రాంచీ: జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలైంది. ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో ప్రధాన పార్టీలన్నీ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అధికార జేఎంఎం పార్టీ మరోసారి గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ప్రతిపక్ష బీజేపీని ఓడించేందుకు మరోసారి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగాలని జార్ఖండ్ సీఎం, జేఎంఎం చీఫ్ హేమంత్ సొరెన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అసెంబ్లీ సీట్ల షేరింగ్‌పై మిత్రపక్షమైన కాంగ్రెస్‌తో ఇవాళ (అక్టోబర్ 19) చర్చలు జరిపారు. చర్చల అనంతరం సీట్ల పంపకంపై రెండు పార్టీలు కీలక ప్రకటన చేశారు.
జార్ఖండ్‌లోని మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు గానూ 70 సీట్లలో కాంగ్రెస్, జేఎంఎం పార్టీలు కలిసి పోటీ చేస్తాయని హేమంత్ సోరెన్, కాంగ్రెస్ జార్ఖండ్ ఇన్‌ఛార్జ్ గులాం అహ్మద్ మీర్ సంయుక్తంగా ప్రకటించారు. మిగిలిన 11 సీట్ల కోసం ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలైన ఆర్జేడీ, లెఫ్ట్ పార్టీలతో సీట్ల పంపకంపై చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఈ సందర్భంగా హేమంత్ సోరెన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి కలిసి పోటీ చేస్తుంది. కాంగ్రెస్, జెఎంఎం 81 స్థానాలకు గాను 70 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాలని నిర్ణయించుకున్నాం’’ అని పేర్కొన్నారు. మిగిలిన 11 స్థానాల్లో పోటీపై చర్చలు జరుగుతున్నాయని చెప్పిన సొరెన్.. త్వరలోనే వాటికి సంబంధించిన ప్రకటన చేస్తామని తెలిపారు.
ALSO READ | ‘మహా’ సంగ్రామంలో ‘పద్మ’వ్యూహం
అయితే, ఇండియా కూటమిలో కీలక భాగస్వామ్యపక్షమైన ఆర్జేడీకి ఎన్ని సీట్లు కేటాయిస్తారనే దానిపై హేమంత్ సొరెన్ క్లారిటీ ఇవ్వలేదు. కాగా, జార్ఖండ్‌లో ప్రస్తుతం హేమంత్ సొరెన్ నేతృత్వంలోని జేఎంఎం పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్, ఆర్జేడీ, లెఫ్ట్ పార్టీలు జేఎంఎం ప్రభుత్వంలో భాగస్వామ్యపక్షాలుగా ఉన్నాయి. రానున్న ఎన్నికల్లోనూ కలిసి బరిలోకి దిగాలని నిర్ణయించుకుని సీట్ల పంపకంపై చర్చలు జరిపి ఒక నిర్ణయానికి వచ్చాయి. కాగా, జార్ఖండ్‌లోని మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు ఈ సారి రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశ పోలింగ్ 2024, నవంబర్ 13న, సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్ 2024, నవంబర్ 13వ తేదీన ఈసీ నిర్వహించనుంది. 2024, నవంబర్ 23వ తేదీన కౌంటింగ్, ఫలితాలు విడుదల కానున్నాయి.
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పూర్తి షెడ్యూల్:
- మొత్తం 81 అసెంబ్లీ సీట్లు (జనరల్ 44, ఎస్సీ 28, ఎస్టీ 9)
- మొత్తం ఓటర్లు 2.6 కోట్లు
- 1.29 కోట్లు మహిళా ఓటర్లు
- 1.31 కోట్లు పురుష ఓటర్లు
- 66.84 లక్షల మంది యంగ్ ఓటర్లు
ఫస్ట్ ఫేజ్ ఎన్నికల షెడ్యూల్:
- ఎలక్షన్ గెజిట్ నోటిఫికేషన్: 18/10/2024
- నామినేషన్ల దాఖలకు చివరి తేదీ: 25/10/ 2024
- నామినేషన్ల పరిశీలన: 28/10/ 2024
- నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: 30/10/ 2024
- పోలింగ్ జరుగు తేదీ: 13/11/ 2024
- కౌంటింగ్ తేదీ: 23/11/ 2024
సెకండ్ ఫేజ్ ఎన్నికల షెడ్యూల్:
- ఎలక్షన్ గెజిట్ నోటిఫికేషన్: 22/10/2024
- నామినేషన్ల దాఖలకు చివరి తేదీ: 29/10/ 2024
- నామినేషన్ల పరిశీలన: 30/10/ 2024
- నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: 1/11/ 2024
- పోలింగ్ జరుగు తేదీ: 20/11/ 2024
- కౌంటింగ్ తేదీ: 23/11/ 2024