ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్

ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్

ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ను తెలంగాణ  సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ లో పార్టీ బలోపేతం కోసం కృషిచేయాలని ఆయనకు సూచించారు.  ఏపీలోనూ బీఆర్ఎస్ కు మంచి స్పందన లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సంక్రాంతి తర్వాత ఏపీ బీఆర్ఎస్ ఆఫీసు.. తన ఆఫీసు కంటే బిజీ అయితదని ఆయన వ్యాఖ్యానించారు. మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్ మీద పెద్ద బాధ్యత పెట్టామని.. దానికి ఆయన న్యాయం చేస్తారని కామెంట్ చేశారు. ఏపీ ప్రజలు కూడా బీఆర్ఎస్ మహా యజ్ఞంలో పాలుపంచుకోవాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఏపీ మాజీ మంత్రి రావెల కిశోర్ తనతో పాటు ఏపీలో, దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ విస్తరణలో పాలుపంచుకుంటారని చెప్పారు. ‘‘కాన్షీరాం భావజాలాన్ని బాగా అర్ధం చేసుకున్న వ్యక్తి రావెల కిశోర్. దేశంలోని దళిత వర్గం అవసరాల గురించి ఆయనకు మంచి అవగాహన ఉంది’’ అని పేర్కొన్నారు. 

‘‘ఏపీలో కూడా మేమే కర్తలం.. మేమే ధర్తలం అనేలా బీఆర్ఎస్ శ్రేణులు ముందుకుసాగాలి. ఏపీలోనూ అచ్చమైన ప్రజా రాజకీయాలు ప్రారంభం కావాలె. . తెలంగాణ గడ్డపై  నుంచి దేశవ్యాప్తంగా ప్రసరించే వెలుగు దివ్వె, చైతన్య జ్యోతి బీఆర్ఎస్’’ అని కేసీఆర్ అన్నారు.  ‘‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిది ప్రైవేటైజేషన్..  మాది నేషనలైజేషన్.. విశాఖ ఉక్కును ఇప్పుడు ప్రైవేటుపరం చేసినా.. మేం దాన్ని మళ్లీ ప్రభుత్వపరం చేస్తం.. కేంద్ర సర్కారు నిరంకుశంగా వ్యవహరించి ప్రభుత్వానికి చెందిన లక్షల కోట్ల ప్రజల ఆస్తులను వేల కోట్లకే అమ్మేసింది’’ అని కేసీఆర్ మండిపడ్డారు.  సంక్రాంతి తర్వాత దేశంలోని 7 నుంచి 8 రాష్ట్రాల్లో బీఆర్ఎస్ ఉరుకులు పరుగులు మొదలైతయని స్పష్టం చేశారు. ‘‘ దేశంలోని 6 లక్షల పైచిలుకు గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ కమిటీలు ఏర్పడాలి.  సంక్రాంతి తర్వాత కమిటీల ఏర్పాటుకు సంబంధించిన కార్యాచరణను ప్రారంభిస్తం. దేశంలోని అన్ని నియోజకవర్గాల్లో సమాంతరంగా నడుస్తం’’ అని కేసీఆర్ వెల్లడించారు.