గ్రామ పంచాయతీ నిధులను పక్కదారి పట్టించినందుకు కేసీఆర్ అభినందనలు..!

గ్రామ పంచాయతీ నిధులను పక్కదారి పట్టించినందుకు కేసీఆర్ అభినందనలు..!
  •     కేంద్రమే సెపరేట్​గా అకౌంట్ తీయించినా ఫలితం శూన్యం
  •     సర్పంచ్​ల డిజిటల్ కీ 
  •     మిస్ యూజ్ చేసి మళ్లింపు 
  •     పంచాయతీరాజ్‌ అధికారులు, సిబ్బందిని మెచ్చుకున్న సీఎం
  •     ఆర్థిక సునామీ నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించిన్రని ఫోన్​కు మెసేజ్​లు

హైదరాబాద్‌, వెలుగు: కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఇచ్చిన నిధులను దొడ్డిదారిన మళ్లించిన పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు, సిబ్బందిని సీఎం కేసీఆర్ అభినందించినట్టు తెలిసింది. ‘‘ఆర్థిక సునామీ నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడిన పంచాయతీరాజ్‌ వ్యవస్థ’’ అంటూ కేసీఆర్ ప్రశంసించినట్టు సమాచారం. పంచాయతీరాజ్‌ శాఖ ఉన్నతాధికారులు డీపీవోలు, ఈ–పంచాయతీ జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు, మండల పంచాయతీ అధికారులు, కంప్యూటర్‌ ఆపరేటర్లను సీఎం ప్రత్యేకంగా అభినందిస్తూ వాళ్ల సెల్‌ఫోన్‌లకు మెసేజ్‌ పెట్టినట్టు తెలిసింది. ‘‘తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక సునామీ రాబోతుందని ముందుగానే ఊహించి.. వారం రోజులుగా పనిచేసి.. ఆర్థిక సునామీ నుంచి బయట పడేయడంతో రాష్ట్ర స్థాయి అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్రాన్ని కాపాడిన పంచాయతీరాజ్‌ అధికారులు, సిబ్బందిని సీఎం కేసీఆర్ అభినందించారు. ఇందులో కీలకపాత్ర వహించిన ప్రతి ఒక్కరినీ ప్రశంసించారు’’ అంటూ మెసేజ్​ పంపారు.

సెపరేట్​గా బ్యాంక్​ అకౌంట్లు తీసినా.. 

ఫైనాన్స్‌ కమిషన్‌ నుంచి పంచాయతీలకు ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం నేరుగా పైసలు జమ చేసేందుకు సెపరేట్​గా బ్యాంక్‌ అకౌంట్లు తీయించింది. చెక్‌ పవర్‌ ఉన్న సర్పంచ్​లు, ఉప సర్పంచ్​లే నిధులు డ్రా చేసేలా వారి సంతకాలతో డిజిటల్‌ కీ తయారు చేశారు. ఈ కీలను మండల పంచాయతీ అధికారులు తమ వద్దే ఉంచుకున్నారు. 15వ ఆర్థిక సంఘం నుంచి రాష్ట్రానికి రావాల్సిన రూ.1,415 కోట్లలో 20% నిధులు విడుదల చేసింది. ఈ నిధులు పంచాయతీ అకౌంట్స్​లో జమ కావడమే ఆలస్యం.. పంచాయతీరాజ్‌ అధికారులు వాటిని కరెంట్‌ బిల్లులు, ఇతర బిల్లుల కోసం మళ్లించారు. ఇలా సుమారు రూ.250 కోట్లు విద్యుత్‌, ఇతర సంస్థలకు మళ్లిస్తున్నట్టు చెప్తున్నా.. వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాల కోసం డైవర్ట్‌ చేసిందని, పంచాయతీల పెండింగ్‌ కరెంట్‌ బిల్లులు అసలు చెల్లించనే లేదని సర్పంచ్​లు చెప్తున్నారు. 

కేంద్ర నిధులతో బిల్లుల చెల్లింపులు

ట్రాక్టర్ల ఈఎంఐలతో పాటు కరెంట్‌ బిల్లుల కోసం స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నుంచి నిధులు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ, ఖజానాలో డబ్బు లేకపోవడంతో ఎస్టీవోకు సమర్పించిన చెక్కులు పెండింగ్‌లో పెట్టారు. ఇప్పుడు కేంద్రం నిధులు విడుదల చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు వాపస్‌ తీసుకొని, కేంద్రం నిధులతో ఆ బిల్లులకు చెల్లింపులు చేశారని సర్పంచులు చెబుతున్నారు. కేంద్రం నిధులను ట్రాక్టర్ల ఈఎంఐలు, కరెంట్‌ బిల్లుల కోసం మళ్లిస్తే.. 6 నెలలుగా ఇచ్చామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తోన్న నిధులు ఏమయ్యాయని సర్పంచులు ప్రశ్నిస్తున్నారు. ఆ నిధులు తిరిగి చెల్లించేలా ఆదేశాలివ్వాలని త్వరలోనే హైకోర్టులో పిటిషన్‌ వేస్తామని సర్పంచ్​లు తెలిపారు.

నిధులు దారిమళ్లిస్తున్నరు: బీఆర్​ఎస్​ సర్పంచ్​ల ధర్నా

ఆసిఫాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన 15వ ఆర్థిక సంఘం నిధులను.. అధికారులు తమకు తెలియకుండా దారిమళ్లిస్తున్నారని ఆరోపిస్తూ సోమవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలానికి చెందిన బీఆర్ఎస్ సర్పంచ్ లు ఎంపీడీవో ఆఫీసు ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్​లు మాట్లాడారు. తమ డిజిటల్ కీతో బిల్లులు మళ్లించిన ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శనివారం, ఆదివారం, సోమవారం సెలవులు ఉన్నప్పటికీ అధికారులు రహస్యంగా ఈ పని చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్ లంటే అధికారులు, కంప్యూటర్ ఆపరేటర్లకు గౌరవం లేకుండా పోయిందని మండిపడ్డారు. ధర్నాలో రెబ్బెన మండల సర్పంచ్ ల అధ్యక్షుడు సోమశేఖర్, పులికుంట సర్పంచ్ బుర్స పోచమల్లు, రాజారం సర్పంచ్ మల్లేశ్, పాసిగాం సర్పంచ్ మొర్లే శ్రీనివాస్, లక్ష్మీపూర్ సర్పంచ్ కోలే శ్యాంరావ్ తదితరులు పాల్గొన్నారు.

మా సంతకాలు ఫోర్జరీ చేశారు : ఠాణాలో సర్పంచ్‌ ఫిర్యాదు

తమ డిజిటల్‌ సంతకాలు ఫోర్జరీ చేసి 15వ ఆర్థిక సంఘం నిధులు దారి మళ్లించిన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ.. హుజూరాబాద్‌ ఠాణాలో అదే మండలం చెల్పూర్‌ సర్పంచ్‌ మహేందర్ ఫిర్యాదు చేశారు. మండల పంచాయతీ అధికారి వేముల సురేందర్, పంచాయతీ కార్యదర్శి మేకల రాజేందర్‌ తమ డిజిటల్‌ సంతకాలు ఫోర్జరీ చేసి డబ్బులు డ్రా చేశారని కంప్లైంట్​లో పేర్కొన్నారు. వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవడంతో పాటు డిజిటల్‌ కీని తనకు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. కంప్లైంట్​ తీసుకునేందుకు పోలీసులు నిరాకరించారని మహేందర్ తెలిపారు. దీంతో హుజూరాబాద్‌ పీఎస్​కు రిజిస్టర్​ పోస్టు ద్వారా కంప్లైంట్ పంపానని చెప్పాడు. తాము రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన సర్పంచులమని, తమకు రాజ్యాంగం కల్పించిన హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కాలరాయడంపై న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు.