రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులను తక్షణమే ఆదుకోవాలె

రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులను తక్షణమే ఆదుకోవాలె

వరద బాధితులను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుని, వారికి కావాల్సిన సహాయ, సహకారాలు అందించాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. యుద్ధ ప్రాతిపదికన వరద బాధితులకు ప్రభుత్వం పరిష్కారం చూపించాలన్నారు. నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించాలని, ఇల్లు కోల్పోయిన వారికి కొత్త ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. శాశ్వత ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ రూపొందించి కావాల్సిన నిధులు కేటాయించాలని కోరారు. లక్ష కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టును ఇరిగేషన్, ఇంజనీరింగ్ నిపుణులతో నిర్మించాల్సి ఉండేదని, 2014 నుండి తాము (కాంగ్రెస్ పార్టీ) ఇదే చెబుతున్నామని మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణలో అత్యంత ఎత్తైన ప్రాంతమైన తమ్మిడిహట్టి దగ్గర అంబేడ్కర్ పేరు మీద ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రారంభిస్తే.. దాన్ని రీ డిజైన్ పేరుతో కాళేశ్వరం అనే ప్రాజెక్టు కట్టారని, ఇప్పుడు దాని వల్ల తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పంపు చేసి కాలువల ద్వారా ఇంత వరకు చుక్క నీరందించలేదన్నారు. ఇటు పోలవరం ప్రాజెక్టు కడితే అమాయక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. 

2 లక్షల ఎకరాల భూమిని ఆంధ్రాకు కేటాయిస్తే వ్యతిరేకించాలని అనాడే చెప్పామని, తాము ఢిల్లీ వెళ్లి 7 మండలాల వల్ల ఖమ్మం జిల్లాకు జరిగే నష్టాన్ని సోనియాగాంధీకి తెలిపామని,  దాంతో బిల్లులో నుంచి 7 మండలాలను తొలగించారని మల్లు భట్టి విక్కమార్క అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రధాని మోడీ బిల్లులో లేని 7 మండలాలను ఆర్డినెన్స్ రూపంలో ఆంధ్రప్రదేశ్ కు ధారాదత్తం చేశారని ఆరోపించారు. ఈ అంశాన్ని తాము వ్యతిరేకిస్తూ శాసనసభలో తీర్మానం చేసి, కేంద్రానికి కూడా పంపామని చెప్పారు. మహారాష్ట్రలో 3 వేల ఎకరాలు ముంపునకు గురవుతుంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తీర్మానం చేయలేదని, తెలంగాణ కు సంబంధించిన 2 లక్షల ఎకరాల ముంపునకు గురవుతుంటే తాము తీర్మానం చేశామన్నారు. ఆ తీర్మానాన్ని సీఎం కేసీఆర్ ఢిల్లీకి పంపించారా..? లేదా..? అని ప్రశ్నించారు. 7 మండలాలపై 8 సంవత్సరాల్లో  అఖిలపక్షాన్ని ఎందుకు ఢిల్లీకి తీసుకుపోలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని  ప్రశ్నించారు. 

ఏపీ ప్రభుత్వం పోలవరం కాపర్ డ్యామ్ కడుతూ ఉంటే మీరు (సీఎం కేసీఆర్) ఏం చేస్తున్నారని మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ముంపునకు గురై, ఆస్తి నష్టపోయిన బాధితుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇరిగేషన్, ఇంజనీరింగ్ నిపుణులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి, ముంపునకు గురి కాకుండా ఏం చేస్తే బాగుంటుందో సమగ్ర రిపోర్టు రూపొందించాలని డిమాండ్ చేశారు. ఆ 7 మండలాలు తిరిగి తెచ్చుకోవడానికి కేసీఆర్ ఏం చేస్తారో రాష్ర్ట ప్రజలకు చెప్పాలన్నారు. శాసనసభలో చేసిన ఏకగ్రీవ తీర్మానంపై స్పష్టత ఇవ్వాలన్నారు. 7 గిరిజన మండలాలు తెలంగాణలోనే ఉంటే ఆ భూములు ఆ అడవులు రాష్ట్రానికే ఉండేవి కదా..? అని ప్రశ్నించారు.