట్ జీపీటీ, స్పోటిఫై, కణ్వ, గ్రోవ్, జెరోధాతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు చెందిన ట్రూత్ సోషల్ ప్లాట్ ఫాంపై కూడా ప్రభావం పడింది. యూజర్లు ఆయా వెబ్ సైట్ల సేవలను యాక్సెస్ చేయలేకపోయారు. దీని ప్రభావం పలు షేర్లపైనా పడింది. ప్రీమార్కెట్ ట్రేడింగ్ లో పలు కంపెనీల షేర్లు 4.5 శాతం పడిపోయాయి.
క్లౌడ్ ఫ్లేర్ నిలిచిపోవడంతో సోషల్ మీడియా వేదికగా యూజర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ పని, వ్యాపారాలకు అంతరాయం కలిగిందని మండిపడ్డారు. త్వరగా సమస్యను పరిష్కరించాలని, మరోసారి ఇలాంటి సమస్య రాకుండా చూసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా.. తమ సర్వీసులను పునరుద్ధరించామని ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ, దేశంలోనే అతిపెద్ద స్టాక్ బ్రోకర్ సంస్థ జెరోదా ఓ ప్రకటనలో తెలిపింది. ఇక క్లౌడ్ ఫ్లేర్ సేవలకు అంతరాయం కలగడం ఇది రెండోసారి. గత నెలలోనూ టెక్నికల్ సమస్య కారణంగా దీని సేవలు స్తంభించిపోయాయి.
