సిద్దిపేట జిల్లాలో దారులన్నీ జాతర వైపే..మాఘ అమావాస్య సందర్భంగా భారీగా భక్తులు

సిద్దిపేట జిల్లాలో దారులన్నీ జాతర వైపే..మాఘ అమావాస్య సందర్భంగా భారీగా భక్తులు

సిద్దిపేట, వెలుగు: మాఘ అమావాస్యను పురస్కరించుకుని ఆదివారం సిద్దిపేట జిల్లాలో జరిగిన జాతర్లకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. అక్బర్ పేట భూంపల్లి మండలం కూడవెల్లి, నంగునూరు మండలం పాలమాకులలోని గుబ్బడి గుట్ట జాతరలకు వేల సంఖ్య లో భక్తులు తరలివచ్చారు. ఏడాదికి ఒక్కసారి మాఘ అమావాస్య రోజు మాత్రమే తెరుచుకునే దత్తాత్రేయ స్వామి ఆలయంలో భక్తులు పూజలు నిర్వహించారు. 

కూడవెల్లిలోని రామలింగేశ్వర స్వామి దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. కూడవెల్లి వాగులో పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్​చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలసి ప్రత్యేక పూజలు చేశారు. కూడవెల్లి, గుబ్బడి గుట్ట జాతరలకు  సిద్దిపేట, కరీంగనర్, వరంగల్ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.

పుల్లూరు బండకు పోటెత్తిన జనం

సిద్దిపేట రూరల్‌: సిద్దిపేట రూరల్‌ మండల పరిధిలోని పుల్లూరు గ్రామంలో వంద ఎకరాల బండపై వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజున భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తి పవిత్ర గుండం లో స్నానాలను ఆచరించి స్వామి వారిని దర్శించుకున్నారు. సర్పంచ్ లతా వెంకట్, ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ కనకయ్య గౌడ్ ఆధ్వర్యంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించారు. సీఐ శ్రీను, ఎస్ఐ రాజేశ్ బందోబస్తు నిర్వహించారు.

జన సంద్రమైన సింగరాయ 

కోహెడ: కోహెడ మండలంలో జరిగిన సింగరాయ జాతర జన సంద్రంగా మారింది. మోయతుమ్మెద వాగులో భక్తులు పవిత్ర స్నానాలు చేసి స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం చెట్ల కింద వంటలు చేసుకుని కుటుంబ సమేతంగా సహపంక్తి భోజనాలు చేశారు. రెండు గ్రామాల మధ్య సరిహద్దు వివాదం ఉండడంతో అధికారుల ఆధ్వర్యంలోనే జాతర నిర్వహించారు. 

పోలీసులు బందోబస్తు నిర్వహించారు. స్వామి వారిని దర్శించుకోవడానికి 3 గంటల సమయం పట్టింది. మంత్రి పొన్నం ప్రభాకర్​ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ కాకతీయుల కాలం నుంచి సింగరాయడి పేరు మీద జాతర జరుగుతుందన్నారు. స్వామి వారి ఆశీర్వాదం అందరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

 కొప్పోలు ఉమా సంగమేశ్వర ఆలయంలో.. 

మెదక్​(పెద్దశంకరంపేట): మెదక్​జిల్లా పెద్దశంకరంపేట మండలంలోని కొప్పోలు ఉమా సంగమేశ్వర స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. మెదక్, సంగారెడ్డి జిల్లాల నుంచి, పొరుగున ఉన్న కర్నాటక, మహారాష్ట్ర నుంచి తరలివచ్చిన భక్తులు గుండంలో పవిత్ర స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 'ఓం నమశ్శివాయ' నామస్మరణతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అవసరమైన ఏర్పాట్లుతో పాటు అన్నదానం నిర్వహించారు. 

చాముండేశ్వరీ ఆలయంలో..

చిలప్ చెడ్: చిట్కుల్ గ్రామ శివారులో ఉన్న మంజీర నదిలో పెద్ద సంఖ్యలో భక్తులు పవిత్ర స్నానాలు చేసి చాముండేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఆలయం వద్ద భక్తుల రద్దీ నెలకొంది. అర్చకులు అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చనలు నిర్వహించారు. డీఎస్పీ నరేందర్ గౌడ్, సీఐ జాన్ రెడ్డి  బందోబస్తు పర్యవేక్షించారు. 

 కేతకీ ఆలయంలో భక్తుల దర్శనాలు

ఝరాసంగం: కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయానికి మాఘ అమావాస్యను పురస్కరించుకుని భక్తులు భారీగా తరలి వచ్చారు. ఉదయం నుంచి మొదలైన భక్తుల రాక రాత్రి వరకు కొనసాగింది. స్వామి వారి దర్శనానికి నాలుగు గంటల సమయం పట్టింది. అమృతగుండంలో స్నానాలు ఆచరించి శివలింగానికి అభిషేకాలు నిర్వహించి స్వామి వారి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ పాలక మండలి చైర్మన్​ చంద్రశేఖర్​, ఈఓ శివరుద్రప్ప అన్ని ఏర్పాట్లు చేశారు.