
సొంతూరి పర్యటనకు సీఎం కె.చంద్రశేఖర్ రావు సిద్ధమవుతున్నారు. వారం రోజుల పాటు సిద్దిపేట రూరల్ మండలం చింతమడకలోనే ఆయన ఉంటారని సమాచారం. పార్లమెంటు ఎన్నికల తర్వాత ఆయన సొంతూరికి వెళ్లడమిదే తొలిసారి. వారం రోజుల్లో సీఎం టూర్ ఉంటుందని సీఎంఓ వర్గాలు వెల్లడించాయి. సీఎం కేసీఆర్ టూర్‌పై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు జిల్లా కలెక్టర్, ఇతర అధికారులతో సమీక్షించారు. గ్రామంలో భూమి లేని పేదలను గుర్తించాలని, అభివృద్ధి పనులపై రెండు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో స్థానిక చెరువులు, కుంటలను అనుసంధానం చేసే మ్యాపులు సిద్ధం చేయాలన్నారు. తాగునీరు, ఇతర అభివృద్ధి పనులపై అధికారులకు సూచనలు చేశారు. పర్యటనలో భాగంగా గ్రామంలో నిర్మిస్తున్న రామాలయాన్ని సీఎం సందర్శిస్తారు. గ్రామస్తులతో సమస్యలపై చర్చిస్తారు. అనంతరం వారితో కలిసి సహపంక్తి భోజనం చేస్తారు.