జగన్ భూతాన్ని రాజకీయంగా సమాధి చేస్తా.. మళ్ళీ రాకుండా చేస్తా: సీఎం చంద్రబాబు

జగన్ భూతాన్ని రాజకీయంగా సమాధి చేస్తా.. మళ్ళీ రాకుండా చేస్తా: సీఎం చంద్రబాబు

గురువారం ( జులై 17 ) నంద్యాల జిల్లా నందికొట్కూరులో పర్యటించారు సీఎం చంద్రబాబు. ఈ పర్యటనలో భాగంగా హంద్రీనీవా ప్రాజెక్టుకు నీటిని విడుదల చేశారు చంద్రబాబు. జలహారతి ఇచ్చి రెండు మోటార్లను ఆన్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు.ప్రాజెక్టులన్నీ చేపట్టింది టీడీపీనేనని.. వైసీపీ మాత్రం ప్రాజెక్టులను నాశనం చేసిందని అన్నారు. జగన్‌ భూతాన్ని రాజకీయంగా సమాధి చేస్తామని.. మళ్లీ జగన్‌ భూతం రాకుండా చేస్తానని అన్నారు చంద్రబాబు. 

2019లో ఒక్క ఛాన్స్ అంటూ వచ్చారని.. వచ్చాక నరుకుడే నరకుడు మొదలుపెట్టారని అన్నారు.హంద్రీనీవాపై ఒక్కరూపాయి అయినా ఖర్చు చేయకుండా.. సినిమా సెట్టింగులు వేసి డ్రామా ఆడారని మండిపడ్డారు.సీమకు నీరిచ్చానన్న తృప్తి ఎప్పటికీ మరిచిపోనని అన్నారు. రాయలసీమ ప్రజల కరువు కష్టాలు, బాధలు తనకు తెలుసనీ.. అనంతపురంలో కరువు వస్తే గడ్డి తెచ్చి ఆవులను కాపాడమని అన్నారు చంద్రబాబు.

హంద్రీనీవా ద్వారా ఉమ్మడి కర్నూల్, కడప, చిత్తూరు, అనంతపూర్ జిల్లాల్లో 6 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చి 33 లక్షల మందికి నీటి సౌకర్యం ఇచ్చినందుకు ఇవాళ తన జీవితంలో మరిచిపోలేని రోజుగా నిలుస్తుందని అన్నారు చంద్రబాబు. నందికొట్కూరులో ఉండే హంద్రీ, చిత్తూరులో ఉండే నీవా నదులను అనుసంధానం చేస్తామంటే అప్పట్లో ఎద్దేవా చేశారని.. ఈరోజు చేసి చూపించమని అన్నారు. హంద్రీ నీవా కల ఎన్టీఆర్ ది అయితే.. దానిని సాకారం చేసింది తానేనని అన్నారు చంద్రబాబు. 

నదులను అనుసంధానం చేయడమే తన జీవిత ఆశయమని.. కర్ణాటక, మహారాష్ట్రలో కురిసిన వర్షాలకు ఆగస్టులో రావాల్సిన వరదలు జూలైలోనే వచ్చాయని అన్నారు. రాయలసీమ గురించి మాట్లాడుతారు.. కానీ, రూ. 2,500 కోట్లు ఖర్చు చేసేందుకు వారికి మనసు రాలేదని..  ప్రాజెక్టులను వైసీపీ చెరబట్టిందని అన్నారు చంద్రబాబు.