
ఆంధ్రుల కల కడప స్టీల్ ప్లాంట్‌కు ముందడుగు పడింది. వైఎస్ఆర్ జిల్లాలోని జమ్మలమడుగు మండలం సున్నపురాళ్ళపల్లెలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్స్ లిమిటెడ్ సంస్థ నిర్మిస్తున్న స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు సీఎం జగన్ భూమి పూజ చేశారు. రూ.8,800 కోట్లతో నిర్మిస్తున్న ఈ స్టీల్ ప్లాంట్ లో మౌలిక వసతుల కల్పన కోసం రూ.700కోట్లు ఖర్చు చేస్తున్నట్లు జగన్ చెప్పారు. 24 నుంచి 30 నెలల్లో ఫస్ట్ ఫేజ్ పనులు పూర్తవుతాయని స్థానికులకు ఇక్కడే ఉపాధి లభిస్తుందని అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్‌లో ఏపీ మూడేళ్లగా నంబర్ 1గా ఉందన్న ఆయన... రాబోయే రోజుల్లో ఏపీకి మరిన్ని పెట్టుబడులు వస్తాయని చెప్పారు. భూమి పూజ అనంతరం సీఎం జగన్ శిలాఫలకాలను ఆవిష్కరించి, స్టీల్ ప్లాంట్ నమూనాను పరిశీలించారు. అనంతరం స్టీల్ ప్లాంట్ లో మౌలిక సదుపాయాలకు సంబంధించి నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు.