
ఏపీలో పెనుదుమారం రేపిన ములకలచెరువు నకిలీ మద్యం ఘటనపై సీరియస్ అయ్యారు సీఎం చంద్రబాబు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు చంద్రబాబు. రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని.. ప్రజల ప్రాణాలకు చేటు చేసే నకిలీ మద్యంపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. ములకలచెరువు ఘటనలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు చంద్రబాబు.
ములకలచెరువు ఘటనపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని ఆదేశించారు చంద్రబాబు. నకిలీ మద్యం వ్యవహారంపై ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ, ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్‌తో ఆదివారం క్యాంపు ఆఫీసులో సమీక్ష నిర్వహించారు చంద్రబాబు. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబుకు మూలకలచెరువు ఘటనపై వివరాలు తెలియజేశారు అధికారులు.
ములకలచెరువులో జరిపిన ఎక్సైజ్ శాఖ తనిఖీల్లో ముందుగా కొందరు వ్యక్తులు నకిలీ మద్యం బాటిళ్లతో పట్టుబడ్డారని..., వారిని విచారించి సేకరించిన సమాచారం అధారంగా ములకలచెరువు గ్రామంలో సోదాలు నిర్వహించామని అధికారులు సీఎంకు వివరించారు. ములకలచెరువు సమీపంలోని కదిరినత్తునికోట గ్రామంలో నిర్వహించిన తనిఖీల్లో నకిలీ మద్యం తయారీ కేంద్రం బయటపడిందని అధికారులు తెలిపారు. నకిలీ మద్యం తయారు చేస్తున్న 14 మందిని గుర్తించి 10 మందిని అరెస్టు చేశామని అధికారులు తెలిపారు.ఫేక్ లేబుల్స్, వివిధ బ్రాండ్ల నకిలీ మద్యం బాటిళ్లను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.
ఈ కేసులో అరెస్ట్ చేసిన నిందితులను విచారిస్తున్నామని.. ఆర్ధిక లావాదేవీలతో పాటు నకిలీ మద్యాన్ని ఎక్కడెక్కడకు సరఫరా చేశారన్న అంశాన్ని లోతుగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు అధికారులు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరిపి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిందితులు ఎంతటి వారైనా వదలొద్దని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు.