దళితుల పేరిట సీఎం కేసీఆర్​ మరో మోసం

దళితుల పేరిట సీఎం కేసీఆర్​ మరో మోసం

ఏడేండ్ల తర్వాత కేసీఆర్ దళితుల జపం చేస్తున్నారు. ఇంతకాలం తాను దళితులకు చేసిన మోసాన్ని కప్పిపుచ్చుకునేందుకు కొత్త నాటకం మొదలు పెట్టారు. కేసీఆర్​ మాటలు వింటుంటే.. చెప్పేటోడికి వినేటోడు లోకువ అన్న సామెత గుర్తొస్తోంది. ఇంతకీ దళితబంధు స్కీమ్ నూటికి నూరు శాతం అమలవుతుందా? రాష్ట్రంలోని ప్రతి ఎస్సీ కుటుంబానికి నగదు పంపిణీ చేసే చిత్తశుద్ధి కేసీఆర్​కు ఉందా? అంటే.. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ అనుమానమే. అయినా సరే కేసీఆర్​ మాటలు కోటలు దాటుతూనే ఉన్నాయి. దళితబంధే కాదు అవసరమైతే బీసీ బంధు, మైనారిటీ బంధు.. అగ్రవర్ణాల్లో పేదల బంధు అన్నింటినీ అమలు చేస్తాం, ఇరవై ఏండ్లు తామే అధికారంలో ఉంటామంటూ కేసీఆర్ తన పార్టీ మీటింగ్​లో ఊదరగొట్టారట. తెలంగాణలో దళితులను వంచించిందెవరు? తొలి రోజు నుంచే ఎస్సీలను మోసం చేసిందెవరు? దళితుల అభివృద్ధి సంక్షేమం అంటూనే ఇచ్చిన మాట తప్పిందెవరు?

దాస్తే దాగని ఆమ్దానీ లెక్క
ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగబాకిందన్నట్లుగా.. కేసీఆర్​ ఆచరణ సాధ్యం కాని హామీలతో ప్రజలను మభ్యపెడుతున్నారు. దళితబంధుకు సరిపడేంత ఆమ్దానీ రాష్ట్రానికి ఉందా..? లేదా..? అనే విషయాన్ని దాచిపెట్టి మిగతా వర్గాల అసంతృప్తిని చల్లార్చేందుకు కేసీఆర్​ గొప్పలకు పోతున్నారు. సమగ్ర కుటుంబ సర్వే నాటి లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 1.10 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సంఖ్య 1.30 కోట్లకుపైగా చేరుకుంది. ఒక్క దళిత బంధుకే రూ.1.70 లక్షల కోట్లు అవసరమైతే రాష్ట్రంలో బీసీ బంధు, మైనారిటీ బంధు, అగ్రవర్ణాల్లోని పేదల బంధు కూడా అమలు చేయాలంటే.. దాదాపు రూ.13 లక్షల కోట్లు అవసరమవుతాయి. ప్రభుత్వ ఆస్తులు, భూములు అన్నీ అమ్మేసినా అంత భారీగా నిధులు సమకూర్చటం అసాధ్యమే. ఇప్పటికే రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది. ఏడేండ్లలో రూ.4 లక్షల కోట్ల అప్పులు తెచ్చిన ఘనత కేసీఆర్​ది.

హుజూరాబాద్​ బై ఎలక్షన్​ పుణ్యమా అని కేసీఆర్​కు ఎస్సీలు గుర్తుకు రావటం సంతోషించదగ్గ పరిణామం. తెలంగాణ రాష్ట్రంలో దళితులు అట్టడుగున ఉన్నారని.. దళితవాడలు అభివృద్ధికి దూరంగా కునారిల్లుతున్నాయని ఆయనకు ఏడేండ్ల తర్వాతైనా తెలిసొచ్చింది. తెలంగాణకు దళితుడిని తొలి ముఖ్యమంత్రిని చేస్తానని ఉద్యమ సమయంలో చెప్పిన కేసీఆర్.. రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచే దళితులను దగా చేయటం మొదలు పెట్టారు. సీఎం పదవిని దళితులకు ఇవ్వకుండా కల్వకుంట్ల ఫ్యామిలీ గుత్తాధిపత్యం మొదలుపెట్టారు. కొత్త రాష్ట్రంలో దళితులను మోసం చేసిన తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్​ చరిత్రలో నిలిచిపోయారు. ఫస్ట్ టర్మ్​లో డిప్యూటీ సీఎం పదవిని దళితుడికి కట్టబెట్టిన కేసీఆర్, మూడేండ్లు తిరక్కముందే ఆయనకు ఉద్వాసన పలికారు.
దళితబంధు టెంపరరీ ప్లాన్
దళితబంధు స్కీమ్​ మంచిదే. రాష్ట్రంలో ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఇచ్చి ఆర్థికంగా చేయాతను అందించే ఆలోచన కూడా గొప్పదే. కానీ.. కేసీఆర్​ ఇచ్చే టైమ్​ పాస్​ హామీలపైనే అందరికీ డౌట్. పైలెట్​ ప్రాజెక్టు కింద హుజూరాబాద్​లో 21 వేల దళిత కుటుంబాలకు దళితబంధు అమలు చేయాలనేది కేసీఆర్ టెంపరరీ​ ప్లాన్. అందుకే నెల రోజుల్లోనే ఆగమాగం రూ.2,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్​ చేసింది. మొత్తం డబ్బులిస్తాం, ఏదైనా.. ఎక్కడైనా వ్యాపారం, స్వయం ఉపాధి యూనిట్లు పెట్టుకోవచ్చని కేసీఆర్​ చెబుతుంటే.. వినటానికి బాగానే ఉంది. ఎస్సీ కుటుంబాల్లో ఆశలు రేకెత్తిస్తూనే ఉంది. కానీ ఇప్పటికీ సీఎం మీటింగ్​లో చెక్కులు అందుకున్న 15 మందికి తప్ప మిగతా ఎస్సీ కుటుంబాల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు. ఇప్పటికీ స్కీమ్​ అమలుపై ప్రభుత్వానికి ఒక స్పష్టత లేకపోవటం అతి పెద్ద లోపం. అసలు గైడ్​ లైన్స్​ లేకుండా లాంచ్​​చేసిన మొట్టమొదటి స్కీమ్​ ఇదే.
బై ఎలక్షన్​ తర్వాత ఇస్తారన్న గ్యారంటీ ఏముంది
హుజూరాబాద్​ ఉప ఎన్నిక తర్వాత రాష్ట్రమంతటా దళితబంధు స్కీమ్​ అమలవుతుందా..? బై ఎలక్షన్​ తర్వాత దళితులకు కేసీఆర్​ మరోసారి మొండిచేయి చూపిస్తారా..? అనే సందేహం ఎస్సీ సామాజిక వర్గాన్ని   వెంటాడుతోంది. వరుసగా తమను దగా చేస్తున్న కేసీఆర్​ ఇప్పుడు మరోసారి మోసం చేయరనే గ్యారంటీ ఏముంది..? అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 17 లక్షలకుపైగా ఎస్సీ కుటుంబాలు ఉన్నాయి. కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున.. అంటే మొత్తం 1.70 లక్షల కోట్లు అవసరం. ఇంత భారీ నిధులు కేటాయించాలంటే.. మన రాష్ట్ర బడ్జెట్​ మొత్తం సరిపోదు. ఈ ఏడాది రాష్ట్ర వార్షిక బడ్జెట్​ మొత్తం రూ.2.30 లక్షల కోట్లు. ఇందులో ఉద్యోగుల జీతభత్యాలు, నిర్వహణ ఖర్చులు, చేసిన అప్పుల కిస్తీలు, వడ్డీలన్నీ పోతే నికరంగా రూ.30 వేల కోట్లు కూడా మిగలవు. ఇప్పటికే అమల్లో ఉన్న  స్కీమ్​లన్నీ పక్కనపెట్టి ఏడాదికి రూ.30 వేల కోట్ల చొప్పున కేటాయించినా.. రాష్ట్రమంతా దళిత బంధు అమలు కావాలంటే కనీసం ఆరేండ్లు పడుతుంది. అంటే రాష్ట్రంలో వచ్చే 2023 ఎన్నికలు కూడా అయిపోతాయి. అంతకాలం కేసీఆర్​ ఇచ్చిన మాట మీద నిలబడతారా..? దళితులకు మూడెకరాల భూమి పంచిపెట్టినట్లుగా పంగనామాలు పెడతారా..? ఆలోచించుకోవాల్సిన తరుణమిది.
మూడెకరాలు పంచండి!
కేసీఆర్​ స్కీమ్​లు ఎప్పుడు మొదలవుతాయో.. ఎప్పుడు ఆగిపోతాయో తెలియని పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలి ఏడాదిలోనే కేసీఆర్​ భూమిలేని నిరుపేద దళితులకు మూడెకరాల భూమి పంపిణీ స్కీమ్​ ఆనౌన్స్​ చేశారు. 2014 ఆగస్ట్​ 15న అమల్లోకి వచ్చిన ఈ స్కీమ్​ ఆర్ధాంతరంగా ఆగిపోయింది. రాష్ట్రంలో దాదాపు 3 లక్షల మంది ఎస్సీ కుటుంబాలకు భూమిని పంచుతామని చెప్పిన కేసీఆర్.. ఇప్పటికి 7 వేల మందికి కూడా ఇవ్వలేదు. ఇచ్చినోళ్లకు పట్టాలు ఇవ్వని కేసులు.. పంచిన భూమి ఎక్కడుందో తెలియని కేసులు బోలెడున్నాయి. కరీంనగర్​ జిల్లాలో కేవలం 57 మంది దళితులకే భూ పంపిణీ జరిగింది. 21 వేల దళిత కుటుంబాలున్న హుజూరాబాద్‌‌ నియోజకవర్గంలో కేవలం 12 మందికే భూములు పంపిణీ చేశారు. మిగతా అర్హులందరూ మోసపోయారు. ఏడేండ్ల కిందట కేసీఆర్​ ఇచ్చిన మాట ప్రకారం మూడెకరాలు ఇచ్చి ఉంటే.. నిజంగానే దళితుల జీవితాల్లో మార్పు వచ్చేది. ఇప్పుడు భూముల విలువ ప్రకారం దళితులకు మేలు జరిగేది. దళితులపై కేసీఆర్​కు నిజంగానే ప్రేమ ఉంటే.. ఇప్పుడు ఇచ్చే పది లక్షలతోపాటు అర్హులైన దళితులకు మూడెకరాల భూమిని కూడా పంపిణీ చేసి తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలి.
గ్రేటర్​ మోసం.. నమ్మని జనం
నిరుడు గ్రేటర్​ హైదరాబాద్​లో భారీ వర్షం, వరదలతో వేలాది మంది నష్టపోతే కేసీఆర్​ పట్టించుకోలేదు. రాజకీయ పార్టీలన్నీ దుమ్మెత్తిపోస్తే.. రూ.10 వేల చొప్పున వరద బాధిత కుటుంబాలకు నగదు పంపిణీ చేస్తామని హడావుడి చేశారు. రెండు రోజులకే దుకాణం బంద్​ చేశారు. అందుకే కేసీఆర్​ చెప్పే మాటలపై జనానికి నమ్మకం పోయింది. ఇప్పుడు ప్రతి కుటుంబానికి రూ.పది లక్షలు ఇస్తామని కేసీఆర్​ చెబుతుంటే.. దళిత సమాజం కూడా అనుమానిస్తోంది.

అంబేద్కర్‌‌ విగ్రహమేది
హుస్సేన్‌‌ సాగర్‌‌ వద్ద 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్‌‌ ప్రకటించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్​ అంబేద్కర్‌‌ 125వ జయంతి సందర్భంగా 2016 ఏప్రిల్‌‌ 14న ఆ విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదే రోజు లోయర్‌‌ ట్యాంక్‌‌ బండ్‌‌లో హైటెక్‌‌ హంగులతో 15 అంతస్తుల అంబేద్కర్‌‌ టవర్‌‌ నిర్మాణానికి కూడా భూమి పూజ చేశారు. అయితే ఇప్పటి వరకూ అంబేద్కర్​ విగ్రహం ఏర్పాటు దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నమేదీ లేదు.                                                   - డాక్టర్​ వివేక్​ వెంకటస్వామి, మాజీ ఎంపీ, బీజేపీ కోర్​ కమిటీ మెంబర్