కరోనాతో ప్రజలందరూ బయపడుతుంటే సీఎం అప్పులపై దృష్టి పెట్టారన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. శుక్రవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ ముందు మాట్లాడారు. రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అప్పుల సుడిగుండంలో ముంచారన్నారు. ఎఫ్ ఆర్ బిఎమ్ ను 5శాంతంకు పెంచుతూ ఆర్డినెన్స్ పై గవర్నర్ సంతకం తెచ్చారని.. బ్యాంక్ గ్యారెంటీ కోసం 90శాతం నుంచి 200 శాతానికి పెంచుతూ ఆర్డినెన్స్ తెచ్చారని తెలిపారు. 2019-20 అప్పులు 2లక్షల కోట్లకు చేరిందని, రాష్ట్రం ఏర్పాటు సమయంలో 68 వేల అప్పు మాత్రమే ఉండేదన్నారు. 2014 నుంచి 2019-20 వరకు 2లక్షలు పెంచారని… 2020-2021 వచ్చే సరికి 3లక్షల 20వేలకు పెంచారన్నారు!. ఎఫ్ ఆర్ బిఎమ్ పెంచడం వల్ల 50వేలు మళ్ళీ అప్పు తేవడానికి ఆర్డినెన్స్ తెచ్చారన్న ఆయన..2023 కల్లా 6 లక్షల కోట్ల అప్పు చేసేందుకు తెలంగాణ సర్కారు స్వీకారం చుట్టిందన్నారు. రూ. 3లక్షల కోట్లకు ఏడాదికి 40వేల కోట్లు అప్పు కట్టడానికి సరిపోతుందన్నారు.
బంగారు తెలంగాణ కాదు.. అప్పుల తెలంగాణగా మార్చారన్నారు. సంక్షేమ తెలంగాణ కాదు- సంక్షోభ తెలంగాణగా కేసీఆర్ మార్చారన్నారు. తెలంగాణలో ప్రతి వ్యక్తి పై 1లక్ష 50వేల అప్పు ఉంటుందని.. తెలంగాణ సమాజాన్ని తాకట్టు పెట్టె హక్కు కేసీఆర్ కి ఎవ్వరు ఇచ్చారన్నారు. తెలంగాణలో ఒక్కో వ్యక్తి తలసరి ఆదాయం 2లక్షల ఉందని.. జాతీయ ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం మెరుగ్గా ఉందన్నారు. తెస్తున్న అప్పుల వల్ల తెలంగాణ అభివృద్ధి కనిపించడంలేదని.. మరి నిధులన్నీ ఎక్కడ పోతున్నాయని ప్రశ్నించారు. తెస్తున్న అప్పులపై కేసీఆర్ శ్వేతపత్రం విడుదల చెయ్యాలని.. తెలంగాణ అప్పుల కూపీలో మునుగుతుందని.. యువత అంతా మేల్కోవాలన్నారు. అప్పులపై శ్వేతపత్రం విడుదల చెయ్యకపోతే .. కేంద్రానికి, ఆర్థిక సంస్థలకు మేమే ప్రజల తరపున అప్పులు ఇవ్వొద్దని చెప్తామన్నారు. తిరిగి కట్టలేని అప్పులు చేస్తే.. అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు మళ్ళీ అమెరికా పోతారని.. మరి తెలంగాణ ప్రజలు ఎటు పోవాలన్నారు భట్టి విక్రమర్క.

