తెలంగాణ భాషామృతాన్ని పంచిన సహజకవి పోతన

తెలంగాణ భాషామృతాన్ని పంచిన సహజకవి పోతన
  • బమ్మెరను ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతాం
  • బమ్మెర పోతనకు సీఎం కేసీఆర్ నివాళి

హైదరాబాద్: భాగవతాన్ని తెలుగులోకి అనువదించి తెలంగాణ భాషామృతాన్ని పంచిన సహజ కవి బమ్మెర పోతన అని సీఎం కేసీఆర్ కొనియాడారు. బమ్మెర పోతన జయంతిని పురస్కరించుకుని పోతన సాహితీ సౌరభాన్ని సీఎం స్మరించుకున్నారు. కవిగా, సాహితీవేత్తగా పోతనామాత్యుల కీర్తి తెలుగు సాహితీ చరిత్రలో చిరకాలం నిలిచిపోతుందని సీఎం తెలిపారు.  తన కావ్యాన్ని రాజులకు కాకుండా భగవంతుడైన శ్రీరామునికి అంకితమిచ్చి పోతన తన ఆత్మగౌరవాన్ని చాటుకున్నారని కొనియాడారు. భాగవతం ద్వారా అలతి అలతి పదాలతో  శ్రీకృష్ణతత్వాన్ని సామాన్యులకు పంచిన ఘనత పోతన దక్కుతుందని అన్నారు.  

కర్ణపేయమై తన్మయత్వంలో ముంచెత్తడం పోతన శైలి అని సీఎం పేర్కొన్నారు. పోతన పద్యాన్ని వినని తెలుగువారుండరు అంటే అతిశయోక్తి కాదని  చెప్పారు. పోతన జన్మస్థలమైన బమ్మెరలో పోతన స్మారకార్థం పలు అభివృద్ధి చేపట్టినట్లు వెల్లడించారు. భవిష్యత్తులో బమ్మెర ప్రాంతాన్ని సాహితీ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని, ఆ మహాకవి స్పూర్తితో  తెలంగాణ భాషకు, కవిత్వానికి పెద్దపీట వేస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు.