ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులే కీలకం...  నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం జగన్

ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులే కీలకం...  నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం జగన్

న్యూఢిల్లీలో నీతి ఆయోగ్‌ ఎనిమిదవ పాలకమండలి సమావేశం జరిగింది. ఈ  సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ రాష్ట్ర పరిస్దితులు, ప్రగతిపై నివేదిక సమర్పించారు.

నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం జగన్..

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన  నీతి అయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు. ఆరోగ్యకరమైన పెట్టుబడుల ద్వారా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలని, తద్వారా ఆర్థికవ్యవస్థ మరింత వేగంగా పురోగమిస్తుందని చెప్పారు. భారత దేశంలో లాజిస్టిక్స్ ఖర్చు చాలా ఎక్కవుగా ఉందని, లాజిస్టిక్స్‌ కోసం పెడుతున్న ఖర్చు జీడీపీలో 14శాతంగా నమోదవుతున్న విషయాన్ని సీఎం ప్రస్తావించారు. భారతీయ ఉత్పత్తులు ప్రపంచస్థాయిలో పోటీపడేందుకు ఇది ప్రతిబంధకంగా మారిందని వివరించారు. అమెరికాలో  లాజిస్టిక్స్‌ ఖర్చు కేవలం 7.5శాతానికే పరిమితం అయ్యిందని, గడచిన తొమ్మిదేళ్లలో సరకు రవాణా కారిడార్లు, జాతీయ రహదారులపై ప్రభుత్వం పెద్ద ఎత్తున వ్యవయం చేస్తోందని అన్నారు. ఆశించిన ఫలితాలను సాధించడానికి దీన్ని కొనసాగించడం చాలా అవసరమని జగన్ అభిప్రాయపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ లో పోర్టులు...

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పోర్టు ఆధారిత అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. రాష్ట్రంలో కొత్తగా 4 కొత్త పోర్టులు, 10 ఫిషింగ్‌ హార్బర్లు ఏర్పాటవుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కర్నూలులోని ఓర్వకల్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసిందని, విశాఖపట్నంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా PPP పద్ధతిలో నిర్మిస్తోందన్నారు. దేశ GDPలో తయారీ మరియు సేవల రంగం  85% దాటినప్పుడే ‘వికసిత్ భారత్’ లక్ష్యం నెరవేరుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రెండు రంగాల ప్రపంచ సగటు వాటా 91.5%. ఈ లక్ష్యాన్ని సాధించడానికి వ్యవసాయం, పెట్టుబడులు రెండింటికి సంబంధించిన అంశాలపై అత్యంత దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని సూచించారు.

ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఏపీ నెంబర్ వన్

ఆహార రంగంలో స్వయం సమృద్ధిని సాధించడంతో పాటు,  వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడానికి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడం అవసరమని చెప్పారు. తయారీ మరియు సేవల రంగాల వాటా పెరుగుదలను సాధించడానికి పెట్టుబడులు చాలా అవసరమని, దీనికి అనుకూలమైన వ్యాపార వాతావరణం తప్పనిసరని జగన్ అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గత మూడేళ్లుగా వరుసగా దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు.  వ్యాపారస్తులకు అత్యంత అనుకూలంగా అనుమతులు..  విధానాలను సరళీకృతం చేశామన్నారు. వాడుకలో లేని చట్టపరమైన నిబంధనలను సవరించటంతో పాటుగా కొన్నింటిని రద్దు చేశామని చెప్పారు.

విశాఖ సమ్మిట్ ను ప్రస్తావించిన జగన్...

నీతి ఆయోగ్ సమావేశంలో విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ ను గురించి సీఎం ప్రస్తావించారు. విశాఖపట్నంలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023కి అద్భుతమైన స్పందన లభించించిందని.. రూ. 13 లక్షల కోట్లు భారీ పెట్టుబడులకు వివిధ సంస్థలు, కంపెనీలు ముందుకు వచ్చాయన్నారు. దీనివల్ల దాదాపు 6 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ప్రజారోగ్యం, పౌష్టికాహారం కూడా చాలా ముఖ్యమని జగన్ అన్నారు.పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ ఖర్చులు, పెరుగుతున్న NCD (సంక్రమించని దీర్ఘకాలిక వ్యాధుల)ల భారం గురించి తెలుసుకోవాలని, హృదయ సంబంధ వ్యాధులు, మధుమేహం వంటి అనారోగ్యాలకు సమయానికి చికిత్స అందించకపోతే తీవ్ర సమస్యలకు దారితీస్తుందని హెచ్చరించారు. దీనిపై ఎక్కువగా శ్రద్ధపెట్టాల్సిన అవసరం ఉందని, హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌, పౌష్టికాహారంపై అత్యంత శ్రద్ధపెట్టాలన్నారు.

గ్రామ వార్డు సచివాలయాలపై జగన్ వ్యాఖ్యలు..

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10,592 గ్రామ మరియు వార్డు క్లినిక్‌లను ఏర్పాటు చేసిందని, ఇందులో ఒక మిడ్-లెవల్ హెల్త్ ప్రొవైడర్, ఒక ANMను, ఆశావర్కర్లను అందుబాటులో ఉంచాని తెలిపారు. ప్రతి విలేజ్‌ మరియు వార్డు క్లినిక్‌లో 105 రకాల అవసరమైన మందులు మరియు 14 రకాల డయాగ్నస్టిక్స్ అందుబాటులో ఉన్నాయని వివరించారు. గత రెండున్నర సంవత్సరాల కాలంలో, రాష్ట్రంలో 48,639 మంది వైద్యులు, ఆరోగ్య సిబ్బందిని నియమించి, విలేజ్‌ క్లినిక్‌ల నుంచి బోధనాసుపత్రుల వరకు అవసరమైన సంఖ్యలో వైద్యులు, నర్సులు మరియు పారామెడిక్స్ ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. విలేజ్ క్లినిక్ కాన్సెప్ట్‌ను పూర్తి సామర్థ్యంతో అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్‌ను కూడా ప్రారంభించిందన్న విషయాన్ని జగన్ ప్రస్తావించారు.


ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సేవలతో..

 విలేజ్ క్లినిక్ కాన్సెప్ట్‌ను పూర్తి సామర్థ్యంతో అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్‌ను కూడా ప్రారంభించింది, ఇందులో PHCల నుండి వైద్యులు కనీసం నెలకు రెండుసార్లు వారికి నిర్దేశించిన గ్రామాన్ని సందర్శిస్తారు. విలేజ్‌, వార్డు క్లినిక్స్‌ల సౌకర్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడానికి ముందుగా పేర్కొన్న తేదీల్లో వైద్యులు ఆయా గ్రామాలను సందర్శిస్తారు. జీవనశైలిలో వచ్చిన మార్పులు కారణంగా వచ్చే వ్యాధుల సమస్యలను సమర్థవంతంగా స్క్రీనింగ్ చేయడం, గుర్తించడం, నిర్ధారించడం, ట్రాక్ చేయడం, చికిత్స చేయడం ద్వారా విజయవంతంగా వాటిని నివారించవచ్చని మేం ప్రగాఢంగా నమ్ముతున్నామన్నారు. 

 నైపుణ్యాభివృద్ధి  కీలక అంశం

 జర్మనీ వంటి అనేక అభివృద్ధి చెందిన దేశాలు  క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నాయన్నారు ఏపీ సీఎం జగన్. తగ్గుతున్న జననాల రేటు కారణంగా, ఆ దేశాలు చివరికి శ్రామికశక్తి కొరతను ఎదుర్కొంటాయి. పని చేసే వయస్సున్న జనాభా విషయంలో తీవ్రకొరతను ఎదుర్కొంటున్నాయి. అదృష్టవశాత్తూ, దేశ జనాభాలో అధిక భాగం పనిచేసే వయస్సున్న వారే ఉన్నారు. ఇది దేశానికి అత్యంత ప్రయోజనకరం. కానీ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మిషన్‌ లెర్నింగ్‌, లార్జ్‌ లాంగ్వేజ్ల ప్రవాహం ప్రపంచాన్ని శరవేగంగా మారుస్తోంది. ఈ సృజనాత్మక యుగంలో పాతవాటి విధ్వంసం, కొత్త ఆవిష్కరణలు ఇప్పటికే ఉన్న వ్యాపార పద్ధతులను, ప్రక్రియలను, సాంకేతికతలను సమూలంగా మార్చేస్తున్నాయి. దీన్ని ఎదుర్కోవడానికి వీలుగా మనం పాఠ్యాంశాల్లోనే అర్థవంతమైన, డైనమిక్ నైపుణ్యాలను నేర్చుకునేలా కొత్తవాటిని ప్రవేశపెట్టాలి. పాఠ్యప్రణాళికను డైనమిక్‌గా తీర్చిదిద్దాలి’

మహిళా సాధికారత కోసం చేయూత, ఆసరా

మహిళా సాధికారత కోసం  ఏపీ ప్రభుత్వం చేయూత, ఆసరా వంటి అనేక పథకాలను అమలు చేస్తోందని, వీటి ద్వారా పేద మహిళలు నాలుగేళ్లోనే వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా సాయం చేస్తున్నామన్నారు. అంతేకాకుండా, మహిళా స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డి కార్యక్రమం, వారికి సకాలంలో రుణాలు ఇవ్వడం తమ ప్రభుత్వం లక్షంగా పెట్టుకుందని జగన్‌ తెలిపారు. 


అన్ని రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేయాలి..

‘సమ్మిళిత వృద్ధి లక్ష్యాన్ని సాధించడానికి మహిళా సాధికారత చాలా కీలకం. మహిళలకు ఆర్థిక వనరులు, అవకాశాలను పెంపొందించడానికి, ఏపీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. నేను వాటిలో కొన్నింటిని ప్రధానంగా ప్రస్తావిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం చేయూత, ఆసరా వంటి అనేక పథకాలను అమలు చేస్తోంది. దీని కింద వెనుకబడిన, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన అదే మహిళకు 4 సంవత్సరాలలో స్థిరంగా ఆర్థిక సహాయం అందిస్తున్నాం. – అంతేకాకుండా, మహిళా స్వయం సహాయక సంఘాలపై అధిక అప్పుల భారం ఆదాయాన్ని సమకూర్చే కార్యక్రమాల్లో వారి పెట్టుబడి సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ పోటీప్రపంచంలో వారు నిలదొక్కుకోవడం చాలా కష్టమవుతుంది. అందువల్ల, సున్నా వడ్డి కార్యక్రమం ద్వారా, సకాలంలో తిరిగి చెల్లించే షరతుపై SHGలు పొందే రుణాలపై వడ్డీ రాయితీని ప్రభుత్వం గణనీయంగా అందిస్తోంది. కేవలం నిధులను మహిళల చేతుల్లో పెట్టడంతోనే ప్రభుత్వాల పాత్ర ముగిసిపోదు. పెట్టుబడి పెట్టడానికి మరియు తీవ్రమైన పోటీని తట్టుకునేలా ఆయా కార్యక్రమాల్లో కొనసాగడానికి మహిళలకు పరిమిత సామర్థ్యం ఉందని ప్రభుత్వాలు గుర్తించాలి. అందువల్ల, వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ అనుసంధానాలను పొందడంలో మహిళలను చేయూతనిచ్చి నడిపించే ప్రగతిశీల విధానాన్ని ప్రభుత్వాలు అవలంబించాలి. చివరగా అన్ని రాష్ట్రాలూ కూడా ఒక జట్టుగా పనిచేయాలి. ప్రతి రాష్ట్రం శ్రేయస్సు మొత్తం దేశంతో ముడి పడిఉంటుంది’ అని జగన్‌ పేర్కొన్నారు.