నీవే సారధి.. నీవే వారధి అంటూ వైసీపీ కార్యకర్తల సిద్ధం సభ

నీవే సారధి.. నీవే వారధి అంటూ వైసీపీ కార్యకర్తల సిద్ధం సభ

 ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఆ రాష్ట్ర రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి. వైసీపీ పార్టీ మరో సారి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. ఇది వరకే సీఎం జగన్ 175కు 175 అసెంబ్లీలో వైసీపీ జెండా ఎగరాలని ఇంఛార్జిలను ఆదేశించారు. ఇందుకు తగ్గట్టుగానే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం సీఎం జగన్  ‘సిద్ధం’ పేరుతో రాష్ట్రంలో నాలుగు ప్రాంతాల్లో నాలుగుచోట్ల పార్టీ శ్రేణులతో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని ప్లాన్ చేశారు. 

ఇందులో భాగంగా మొదటి సభను ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం సంగివలసలో శనివారం నిర్వహిస్తున్నారు. ఈ సభకు ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల ప్రజలు హాజరుకానున్నారు. కొన్ని వేల మందితో ఈ సభను నిర్వహించేందుకు పార్టీ నాయకత్వం ప్లాన్ చేసింది. ఈ సభలో పార్టీ కార్యకర్తలనుద్దేశించి ముఖ్యమంత్రి జగన్‌ ప్రసంగిస్తారు. 

 

జగన్ షెడ్యుల్ ఇలా..!

సీఎం వైఎస్‌ జగన్‌ గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి శనివారం మ.2.05 గంటలకు బయల్దేరి మూడు గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్‌లో సభాస్థలికి చేరుకుంటారు. సభానంతరం తిరిగి హెలికాప్టర్‌లో విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుని గన్నవరానికి బయల్దేరుతారు.