టీఆర్​ఎస్​ లీడర్ల దందాల బాగోతంపై కేసీఆర్​ హైరానా

టీఆర్​ఎస్​ లీడర్ల దందాల బాగోతంపై కేసీఆర్​ హైరానా

హైదరాబాద్‌‌, వెలుగు: ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల దందాలు, సెటిల్​మెంట్లకు తోడు కుటుంబ సభ్యులపై వస్తున్న ఆరోపణలు ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నాయని టీఆర్​ఎస్​ చీఫ్​, సీఎం కేసీఆర్ హైరానా పడుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పేరు తెరపైకి రావడం, ఇసుక దందాతో పాటు అనేక భూ దందాల్లో పార్టీ ముఖ్య నేతలపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తుండటంతో అవన్నీ ప్రభుత్వం మెడకు చుట్టుకుంటాయని ఆయన ఆందోళన చెందుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో ఏడాదే గడువు ఉండటంతో లీడర్ల వ్యవహారం పుట్టిముంచే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తే కక్ష సాధింపుల పేరుతో తప్పించుకునే ఆస్కారం ఉంటుందని.. అదే లీడర్లపై లోకల్‌‌ సెటిల్​మెంట్ల ఆరోపణలు వస్తే తప్పించుకోవడం కష్టమని టీఆర్​ఎస్​ హైకమాండ్​ కలవరపడుతున్నది. వాటి నుంచి బయటపడేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలని సమాలోచనలు జరుపుతున్నది.  

ఇప్పటికే పలువురిపై రిపోర్టులు

టీఆర్‌‌ఎస్‌‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల్లో కొందరు రియల్‌‌ ఎస్టేట్‌‌ సెటిల్​మెంట్లు, దందాలు, భూ ఆక్రమణలు చేస్తున్నట్టు కేసీఆర్‌‌ దృష్టికి వచ్చింది. ఇలాంటి దందాల్లో కలుగజేసుకోవద్దని కొందరిని హెచ్చరించినా వారి తీరులో మార్పు రాలేదని సమాచారం. మరికొందరు లీడర్లు ఇసుక, ఇతర సహజ వనరుల దోపిడీలో కీలకంగా వ్యవహరిస్తున్నారని ప్రగతి భవన్‌‌కు రిపోర్టులు వచ్చాయి. 


మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితుల నివాసాల్లో ఐటీ సోదాల సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు పార్టీకి, ప్రభుత్వానికి చేటు చేసినట్టుగా  నివేదికలు అందాయి. ఐటీ అధికారులపై మల్లారెడ్డి బాహాటంగా వ్యాఖ్యలు చేయడం, ఐటీ అధికారి ల్యాప్‌‌‌‌‌‌‌‌టాప్‌‌‌‌‌‌‌‌ లాక్కోవడం, దానిపై హైడ్రామా టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌కు ఏ మాత్రం లాభం చేయకపోగా నష్టమే ఎక్కువైందని తేలింది. మంత్రి గంగుల కమలాకర్‌‌‌‌‌‌‌‌, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కుటుంబ సభ్యులపై జరిగిన ఈడీ సోదాల విషయంలో మొదట రాజకీయ విమర్శలు చేయించినా అవి అంతగా ప్రభావం చూపకపోవడంతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. మంత్రి తలసాని కుటుంబ సభ్యులను క్యాసినో కేసులో ఈడీ విచారించింది. ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్‌‌‌‌‌‌‌‌ స్కాంలో ఆరోపణలు ఎదుర్కోవడం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ కుటుంబ సభ్యులపై విమర్శలకు ఊతమిచ్చింది. వీటన్నింటి ఎఫెక్ట్​ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉంటుందని, పార్టీ ఇమేజ్​ డ్యామేజ్​ అవుతున్నదని భావిస్తున్న టీఆర్​ఎస్​ హైకమాండ్​.. వాటి నుంచి ఎలా గట్టెక్కాలని సమాలోచనలు జరుపుతున్నది. ఎవరెవరు ఏ ఏ దందాల్లో ఇరుక్కున్నారని ఆరా తీస్తున్నది. ఆయా దందాల నుంచి వెంటనే బయటపడకపోతే కష్టమని హెచ్చరిస్తున్నది.  

ఇంటెలిజెన్స్​ను రంగంలోకి దింపి..!

టీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల్లో ఎవరెవరు ఏ ఏ దందాల్లో తలదూరుస్తున్నారన్న దానిపై కేసీఆర్‌‌ ఆరా తీస్తున్నారు. లీడర్ల  వ్యవహారశైలిపై ఎప్పటికప్పుడు తనకు సమాచారం ఇవ్వాలని ఇంటెలిజెన్స్‌‌తో పాటు ఎస్‌‌బీ అధికారులను ఆయన ఆదేశించినట్టు సమాచారం. ఇదే అంశంపై కొన్ని సర్వే ఏజెన్సీలను కూడా రంగంలోకి దింపినట్టు తెలుస్తున్నది.  దాదాపు రెండేండ్లుగా రాజకీయ కోణంలోనే పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల మూవ్‌‌మెంట్స్‌‌పై నిఘా పెట్టిన సీఎం.. ఇప్పుడు వారి ఇతర వ్యవహారాలపైనా ఫోకస్​ పెట్టినట్లు టీఆర్‌‌ఎస్‌‌  ముఖ్య నేతలు చర్చించుకుంటున్నారు.