అభివృద్ధి అంటే అప్పులు చేసుడా.. ప్రజల్ని మళ్లీ మోసం చేసేందుకే దశాబ్ది ఉత్సవాలు

అభివృద్ధి అంటే  అప్పులు చేసుడా.. ప్రజల్ని మళ్లీ మోసం చేసేందుకే దశాబ్ది ఉత్సవాలు

సీఎం కేసీఆర్.. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించడం వెనుక కుట్ర దాగి ఉంది. వేడుకల పేరుతో రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేయడం తప్ప ఇంకోటి కాదు. ఈ తొమ్మిదేండ్లలో ఉద్యమ ఆకాంక్షలను ఏం సాధించారని ఉత్సవాలను నిర్వహిస్తున్నరో కేసీఆర్ జవాబు చెప్పాలి. నిజంగానే తెలంగాణ సమాజం ఆశయాలకు అనుగుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం  పాలన సాగిస్తే.. ప్రజలే స్వచ్ఛందంగా పండుగ చేసుకునే వారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సంబురాలు చేసే పరిస్థితి వచ్చేది కాదు. ఈ ఉత్సవల పేరు మీద తెలంగాణ ప్రభుత్వ తప్పిదాలను, అవినీతి, అక్రమాలను, కుటుంబ, నియంత పాలనను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నరు. కేసీఆర్ ఎంత ఘనంగా, ఎన్ని రోజులు ఈ సంబురాలు చేసినా తెలంగాణ ప్రజల కన్నీటి వ్యథ ఆగేది కాదు. వారికి జరిగిన మోసాలను మరిచిపోకుండా ఉండలేరు. 12 వందల మంది ఆత్మబలిదానాలకు ఈ సంబురాలు ఏమాత్రం నివాళి అర్పించలేవు. అమరుల కుటుంబాల కన్నీళ్లను ఈ వేడుకలు తుడవలేవు.

ఉద్యమం నుంచి మొదలుకుంటే ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిదేండ్లుగా కేసీఆర్ అడుగడుగునా మోసం, దగా  చేస్తూనే ఉన్నారు. అయినా తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు  రెండుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇచ్చి తమ గొప్ప మనస్సును చాటుకున్నారు. అయినా ఆ ప్రజల మంచి మనసును తన పాలన ద్వారా కేసీఆర్ ఏమాత్రం గుర్తించలేకపోయిండు.  అందుకే మూడోసారి మాత్రం కేసీఆర్ కు ఆ  అవకాశం ఇవ్వకూడదు. ఈసారి బీజేపీకి అవకాశం ఇచ్చి తెలంగాణ అభివృద్ధిని చూడాలి. నేను నా సమాజానికి ఇచ్చే పిలుపు ఇదే. నేను ఏ తెలంగాణ కోసమైతే కలగన్నానో.. ఇప్పుడు నా కళ్ల ముందు అది కనిపించడం లేదు. నేనే కాదు ...నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల మనస్సుల్లో ఉన్నది కూడా ఇదే. పది మంది చెల్లెలు (తొమ్మిది మంది సొంత చెల్లెలు, నన్ను పదో చెల్లిగా చూశాడు) రాఖీలు కడితే వారికి లక్ష రూపాయలు ఇచ్చేందుకు (తలా పది వేల రూపాయలు) రోజంతా ఎక్కడెక్కడో తిరిగి, ఎవరెవరినో డబ్బులు అడిగిన నీవు.. ఇవ్వాళ లక్షల కోట్ల రూపాయలు నీకు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పే దమ్ము, ధైర్యం ఉందా.. కేసీఆర్. 

అమరుల కుటుంబాల్ని ఆదుకున్నవా?

ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు, ఇచ్చిన వాటికి ప్రశ్నాపత్రాల లీక్. నిరుద్యోగ భృతి లేదు. ఇంటర్మీడియెట్ వాల్యూయేన్ లో తప్పుల తడకతో ఎందరో విద్యార్థుల ఆత్మహత్యలు.. ఇందుకేనా ఈ దశాబ్ది ఉత్సవాలు. సర్పంచులకు నిధులు ఇవ్వకుండా, కేంద్రం ఇచ్చే నిధులను సైతం వారికి దక్కనీయట్లేదు. దళితులకు 3 ఎకరాల భూమి లేదు. డబుల్ బెడ్ రూం ఇండ్లు లేవు. తలా..తోక లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి వేల కోట్ల రూపాయలను కమీషన్లుగా దండుకోవడం తప్ప.. ఒక్క ఎకరాకు సాగునీరు ఇచ్చింది లేదు. అమరుల కుటుంబాలను ఆదుకున్నది లేదు. ప్రభుత్వ భూములు అమ్మి రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగిస్తూ తెలంగాణ సంపదను దోచుకుంటున్నది ఈ సర్కార్. తెలంగాణ వచ్చింది ఇందుకేనా...ఇచ్చిన హామీలను విస్మరించినందుకేనా ఈ ఉత్సవాలు. ఓఆర్ఆర్ టోల్ గేట్ స్కాం, లిక్కర్ స్కాం, లీకేజీల పాలన.. ఇదేనా తొమ్మిదేళ్లలో సాగించిన ప్రగతి. ధరణి పేరుతో రైతుల భూములను దోచుకోని వారి కంట కన్నీరు రాలితే చూసి ఆనందించడం నిజాం మార్క్ పాలన కాదా.

పార్లమెంటులో ఏనాడైనా పోరాడినవా?

పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పెట్టిన సందర్భంలో నేను చేసిన పోరాటం దేశం గుర్తించింది. మేనకా గాంధీ వంటి నేతలు సైతం నా ధైర్యాన్ని అభినందించారు. ఒక ఎంపీగా నా పోరాటం ఏమిటో అందరికి తెలిసిందే. అదే కేసీఆర్.. నువ్వు పదా విజయా నేను నీ వెనకాలే వస్తున్నా.. అని నాతో చెప్పి సభలో వెనుక నుంచి బయటకు వెళ్లిన తీరును తెలంగాణ సమాజం మరిచిపోలేదు. తెలంగాణ ఏర్పాటుపై నీకున్న చిత్తుశుద్ధి అలాంటిది.. నాకున్న కామిట్ మెంట్ ఇది. తల్లి తెలంగాణ పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేయకుండా ప్రత్యేక రాష్ట్రం కోసం అలుపెరగని పోరాటం చేస్తుంటే.. జయశంకర్ వంటి పెద్దల ద్వారా ఒత్తిడి తీసుకువచ్చి నా పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేసుకొని ఆ తర్వాత మోసం చేసిండు. నేను కలగన్న తెలంగాణను కళ్లారా చూసే వరకు ఎక్కడిదాకైనా.. ఎవరితోనైనా పోరాడటానికి సిద్ధం. నాలుగు కోట్ల మంది జీవితాలతో ఆడుకుంటున్న కేసీఆర్ పై అలుపెరగని పోరాటం చేస్తా.

ఆరు లక్షల కోట్ల అప్పు

అభివృద్ధి అంటే అప్పు చేయడమేనా.. నిజంగానే రాష్ట్రంలో అభివృద్ధి జరిగితే మరి రూ. ఆరు లక్షల కోట్ల అప్పులు ఎలా చేశారు. దీనికి ఆయన చెప్పే సమాధానం ఏమిటి? మోడీ ప్రభుత్వం అంత పెద్ద పార్లమెంట్ భవనం కడితే చేసిన ఖర్చు రూ. 8 వందల కోట్లు.. మరి రాష్ట్రంలో సెక్రటేరియెట్ భవనానికి అయిన ఖర్చు రూ. 12 వందల కోట్లు...ఎందుకు ఇంత ఖర్చు అయిందో కేసీఆర్ సమాధానం చెప్పగలడా...ఇంత ప్రజా ధనాన్ని ఆయన దుర్వినియోగం చేస్తున్న సంగతి తెలంగాణ సమాజం గమనిస్తలేదు అనుకుంటున్నాడేమో. కానీ ఆరు నెలల్లో వచ్చే ఎన్నికల్లో ప్రజలు వీటన్నింటికి సరైన జవాబు ఇస్తారు.

- విజయశాంతి, బీజేపీ సీనియర్ నేత