జూబ్లీహిల్స్పై సీఎం ఫోకస్.. ఒక్కో డివిజన్కు ఇద్దరేసి మంత్రులకు ప్రచార బాధ్యతలు.. 25 నుంచి ఇంటింటి ప్రచారం

జూబ్లీహిల్స్పై సీఎం ఫోకస్.. ఒక్కో డివిజన్కు ఇద్దరేసి మంత్రులకు ప్రచార బాధ్యతలు.. 25 నుంచి ఇంటింటి ప్రచారం
  • ఇవాళ (అక్టోబర్ 24) పీసీసీ చీఫ్, మంత్రులతో రేవంత్​ భేటీ
  • రోడ్ షోలు, సభల ఏర్పాటుకు ప్లాన్ 

హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ప్రచారాన్ని మరింత వేగవంతం చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టిపెట్టారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తవడంతో ఇక ఇంటింటి ప్రచారం కోసం సీఎం రేవంత్ ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం ఏడు డివిజన్లు ఉండగా, ఇప్పటి వరకు రెండేసి డివిజన్లకు ఒక మంత్రికి ప్రచార బాధ్యతలు అప్పగించిన సీఎం.. తాజాగా ఒక్కో డివిజన్​కు ఇద్దరేసి మంత్రులకు ప్రచార బాధ్యతలను అప్పగించారు.

వీరంతా అక్టోబర్ 25 నుంచి ఇంటింటి ప్రచారంలో పాల్గొనాలని తెలిపారు. ఇక సీఎం కూడా త్వరలో రోడ్ షోలు, సభల్లో పాల్గొనేలా ప్రచార ప్రణాళికను రూపొందించుకుంటున్నారు. ప్రచార సరళీ, ఇంటింటి ప్రచారం, గెలుపు వ్యూహంపై చర్చించేందుకు శుక్రవారం (అక్టోబర్ 24) సీఎం రేవంత్ రెడ్డి.. డివిజన్ ఇన్​చార్జీలుగా ఉన్న 13 మంది మంత్రులతో పాటు వారికి సహాయంగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ లతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. పీసీసీ చీఫ్​మహేశ్ కుమార్ గౌడ్ కూడా ఇందులో పాల్గొననున్నారు. 

ఇప్పటికే జూబ్లీహిల్స్ ప్రచార బాధ్యతల్లో ఉన్న  మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ లు సహా మొత్తం 70 మంది ముఖ్యనేతలతో బుధవారం రాత్రి రేవంత్ రెడ్డి, మహేశ్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్ మీనాక్షి నటరాజన్ జూమ్ లో సమావేశమై రివ్యూ చేశారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్.. ఈ ఎన్నికపై ఆ పార్టీ ముఖ్య నేతలతో గురువారం సమావేశం కావడంతో  కాంగ్రెస్ కూడా వారి వ్యూహాలకు ప్రతి వ్యూహాలను అమలు చేయడంపై దృష్టి పెట్టింది. 

ఒక్కో డివిజన్ కు ఇద్దరేసి మంత్రులకు ప్రచార బాధ్యతలు


డివిజన్    మంత్రులు
యూసఫ్ గూడ     ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్
షేక్ పేట్     వివేక్ వెంకటస్వామి, కొండా సురేఖ
రహ్మత్ నగర్     కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
సోమాజిగూడ       శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్
ఎర్రగడ్డ       దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణా రావు
వెంగళ్ రావు నగర్    తుమ్మల నాగేశ్వర్ రావు, వాకిటి శ్రీహరి
బోరబండ      మంత్రి సీతక్కతో పాటు ఎంపీ మల్లు రవి