పవన్ కళ్యాణ్ ను విమర్శించి.. అనవసర సమస్యలు సృష్టించొద్దు: తెలంగాణ నాయకులకు సీఎం చంద్రబాబు కౌంటర్

పవన్ కళ్యాణ్ ను విమర్శించి.. అనవసర సమస్యలు సృష్టించొద్దు: తెలంగాణ నాయకులకు సీఎం చంద్రబాబు కౌంటర్

పవన్ కళ్యాణ్ విషయంలో తెలంగాణ నేతలు చేస్తున్న విమర్శలపై స్పందించారు సీఎం చంద్రబాబు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు మంచి విధానం కాదని అన్నారు. తెలంగాణ నాయకులు ఇలాంటివి మాట్లాడి లేనిపోని సమస్యలు సృష్టించొద్దని అన్నారు చంద్రబాబు. విభజన జరిగి 12 ఏళ్లు అయ్యిందని... రెండు రాష్ట్రాలుగా విడిపోయాం... తెలంగాణలోని కొందరు నాయకులు ఇప్పుడు మాట్లాడి విద్వేషాలు రెచ్చగొట్టలేరని అన్నారు.

ఏ ప్రాంతానికి ఎవరేం చేశారో ప్రజలకు తెలుసని... తెలంగాణ లోని కొందరు నాయకులు అనవసర అంశాలు మాట్లాడుతున్నారని అన్నారు. తాను తమిళనాడులో ఎన్నికల ప్రచారం చేసి వచ్చానని.. తమిళనాడుకు కర్నాటకతో పాటు ఆలిండియా నేతలతో పాటు అన్ని ప్రాంతాల నేతలు వచ్చారని అన్నారు. కర్నాటక నుంచి డీకే శివకుమార్ కూడా వచ్చారని.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ ఉందని అన్నారు.

బీఆర్ఎస్ నేషనల్ పార్టీ అని ఆంధ్రప్రదేశ్ లో కూడా పెట్టారని... విస్తరిస్తాం అన్నారని.. మరి ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని అన్నారు. అమెరికాలో, ఆస్ట్రేలియాలో, యూకేలో తెలుగువాళ్లు రాజ్యాంగ పదవుల్లో ఉన్నారని.. ప్రపంచంలో అన్ని దేశాల్లో మన వాళ్లు పదవులు చేపడుతున్నారని.. అక్కడ ఉండే రాజ్యాంగం ప్రకారం పని చేస్తున్నారని అన్నారు చంద్రబాబు.    

ప్రజలకు ఎవరు మంచిగా సేవలందిస్తారో... వాళ్లు ఆయా ప్రాంతాల్లో నాయకులు అవుతున్నారని అన్నారు. అభివృద్ధిలో, ప్రజా సేవలో పోటీ పడాలని... ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అన్నారు చంద్రబాబు.