అసైన్డ్ భూములకు పట్టాలిస్తాం.. ఇచ్చిన భూములు గుంజుకోం : కేసీఆర్

అసైన్డ్ భూములకు పట్టాలిస్తాం.. ఇచ్చిన భూములు గుంజుకోం : కేసీఆర్

అసైన్డ్ భూములకు పట్టాలు ఇచ్చి రైతులకు అన్ని హక్కులు కల్పిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. అసైన్డ్ భూములు మళ్లీ గుంజుకుంటారని కాంగ్రె స్ లీడర్లు చేస్తున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. ఇచ్చిన భూములు ఎవరైనా అలా గుంజు కుంటారా? అని ప్రశ్నించారు. గురువారం సాయం త్రం నిజామాబాద్ రూరల్, ఆదిలాబాద్, మెదక్ జిల్లా నర్సాపూర్​ నియోజకవర్గాల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ మాట్లాడారు. 

‘‘ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అసైన్డ్ భూములు ఇచ్చినం. వాటికి పట్టాలిస్తం. భూములు గుంజుకుంటారని కాంగ్రెసోళ్లు ప్రచారం చేస్తున్నరు. అట్ల ఇచ్చిన భూములు ఎవరన్న గుంజుకుంటరా? ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడొచ్చా? మొన్ననే చెప్పినం.. మేని ఫెస్టోలో కూడా చెప్పినం.. ఇప్పుడు కూడా చెప్తున్నం.. అసైన్డ్ భూములకు పట్టాలిస్తం”అని కేసీఆర్ అన్నారు. పట్టాలు ఇవ్వకపోతే ఇచ్చిన భూములపై అధికారం లేకుండా పోతుందని చెప్పారు. దళిత, గిరిజన ఎమ్మెల్యేలు కూడా పట్టాలు ఇవ్వాలని కోరి నట్లు తెలిపారు. కచ్చితంగా అసైన్డ్ భూములకు పట్టాలు ఇచ్చి అన్ని హక్కులు వారికే కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ లీడర్ల మాటలు నమ్మి ఆగం కావొద్దని సూచించారు.

మూడేండ్లు కష్టపడి ధరణి తీసుకొచ్చినం

‘‘మూడేండ్లు ఎంతో కష్టపడి ధరణి తీసుకొచ్చినం. కాంగ్రెసోళ్లు దాన్ని బంగాళాఖాతంలో వేస్తమంటున్నరు. ధరణి పోతే మళ్లీ భూముల కబ్జాలు, జుట్లు ముడేసుకునుడు, తాకట్టు పెట్టుడు, వకీళ్ల సుట్టూ తిరుగుడు మొదలైతది. ధరణిలో ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరిద్దం. నూరు మందిలో ఒకరిద్దరికి సమస్య ఉండొచ్చు.. సరి చేద్దం.. దానికేం ఆటంకం లేదు. ధరణి మొత్తం తీసేస్తే.. క్లీన్​గా ఉన్న భూముల వ్యవహారం.. మురికిగుంట అయితది. ధరణి తీసేస్తం అని చెప్పినా మాకే ఓటేసి గెలిపించిన్రని కాంగ్రెసోళ్లు అంటరు. అప్పుడు నేను కూడా ఏం చేయలేను. ధరణి లేకుంటే ఎన్ని కొట్లాటలు అయితుండే.. ఎన్ని తలకాయలు పగులుతుండెనో ఆలోచించాలి’’అని కేసీఆర్ అన్నారు. 

ధరణి ఎత్తేస్తామనడం చిన్న ముచ్చట కాదు

గతంలో భూముల రిజిస్ట్రేషన్​కు ఆరు నెలలు పట్టేదని, లంచాలు ఇవ్వాల్సి వచ్చేదని కేసీఆర్ అన్నారు. ధరణితో పది నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తవుతున్నదని చెప్పారు. ధరణి తీసేస్తే రైతుబంధు ఎలా వస్తదన్నారు. ‘‘కాంగ్రెసోళ్లు ధరణి ఎత్తేస్తామనడం చిన్న ముచ్చట కాదు.. చాలా సీరియస్ మ్యాటర్. రైతుల భూములు సేఫ్​గా ఉండాలని తలకాయలు పగులగొట్టుకుని, మూడేండ్లు కష్టపడి ధరణి తీసుకొచ్చినం. ధరణి పోతే రైతు బంధు కింద లక్ష వస్తే.. 40వేలు లంచం అడుగతరు. రైతుబంధు కావాలా..? రాబందు కాంగ్రెస్ కావాలా...? నిర్ణయించుకోండి”అని కేసీఆర్ అన్నారు. 

‘‘రైతుబంధు ఇచ్చి పైసలు వేస్ట్ చేస్తున్నారని ఉత్తమ్​రెడ్డి అంటున్నడు.. పీసీసీ అధ్యక్షుడు ఏమో.. మూడు గంటల కరెంట్ సరిపోతదని అంటున్నడు.. 24 గంటల కరెంట్ కావాలంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గెలిపించాలి”అని కేసీఆర్ సూచించారు. 

బీజేపీని చెత్తకుప్పలో పడేయాలి

మత పిచ్చి ఉన్న బీజేపీని చెత్త కుప్పలో పడేయాలని, కాంగ్రెస్​కు ఓటు వేస్తే ఇంకా వేస్ట్ అని కేసీఆర్ అన్నారు. వచ్చే రోజులు ప్రాంతీయ పార్టీలవే అని, మోదీ సర్కార్ అధికారంలోకి రాదని, సంకీర్ణ ప్రభుత్వమే వస్తుందని తెలిపారు. ‘‘కులం, మతం అనే తేడా లేకుండా తెలంగాణను ఒక దారిలో తెచ్చినం. ఇప్పుడు దుర్మార్గులు అధికారంలోకి వస్తే పాత రోజులే వస్తయ్. ఆలోచించి ఓటేయాలి”అని కేసీఆర్ సూచించారు.

సీఎం కేసీఆర్ సభలో బుల్లెట్ల కలకలం

ముఖ్యమంత్రి సభకు ఓ వ్యక్తి బుల్లెట్లతో రావడం కలకలం రేపింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మెదక్ జిల్లా నర్సాపూర్ లో బీఆర్ఎస్ పార్టీ  ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించింది.ఈ సభకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. కాగా సభకు వచ్చిన చిలప్ చెడ్ మండలం చండూరు గ్రామానికి చెందిన అస్లాం అనే యువకుడు ప్రెస్ గ్యాలరీలోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అక్కడే ఉన్న పోలీసులు అతడిని అడ్డుకుని ఐడెంటిటీ కార్డు చూపించాలని కోరారు. దాంతో అస్లాం తన జేబులో నుంచి లెదర్ పర్స్ తీశాడు. దాన్ని ఓపెన్ చేసి చూడగా..పోలీసులకు రెండు బుల్లెట్లు కనిపించాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అస్లాంను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా ఈ ఘటన గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

రైతుల ఆనందం చూసి ఓర్వలేకపోతున్నరు

50 ఏండ్ల కాంగ్రెస్ పాలనను.. పదేండ్ల బీఆర్ఎస్ సర్కార్​తో పోల్చుకోవాలని కేసీఆర్ అన్నారు. వందల్లో ఉన్న పెన్షన్ వేలల్లోకి తీసుకెళ్లామన్నారు. రైతుల సంతోషం చూసి కాంగ్రెస్ ఓర్వలేకపోతున్నదని విమర్శించారు. ‘‘సర్కార్ ఆదాయం పెరుగుతున్నా కొద్దీ స్కీమ్​లు పెంచుతున్నం. కృష్ణా, గోదావరి నదులు ఉన్నా.. గతంలో ఉన్న లీడర్లు మిషన్ భగీరథలాంటి ఆలోచన చేసి ప్రజలకు నీళ్లివ్వలేదు. ఇప్పుడు ప్రతి తండా, గూడేలకు నీరు అందుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కారణంగా ఎండాకాలంలో కూడా చెరువులు, చెక్​డ్యామ్​లు మత్తళ్లు దుంకుతున్నయ్.. గవర్నమెంట్ హాస్పిటల్స్​లో డెలివరీ అయితే.. కేసీఆర్ కిట్, ఆడపిల్ల పుడితే రూ.13వేలు, మగ పిల్లాడు పుడితే రూ.12వేలు ఇస్తున్నం’’అని కేసీఆర్ అన్నారు.