ఇంటర్నెట్లో వచ్చింది ఒకటే.. మాకు వందల కేసులు వచ్చాయి : మణిపూర్ సీఎం కామెంట్లతో షాక్

ఇంటర్నెట్లో వచ్చింది ఒకటే.. మాకు వందల కేసులు వచ్చాయి : మణిపూర్ సీఎం కామెంట్లతో షాక్

మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్య్యూలో సీఎం బీరేన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి ఘటనలు మణిపూర్ లో వందల సంఖ్యలో జరిగాయంటూ షాక్ గురయ్యే  విధంగా మాట్లాడారు. అయితే ఇంటర్నెట్ నిషేధం కారణంగా అవన్నీ బయటకు రాలేదన్నారు. అయితే ఇది ఒక్కటే బయటకు రావడంతో దీనిపై ప్రస్తుతం వివాదం చెలరేగిందని చెప్పుకొచ్చారు. 

అయినా కూడా ఖండిస్తున్నా..

మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరం అని సీఎం బీరేన్ సింగ్ అన్నారు. ఈ ఘటనను చూసి తాను దిగ్భ్రాంతికి గురయ్యానని చెప్పారు.  ఈ దారుణమైన నేరాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు.  ఈ దుర్ఘటనకు కారకులైన దోషులను వెంటనే అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ఇంతటి ఘోరానికి పాల్పడిని నిందితులందరికీ ఉరిశిక్ష పడే విధంగా తాము ప్రయత్నిస్తామన్నారు. 

సీఎం వ్యాఖ్యలపై దుమారం ..

మణిపూర్ లో మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనలు వందల సంఖ్యలో జరిగాయన్న సీఎం బీరేన్ సింగ్ వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. సీఎం స్థాయిలో ఉండి ఈ ఘటనపై నిర్లక్ష్య వ్యాఖ్యలు చేయడంపై ప్రజలు ఆగ్రహానికి గురవుతున్నారు. ఆయన ప్రకటన మణిపూర్ లో మరింత విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని మండిపడుతున్నారు. 

మణిపూర్‌లో మైతీలు, గిరిజన ఆదివాసీల మధ్య ఎస్టీ రిజర్వేషన్ల అంశంపై వివాదం కొనసాగుతోంది. మణిపూర్ హైకోర్టు ఆదేశాలతో  ఆ రాష్ట్ర  ప్రభుత్వం మైతీలకు అనుకూలంగా కేంద్రానికి నివేదిక సమర్పించింది. దీంతో గిరిజన ఆదివాసీలు అల్లర్లకు పాల్పడ్డారు. మే నుంచి మణిపూర్ లో హింస కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మే 4న ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించారు. అంతేకాకుండా వారిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన  వీడియో జులై 19వ తేదీ బుధవారం వైరల్ కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు  32 ఏళ్ల హీరాదాస్‌ను తౌబుల్ జిల్లాలో అరెస్ట్ చేశారు.  అటు వీడియాను  ట్విట్టర్ సహా ఇతర సోషల్ మీడియాల నుంచి తొలగించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.