ఎంసీడీలో గెలిపిస్తే ఢిల్లీని క్లీన్ చేస్తామని ఢిల్లీ సీఎం హామీ

ఎంసీడీలో గెలిపిస్తే ఢిల్లీని క్లీన్ చేస్తామని ఢిల్లీ సీఎం హామీ
  • ఘాజీపూర్‌‌‌‌‌‌‌‌లో డంప్‌‌‌‌యార్డ్ సందర్శన.. బీజేపీ నిరసనలు
  • ఢిల్లీని చెత్తతో నింపేసింది
  • మున్సిపల్ కార్పొరేషన్లలో బీజేపీ 2 లక్షల కోట్లు దోచుకుంది: కేజ్రీవాల్​

న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల్లో తమను గెలిపిస్తే.. ఢిల్లీని క్లీన్ చేస్తామని ఆప్ కన్వీనర్, సీఎం అర్వింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ఢిల్లీలోని 3 మున్సిపల్ కార్పొరేషన్లలో 15 ఏండ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ.. మూడు చెత్త కొండలను సృష్టించిందని, సిటీ మొత్తాన్ని చెత్తతో నింపేసిందని మండిపడ్డారు. అవినీతితో ఇన్నేండ్లలో 2 లక్షల కోట్లను దోచుకుందని ఆరోపించారు. ఢిల్లీలోని 3 పెద్ద డంప్‌‌‌‌యార్డుల్లో ఒక్కటైన ఘాజీపూర్‌‌‌‌‌‌‌‌ను గురువారం కేజ్రీవాల్ సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆప్ చీఫ్.. తనకు వ్యతిరేకంగా బీజేపీ నిరసనలు చేయడంపై విమర్శించారు. ‘‘బీజేపీ కార్యకర్తల నిరసనలు చూసి ఆశ్చర్యపోయా. అందులో లాజిక్ లేదు. బీజేపీ ఆధ్వర్యంలోని మున్సిపల్ కార్పొరేషన్ చేసిన దాన్ని చూసేందుకే ఇక్కడి వచ్చాను. ఢిల్లీని క్లీన్ చేయడంలో బీజేపీ ఫెయిలైంది. మేం కట్టిన స్కూళ్లను, క్లినిక్‌‌‌‌లను చూసేందుకు బీజేపీ వస్తే మేం నిరసనలు చేయం” అని కౌంటర్ ఇచ్చారు. మున్సిపోల్స్‌‌‌‌లో గార్బేజ్ సమస్య పైనే పోరాటం చేస్తామని, తాము గెలిస్తే ఐదేండ్లలో ఢిల్లీని క్లీన్ చేస్తామని చెప్పారు. 

నేను మీ కొడుకును..
ఢిల్లీలోని పెద్ద వాళ్లను ఉచితంగా యాత్రలకు పంపుతున్నానని కేజ్రీవాల్ చెప్పారు. రామాయణంలో శ్రవణ కుమారుడు తన తల్లిదండ్రులను తీర్థయాత్రకు తీసుకెళ్లినట్లు తాను తీసుకెళ్తున్నానని తెలిపారు. బీజేపీ ఓటర్లు తమ సొంత పార్టీ మరిచి ఆమ్​ ఆద్మీ పార్టీకి ఓటేయాలన్నారు. మిమ్మల్ని యాత్రలకు తీసుకెళ్తున్న మీ కొడుకును గెలిపించాలని ఢిల్లీలోని తల్లులందరినీ కోరుతున్నానన్నారు. ‘‘బీజేపీ లీడర్లు మీ కొడుకు (కేజ్రీవాల్)ను, మిమ్మల్ని యాత్రలకు తీసుకెళ్లిన శ్రవణ్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ను తిడుతున్నారు. మీరు దీన్ని భరిస్తారా? వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఓటుతో బదులివ్వండి” అని కోరారు. 

రోజుకు 11 వేల టన్నుల చెత్త
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీడీ) ఎన్నికలు ఈ ఏడాది చివర్లో జరిగే చాన్స్ ఉంది. సౌత్, నార్త్, ఈస్ట్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లకు 2017లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. ఈ 3 కార్పొరేషన్లను కలిపి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌‌‌‌గా మార్చారు. ప్రస్తుతం ఢిల్లీలో రోజుకు 11 వేల టన్నుల వ్యర్థాలు పోగవుతున్నాయి. 5 వేల టన్నులు ప్రాసెస్ కాగా మిగతా వ్యర్థాలను సిటీ పరిధి ఘాజీపూర్, ఒక్లా ఏరియాల్లో డంప్​ చేస్తున్నారు. అలా ఏడాదికి 21.6 లక్షల టన్నుల వేస్ట్ పోగవుతున్నది.

బీజేపీ, ఆప్ పోటాపోటీ నినాదాలు
ఘాజీపూర్‌‌‌‌‌‌‌‌కు కేజ్రీవాల్‌‌‌‌ రాకముందే అక్కడికి చేరుకున్న బీజేపీ కార్యకర్తలు..ఆప్ జెండాలను పీకేశారు. నల్ల జెండాలతో నిరసనలు తెలిపారు. కేజ్రీవాల్‌‌‌‌కు వ్యతిరేకంగా రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో పోటీగా ఆప్ కార్యకర్తలు.. ‘బీజేపీ ముర్దాబాద్’ అంటూ స్లోగన్లు ఇచ్చారు. దీంతో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌‌‌‌ బార్డర్‌‌‌‌‌‌‌‌లోని ఘాజీపూర్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.